సమస్యలు తుక తుక
సాక్షిప్రతినిధి, నల్లగొండ :ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో సమస్యలు తుకతుక ఉడుకుతున్నాయి. ఏటా రూ.70కోట్ల బడ్జెట్ ఉన్న ఈ పథకం విద్యార్థులకు పరీక్ష పెడుతోంది. జిల్లావ్యాప్తంగా 3301 స్కూళ్లలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం ద్వారా 3.28 లక్షల మంది ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులు లబ్ధిపొందుతున్నారన్నది అధికారుల లెక్క. ప్రభుత్వం కేటాయించిన రూ.70కోట్ల బడ్జెట్‌లో రూ.36లక్షలు కేవలం ఆహారం కోసమే వినియోగిస్తున్నారు. అంటే నెలకు రూ.36లక్షల చొప్పున పిల్లల భోజనాల కోసం ఖర్చు చేస్తున్నారు.
కానీ భోజన నాణ్యత ప్రమాణాలు అథమస్థాయిలో ఉన్నాయి. ఈ పథకంలో ప్రధానంగా 300 కేలరీలు, 8 నుంచి 12గ్రాముల ప్రొటీనులు ఉన్న ఆహారాన్ని విద్యార్థులకు అందివ్వాలి. ప్రాథమిక పాఠశాలలోని ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.4.50, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఒకొక్కరికి రోజుకు రూ.6చొప్పున భోజనం కోసం ఖర్చు చేయాల్సి ఉంది. కానీ, దీనికి పూర్తి భిన్నంగా పథకం అమలవుతోంది. ధరలు పెరిగిపోయాయని కోడిగుడ్లు ఇవ్వడం మానేశారు. అరటి పండు ఇవ్వాలన్న సంగతే మరిచారు. చారులా తయారు చేసిన కూరలు, నీళ్లలా కనిపించే చారుతో భోజనాలు పెడుతున్నారు. ఇక, పౌరసరఫరాల శాఖ సరఫరా చేస్తున్న బియ్యం, తినే అన్నానికి ఏమాత్రం పనికి రావడం లేదు. పురుగులు, మెరిగెలు, నూకలతో పాటు అన్నం ముద్దలు, ముద్దలుగా, బంక బంకగా ఉండడంతో విద్యార్థులు తినలేక చస్తున్నారు.
నల్లగొండ నియోజకవర్గంలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేందుకు అవసరమైన గ్యాస్ సౌకర్యం లేక ఏజెన్సీలు ఇబ్బందులు పడుతున్నాయి. తిప్పర్తి మండలంలో వంటగదులు ఉన్నా గ్యాస్ లేకపోవడంతో చెట్లకిందనే వంట చేస్తున్నారు. నల్లగొండ మండలంలో వంటగదులు, గ్యాస్ రెండూ లేకపోవడంతో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు అస్తవ్యస్తంగా మారింది. కనగల్ ఆదర్శ పాఠశాలలో మంచినీళ్ల సౌకర్యం లేకపోవడంతో స్కూళ్లో వంటలు వండడం లేదు. మూడు కిలోమీటర్ల దూరంలో వంట చేసి తీసుకొస్తున్నారు. తాగునీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మూత్రశాలల శుభ్రం చేసేందుకు ఏర్పాటు చేసిన నీళ్ల ట్యాంకు వద్దనే విద్యార్థులు తమ ప్లేట్లను కడుగుతున్నారు. తిప్పర్తి మండలం పజ్జూరు ప్రాథమిక పాఠశాల, హైస్కూల్‌లో ఏజెన్సీల మద్య ఘర్షణ నెలకొనడంతో మధ్యాహ్న భోజన పథకం ఆగిపోయింది. దీంతో ఏజెన్సీలను పక్కన పెట్టి పాఠశాల యాజమాన్య కమిటీకి బాధ్యత అప్పగించారు.
మిర్యాలగూడ నియోజకవర్గంలో మొత్తం 206 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. కాగా వాటిలో 69 పాఠశాలల్లో మంచినీటి సౌకర్యం, 99 పాఠశాలల్లో వంట గదులు లేవు. దామరచర్ల మండలంలో 39 పాఠశాలల్లో వంట గదులు నిర్మించినా ఇరుగ్గా ఉండడంతోఆరుబయటనే వంటలు చేస్తున్నారు. భోజనం నాణ్యతగా లేకపోగా కొన్ని పాఠశాలల్లో కోడిగుడ్లను ఇవ్వడం మరిచిపోయారు. మిర్యాలగూడ పట్టణంలోని బకల్‌వాడ ఉన్నత పాఠశాలో స్కూళ్లు పునః ప్రారంభమైన నాటి నుంచి కూడా భోజనంలో కోడిగుడ్లు పెట్టడంలేదు.
సూర్యాపేట నియోజకవర్గంలో 154 ప్రాథమిక , 26 ప్రాథమికోన్నత, 33ఉన్నత పాఠశాలల్లో ఈ పథకం అమలవుతోంది. సూర్యాపేట మండలంలో యండ్లపల్లి ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో వంట చేసేందుకు మహిళా సంఘాలు పోటీ పడటంతో రెండేళ్లుగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం బంద్ అయ్యింది. పెన్‌పహాడ్ మండలంలో చెట్లకింద, వాటర్ ట్యాంకుల కింద భోజనం వండాల్సి వస్తోందని ఏజెన్సీల వారు వాపోతున్నారు. నెమ్మికల్ ఉన్నత పాఠశాలలో మినహా ఆ మండలంలో ఒక్క పాఠశాలలో కూడా వంట గదులు లేవు.
భువనగిరి నియోజకవర్గంలో మధ్యాహ్న భోజనానికి వండిపెట్టే బియ్యం నాసిరకంగా ఉండడంతో రుచి లేక చాలా మంది విద్యార్థులు భోజనం చేయడంలేదు. భోజనంలో పురుగులు వస్తుండడంతో విద్యార్థులు పాఠశాలలో భోజనం చేయకుండా ఇంటికెళ్లి తింటున్నారు. నియోజకవర్గంలో ఏ పాఠశాలలో కూడా ప్రభుత్వం అందించిన ప్రకారం మెనూ అమలు కావడంలేదు. వారానికి గుడ్డు, అరటి పండు ఇస్తలేరని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇక పాఠశాలలో తాగునీటి సౌకర్యం లేక విద్యార్థులు ఇంటి నుంచే బాటిల్‌లో నీరు తెచ్చుకుంటున్నారు. 60 పాఠశాలలకు ఇంకా వంటగదులు లేవు.
మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వండిన అన్నం ముద్దగా అవుతోంది. దాదాపు 100 మంది విద్యార్థులు ఇంటి నుంచే భోజనం తెచ్చుకుంటున్నారు. ఎల్లగిరిలో ఫ్లోరిన్ నీళ్లతో అన్నం వండడంతో పచ్చగా మారింది. తుఫ్రాన్‌పేటలో బియ్యం పురుగుపట్టాయి. గుడ్డు ఎక్కడా పెట్టడం లేదు. సంస్థాన్ నారాయణపురం మండలం ఆరెగూడెం, పుర్లకుంట ప్రాథమిక పాఠశాలల్లో ఏజెన్సీలు ఇంటి వద్దే అన్నం వండి తీసుకొచ్చి పిల్లలకు వడ్డిస్తున్నారు. మర్రిగూడ డలంలోని రాంరెడ్డిపల్లి, అంతంపేట, నామాపురం ఉన్నత పాఠశాలల్లో ఆరుబయటే వంట వండుతున్నారు. నాగార్జున సాగర్ యోజకవర్గంలో మొత్తంగా 340 ప్రభుత్వ పాఠశాలలున్నాయి.
ఇందులో సగం పాఠశాలల్లో కూడా వంట గదులు లేవు. ఆరుబయటే వంట వండుతున్నారు. ఏ పాఠశాలలో మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టడం లేదు. గుడ్ల ధర పెరిగిందని వారానికి ఒక్క కోడిగుడ్డు మాత్రమే ఇస్తున్నారు. కూరగాయల ధరలు మండిపోతున్నాయని నీళ్ల చారు. ముద్దన్నమే పెడుతున్నారు. మెజార్టీ పాఠశాలల్లో మంచినీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఇంటి నుంచే నీళ్ల బాటిళ్లు తెచ్చుకుంటున్నారు.
నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని స్కూళ్లలో వండిపెడుతున్న అన్నం బంకతో ముద్దలు ముద్దలుగా ఉండడంతో విద్యార్థులు తినలేకపోతున్నారు. నీళ్ల చారు, రెండు రకాల కూరగాయలు మాత్రమే వండి పెడుతున్నారు. కేతేపల్లి మండలంలో వంటగదులు మరమ్మతులకు నోచుకోక, శిథిలావస్థకు చేరుకున్నాయి. చిట్యాల మండలంలో నిర్మించిన వంట గదులను వంట సామగ్రి నిల్వకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. ఉరుమడ్లలో వాటర్‌ట్యాంకు కిందనే వంట చేస్తున్నారు. కట్టంగూర్ మండలంలో వంట గదులు నిరుపయోగంగా మారాయి. గదులు చిన్నవిగా ఉండడంతో ఆరుబయటే వంటలు చేస్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో 303 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 228 పాఠశాలలకు వంట గదులు నిర్మించారు. 76 చోట్ల గదుల నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోవని వదిలేశారు. నిర్మించిన వంట గదులు చిన్నవిగా అసౌకర్యంగా ఉండడంతో ఆరు బయటనే వంటలు చేస్తున్నారు.
కూరగాయలు, కోడి గుడ్లకు ధరలు బాగా పెరగడంతో వారానికి ఒకసారి మాత్రమే కోడి గుడ్డు అందిస్తున్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో 247 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వాటిలో 135 పాఠశాలలకు వంట గదులు లేవు. ఆరుబయటనే వంట చేస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం నాసిర కంగా ఉంది. గడిచిన విద్యాసంవత్సరం 2013-14 కు గాను 9,10 తరగతులకు సంబంధించిన విద్యార్థులకు అందజేయాల్సిన బిల్లులు, ఏడు నెలలుగా మంజూరు కాలేదు. 8వ తరగతి వరకు విద్యార్థులకు సంబంధించిన బిల్లులను ప్రతినెలాఅందజేయకుండా రెండు నెలలకొకసారి చెల్లిస్తున్నారు. కోదాడ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బియ్యం నాణ్యంగా లేక భోజనం సక్రమంగా ఉండడం లేదని నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కూరగాయల ధరలు, కోడిగుడ్ల ధరలు పెరిగిపోవడంతో నిర్వాహణ తమకు భారం అవుతుందని ఏజెన్సీ నిర్వాహకులు వాపోతున్నారు.
ఆలేరు నియోజకవర్గంలో మధ్యాహ్న భోజనం అమలు సక్రమంగా జరగడంలేదు. యాదగిరిగుట్ట, ఆలేరు, రాజ పేట, బొమ్మలరామారం, తుర్కపల్లి, గుండాల, ఆత్మకూరు మండలాల్లో వంటగదుల సమస్య తీవ్రంగా ఉంది. 268 పాఠశాలలకు గాను 100 పాఠశాలల్లో వంటగదులు లేవు. మధ్యాహ్న భోజనానికి వండిపెట్టే బియ్యం నాసిరకంగా ఉండడంతో రుచిలేక చాలామంది విద్యార్థులు భోజనం చేయడం లేదు. వారానికి గుడ్డు, అరటి పండు ఇవ్వడం లేదు. ఇక పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం లేక విద్యార్థులు ఇంటి నుంచే తెచ్చుకుంటున్నారు. అంతేకాక అపరిశుభ్ర పరిసరాలలో భోజన ం చేయాల్సిన పరిస్థితి దాపురించింది. కొన్నిచోట్ల వంట గదులు నిర్మించినా అవి సరిపోవడం లేదు.