తమకు జీవితాన్ని ఇచ్చిన పల్లె రుణం తీర్చుకోవాలనే ఆకాంక్షతో పలువురు ప్రవాసులు భారీ వేతనాలను సైతం వదులుకుని స్వగ్రామాలకు చేరుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి సర్పంచ్‌లుగా ఎన్నికై ప్రజాసేవకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ పల్లెల్లో జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో పలువురు ప్రవాసులు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. అలాగే రెండో విడత, మూడో విడత పంచాయతీ బరిలోనూ మరి కొందరు పోటీలో ఉన్నారు. గల్ఫ్ దేశాల్లో పనిచేసి ఏటా రూ.కోట్లాది విదేశీ మారక ద్రవ్యాన్ని మన దేశానికి తెచ్చిపెట్టిన ప్రవాసులు ఇప్పుడు పల్లెలను పాలించే బాధ్యతలను స్వీకరిస్తున్నారు.
–సాక్షి నెట్‌వర్క్
ఉన్నత ఉద్యోగం వదులుకుని..
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం సుంకెట్‌కు చెందిన కడారి శ్రీనివాస్ దుబాయ్‌లోని ఒక ప్రముఖ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా విధులు నిర్వహించారు. కంపెనీలో పనిచేస్తూనే ఎన్‌ఆర్‌ఐ పాలసీ కోసం ఉద్యమించారు. స్వచ్చంద సంస్థల ప్రతినిధిగా యూఏఈలో కష్టాల్లో ఉన్న కార్మికులను ఆదుకోవడంలో శ్రీనివాస్ పాత్ర ఎంతో ఉంది. అయితే, తాను పుట్టి పెరిగిన ఊరికి ఏదో ఒక సేవ చేయాలనే సంకల్పంతో నెలకు రూ.1.10లక్షల వేతనం వచ్చే ఉద్యోగాన్ని వదులుకుని పంచాయతీ పోరులో నిలిచారు. 239 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. దాదాపు 17 ఏళ్ల నుంచి దుబాయ్‌లో పనిచేస్తున్న శ్రీనివాస్ 2001లో తొలిసారి సర్పంచ్‌గా పోటీచేసి ఓడిపోయారు. మళ్లీ గల్ఫ్‌కు వెళ్లి ఉద్యోగం చేశారు. ఈసారి తనను సర్పంచ్‌గా గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని, సుంకెట్‌ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని శ్రీనివాస్ చెబుతున్నారు.
గల్ఫ్‌కు స్వస్తి.. ఊరితో దోస్తీ
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లికి చెందిన బూర్గుల నందయ్య వ్యవసాయం కలిసిరాకపోవడంతో బతుకుదెరువు కోసం ఐదేళ్ల క్రితం దుబాయికి వెళ్లాడు. అక్కడ ఓ కంపెనీలో పనికి కుదిరాడు. కాగా, ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో వెంకట్రావుపల్లి బీసీ జనరల్ కావడంతో నందయ్య దుబాయి నుంచి వచ్చి పోటీచేశారు. హోరాహోరీ పోటీ ఉన్నా.. నందయ్య విజయం సాధించారు. ఈయన 2013 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచిగా పోటీచేసి ఓడిపోయారు. మన దేశంలోనే బతకాలని గల్ఫ్ నుంచి వచ్చానని, ఊరుకి సేవ చేయాలని సర్పంచిగా ఎన్నికయ్యానని నందయ్య చెప్పారు. గ్రామస్తుల నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తానని, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు.
సౌదీ నుంచి వచ్చి సర్పంచ్‌గా ఎన్నిక
జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలంలోని మన్నెగూడెం గ్రామానికి చెందిన సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి 2007లో ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లారు. అక్కడ ఓ కంపెనీలో స్థిరపడి ఆర్థికంగా ఎదిగారు. తన స్వగ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని పేదవారికి తోచిన సహాయం చేశారు. దీంతో ఆయనకు మంచి పేరు ఉంది. అయితే, ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో మన్నెగూడెం జనరల్‌కు రిజర్వు అయింది. ప్రజలకు మరింత సేవ చేయాలన్న ఉద్దేశంతో నరేశ్‌రెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. దీంతో గ్రామస్తులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనపై నమ్మకంతో ప్రజలు సర్పంచ్‌గా ఎన్నుకోవడం జీవితంలో మరిచిపోలేనని, గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని అంటున్నారు నరేష్‌రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment