ఔటర్‌కు ‘మైక్రో’ పూత! | micro surfacing to ouer ring road | Sakshi
Sakshi News home page

ఔటర్‌కు ‘మైక్రో’ పూత!

Published Fri, Dec 8 2017 1:06 AM | Last Updated on Fri, Dec 8 2017 1:06 AM

micro surfacing to ouer ring road - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోనే తొలి 8 వరుసల ఎక్స్‌ప్రెస్‌ వేగా రికార్డుల్లోకెక్కిన హైదరాబాద్‌ ఔటర్‌ రింగురోడ్డుకు ఇప్పుడు విదేశీ పరిజ్ఞానంతో నిర్వహణ పనులు చేపట్టబోతున్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అత్యంత నాణ్యతతో నిర్మించిన ఈ రోడ్డుకు తొలిసారి ఈ పనులు చేయబోతున్నారు. సాధారణ పద్ధతుల్లో చేస్తే నాణ్యత దెబ్బతినే ప్రమాదముండటంతో విదేశీ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.స్పెయిన్‌కు చెందిన ఓ సంస్థ దీన్ని చేపట్టబోతోంది. మైక్రో సర్ఫేసింగ్‌గా పేర్కొనే ఈ విధానంలో నేరుగా తారు కాకుండా ‘ఎమల్షన్‌’ను వినియోగించనున్నారు.

జర్మనీ యంత్రాల సాయంతో 8 మిల్లీమీటర్ల మందంతో ఈ మిశ్రమాన్ని రోడ్డు పైపూతగా వేస్తారు.  ఫలితంగా రోడ్డు ఎక్కువ కాలం మన్నుతుంది. ఈ తరహా పూతలను దేశవ్యాప్తంగా ప్రధాన జాతీయ రహదారులపై వేయించాలని ఇటీవలే కేంద్ర ఉపరితల రవాణా శాఖ నిర్ణయించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రయోగాత్మకంగా గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ మధ్య 24 కిలోమీటర్ల మేర దాదాపు రూ.19 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ నెలాఖరుకు పనులు ప్రారంభం కానున్నాయి.

ఖర్చు తక్కువ.. మన్నిక ఎక్కువ..
సాధారణ మరమ్మతులతో పోలిస్తే మైక్రో సర్ఫేసింగ్‌ విధానం నాణ్యమైందే కాకుండా ఖర్చు తక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తారుతో వేసే పొరతో అయ్యే ఖర్చులో 60 శాతమే అవుతుందంటున్నారు. ఇప్పుడు ప్రతిపాదించిన గచ్చిబౌలి–శంషాబాద్‌ రోడ్డు నేరుగా హెచ్‌ఎండీఏ పర్యవేక్షిస్తోంది. ప్రతిరోజూ 10 వేల చదరపు మీటర్ల మేర పనులు జరుగుతాయి.

ఇక్కడిలా.. అక్కడలా..
గచ్చిబౌలి–శంషాబాద్‌ మార్గంలో మైక్రో సర్ఫేసింగ్‌ పద్ధతిలో తక్కువ ఖర్చుతో నిర్వహణ చేపడుతుండగా, పెద్ద అంబర్‌పేట–బొంగుళూరు మార్గంలో నిర్వహణ బాధ్యత చూస్తున్న కాంట్రాక్టు సంస్థ ఆధ్వర్యంలో తారుతో పనులు చేపడుతున్నారు. దీంతో   12 కిలోమీటర్లకు రూ.18 కోట్లు ఖర్చు అవుతున్నాయి.

ఇది యాన్యుటీ పద్ధతిలో 2023 వరకు నిర్మాణ సంస్థకే బాధ్యత అప్పగించారు. మరమ్మతుల మొత్తాన్ని కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆ సంస్థకు అందజేసింది. దీంతో ఆ మొత్తానికి సరిపడేలా పనులు చేపట్టారు. మైక్రో సర్ఫేసింగ్‌ పద్ధతిలో పని జరిపితే ఖర్చు తగ్గేది. అయితే ఎంత తగ్గితే అంత మొత్తాన్ని ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సి వస్తుందని ఖర్చు పెరిగే సంప్రదాయ పద్ధతిలో పనులు చేపట్టడం విమర్శలకు తావిస్తోంది.


వైఎస్‌ హయాంలో నిర్మాణ పనులు..
దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 2008లో 8 వరుసలతో ఔటర్‌ రింగు రోడ్డు నిర్మాణం ప్రారంభమైంది. తొలుత గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ మార్గాన్ని ప్రారంభించారు. ఇది అందుబాటులోకి వచ్చినప్పట్నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మతులు, నిర్వహణ పనులు జరగలేదు. ఇటీవల రోడ్డు పైభాగం చెదిరిపోతుండటంతో రోడ్డు గుంతలు పడే పరిస్థితి ఏర్పడింది. దీంతో వెంటనే నిర్వహణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ పనులకు మూడేళ్ల గ్యారంటీ కూడా ఇచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement