
సాక్షి, హైదరాబాద్ : కళ్ల దానమే అంధత్వ నివారణకు మార్గమని ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. అవయవదానానికి అందరూ ముందుకు రావాలని కోరారు. బుధవారం సరోజనీ కంటి ఆస్పత్రిలో ఐ బ్యాంక్‌ను, నేత్రాల సేకరణకు రూ.కోటి విలువ చేసే అత్యాధునిక పరికరాలతో కూడిన అంబులెన్స్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఐ బ్యాంక్ ఏర్పాటుతో సేకరించిన కార్నియాను రెండు నెలలవరకు నిల్వ ఉంచవచ్చని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగు పర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ కింద అంతా కలిసి ముందుకు వస్తే సర్కార్ ఆస్పత్రులను అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.