
మంత్రి ఈటెల ఇల్లు ముట్టడి
* ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన
* ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలకు డిమాండ్
హుజూరాబాద్ టౌన్ : విద్యార్థులకు స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం పట్టణంలోని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఇంటిని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ముట్టడించారు. అరగంట పాటు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుర్రాల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గతేడాది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు రూ.1400 కోట్లు చెల్లించాల్సి ఉన్నా.. రూ.500 కోట్లు మాత్రమే విడుదల చేసిందని, ఈ ఏడాది ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తున్నామని ప్రకటించినా మార్గదర్శకాలు విడుదల చేయకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు.
దీంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను వేధింపులకు పాల్పడుతున్నాయని తెలిపారు. విషయం తెలుసుకున్న టౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్సై జగదీష్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన విరమింపజేశారు. నాయకులు సంతోష్, నాగసమన్, రాకేష్, మానస, వనజ, కార్తీకానంద్, నటరాజ్‌రెడ్డి, అజయ్, మమత, విజయ్, కృష్ణ, 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు.