ఉన్నట్టా.. లేనట్టా..? | Mini mahanadu to New district committee | Sakshi
Sakshi News home page

ఉన్నట్టా.. లేనట్టా..?

Published Sat, May 21 2016 3:14 AM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM

ఉన్నట్టా.. లేనట్టా..? - Sakshi

ఉన్నట్టా.. లేనట్టా..?

* కొత్త జిల్లా కమిటీతో లింకు పెట్టిన మోత్కుపల్లి వర్గం
* తమ ఆమోదం లేకుండా కొత్త కమిటీ ఎలా వేస్తారంటున్న ఉమ వర్గం
* కమిటీ వేయకపోతే సాధ్యం కాదంటున్న జిల్లా అధ్యక్షుడు
* సయోధ్య కోసం నిర్వహించాల్సిన సమావేశం వాయిదా
* రేవూరి నేతృత్వంలో మళ్లీ రేపు జిల్లా ముఖ్య నేతల భేటీ
* ఏకాభిప్రాయం రాకపోతే మినీ మహానాడు ఈ సారికి అంతే..
* అదే జరిగితే పార్టీ పుట్టిన తర్వాత ఇదే మొదటి సారి!


సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రెండేళ్లకోసారి ఆనవాయితీగా జిల్లా స్థాయిలో జరిగే తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు నిర్వహణ ఈసారి డోలాయమానంలో పడింది. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న గ్రూపు గొడవలకు తోడు ప్రస్తుతం గడ్డుకాలం రావడంతో మినీ మహానాడును ఈసారి నిర్వహించడం లేదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. మినీ మహానాడు నిర్వహణపై ఇప్పటికే ఓసారి భేటీ కావాలనుకున్నప్పటికీ, ముఖ్య నేతలు అందుబాటులో లేకపోవడంతో పాటు పార్టీ జిల్లా కమిటీపై ఏకాభిప్రాయం రాకపోవడంతో వాయిదా పడింది.

కానీ, రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డి నేతృత్వంలో ఆదివారం హైదరాబాద్‌లోని ట్రస్ట్ భవన్‌లో జిల్లాకు చెందిన ముఖ్య నేతల సమావేశం జరగనుంది. ఇందులో మినీ మహానాడు నిర్వహించాలా.. వద్దా.. అన్నది నిర్ణయిస్తామని పైకి చెబుతున్నా.. అంతర్గతంగా మాత్రం ఈసారికి లేనట్టేనని ఆ పార్టీ నేతలు తీర్మానించుకున్నట్టు తెలుస్తోంది.
 
రెండేళ్లకోసారి

తెలుగుదేశం పార్టీలో  ఆనవాయితీ ప్రకారం ప్రతి రెండేళ్లకోసారి రాష్ట్రస్థాయిలో మహానాడు పేరుతో పార్టీ మహాసభను జరుపుతారు. దీనికి ముందే రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో మినీ మహానాడు నిర్వహిస్తారు. ఈ మేరకు తెలంగాణలోని జిల్లాల్లో ఈసారి మినీమహానాడులు ప్రారంభమయ్యాయి. గండిపేటలో పెద్ద మహానాడును మే 27, 28, 29వ తేదీల్లో నిర్వహించనుండగా, ఆలోపే అన్ని జిల్లాల్లో మినీ మహానాడు నిర్వహించాల్సి ఉంది. మహానాడుకు వారం రోజుల వ్యవధే ఉన్నా..

ఇప్పటి వరకు జిల్లాలో మినీ మహానాడు నిర్వహించాలా.. వద్దా.. అన్న దానిపై నిర్ణయం తీసుకోలేదు. ఇందుకు పార్టీలోని గ్రూపు తగాదాలే కారణంగా తెలుస్తోంది. జిల్లాలో ఉమా మాధవరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు గ్రూపుల మధ్య పార్టీ జిల్లా కమిటీ ఏర్పాటుపై ఇప్పటికీ ఏకాభిప్రాయం లేకపోవడం, గతంలో నియమించి రద్దు చేసిన పార్టీ జిల్లా కమిటీని ఇప్పటి వరకు పునరుద్ధరించకపోవడం, టీడీపీకి చెందిన క్షేత్రస్థాయి నేతలు వలసబాట పట్టిన నేపథ్యంలో ఈసారి మహానాడు నిర్వహణ సందిగ్ధంలో పడింది.  

మినీ మహానాడు నిర్వహించే ఆలోచన పార్టీ జిల్లా నాయకత్వానికి ఉంటే ఈ సమయానికే తేదీ ప్రకటించాల్సి ఉందని, 22న ముఖ్య నేతల సమావేశం పెట్టుకుని ఇంకెప్పుడు నిర్వహిస్తారని పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించడాన్ని బట్టి చూస్తే ఈసారికి అంతేసంగతులని అర్థమవుతోంది. మరోవైపు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బిల్యా నాయక్ కూడా జిల్లా కమిటీ ఏర్పాటు తదనంతర పరిణామాల నేపథ్యంలో పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది.

కొత్త జిల్లా కమిటీని ప్రకటిస్తేనే మహానాడుకు ఏర్పాటు చేసుకుంటానని ఆయన పార్టీ పెద్దల ముందు కుండబద్దలు కొట్టినట్టు సమాచారం. అయితే.. తమ ఆమోదం లేకుండా కొత్త కమిటీని ఎలా ఏర్పాటు చేస్తారని ఉమా మాధవరెడ్డి వర్గం ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో నేరుగా కొందరు నేతలు మహానాడుకు మాత్రమే వెళతారని, జిల్లాలో ఎలాంటి కార్యక్రమం ఉండదని తెలుస్తోంది.
 
అసలు జిల్లా కమిటీ ఏది?
టీడీపీ జిల్లా అధ్యక్షుడి ఎన్నిక జరిగి చాలా కాలం అవుతున్నా ఇప్పటివరకు జిల్లా కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. మూడు నెలల క్రితం ఓ కమిటీని ప్రకటించినా, ఓ వర్గానికే ప్రాధాన్యం దక్కిందన్న ఆలోచనతో దాన్ని రాష్ట్ర నాయకత్వం రద్దు చేసింది. దీంతో మనస్తాపం చెందిన బిల్యా.. పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కానీ, రాష్ట్ర నాయకత్వం బుజ్జగించడంతో తాత్కాలికంగా ఆయన తన రాజీనామాను విరమించుకున్నారు.

ఆ పరిణామం తర్వాత జిల్లాలో ఇంతవరకు టీడీపీ ఊసే కనిపించడం లేదు. అడపాదడపా యాదాద్రి జిల్లా కోరుతూ మోత్కుపల్లి నర్సింహులు దీక్షలు, ప్రదక్షిణలు చేయడం, అక్కడి నేతలు ప్రెస్‌మీట్‌లు పెట్టి యాదాద్రిని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేయడం మినహా పార్టీ కార్యక్రమాలేవీ నిర్వహించడం లేదు.

ఇటీవల కరువు యాత్ర పేరుతో జిల్లాలో కొందరు రాష్ట్ర నేతలు పర్యటించినా... ఆ కార్యక్రమం మొక్కుబడిగా మాత్రమే సాగింది. ఈ పరిస్థితుల్లో అసలు జిల్లా కమిటీ ఎప్పుడు వేస్తారు? జిల్లా కమిటీ నియమించేంతమంది నాయకులు అసలు పార్టీలో ఉన్నారా లేదా? అన్ని నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలున్నారా? ఉన్నవాళ్లు ఆసక్తి కనబరుస్తున్నారా.. లేదా.. అన్నది  అనుమానంగానే ఉందని, ఈ పరిస్థితుల్లో జిల్లాలో మినీ మహానాడు నిర్వహించడం కష్టసాధ్యమేనని తెలుస్తోంది.
 
జిల్లాల విభజన తర్వాతే...

తెలంగాణ వ్యతిరేక పార్టీగా వచ్చిన ముద్ర నుంచి బయటపడేందుకు రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలో తెలుగు తమ్ముళ్లు కొంత ప్రయత్నం చేసినా.. ఆ మరక పోవడం లేదనే అంతర్మథనం పార్టీలో జరుగుతోంది. ముఖ్యంగా ఓటుకు నోటు కుంభకోణం తోపాటు పలు అంశాల్లో తెలంగాణ రాష్ట్రానికి వ్యతి రేకంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కార్యక్రమాలు నిర్వహిస్తుండం, ముఖ్య నేతలందరూ పార్టీ వీడిపోవడంతో టీడీపీ పూర్తిగా నిస్తేజంగా మారిపోయింది.

దీనికి జిల్లాలోని గ్రూపు గొడవలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జిల్లా విభజన ఎప్పుడు జరుగుతుందా.. అని తమ్ముళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందరూ అనుకున్నట్టుగానే నల్లగొండ, సూర్యాపేట జిల్లాలు ఏర్పాటై, భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలు విడిపోతే తప్ప పార్టీ పునర్నిర్మాణం సాధ్యం కాదని రాజకీయ వర్గాలంటున్నాయి.

గతంలో జిల్లాలో పార్టీ చాలా బలంగా ఉండేదని, ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాల విభజన తర్వాత అయినా.. పార్టీకి ఊపు వస్తుందన్న నమ్మకం తమకు లేదని ఆ పార్టీకి చెందిన మరో నేత వ్యాఖ్యానించడం అటు రాష్ట్రంలోనూ, ఇటు జిల్లాలోనూ టీడీపీ పరిస్థితికి అద్దం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement