మోదీ పుణ్యమా అని ఊడుతున్న ఉద్యోగాలు
భారీ నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు ఆందోళన
నారాయణఖేడ్: ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో హైదరాబాద్‌లో ఉద్యోగాలన్నీ పోతున్నాయని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్‌లో నూతన మార్కెట్ యార్డు, గోడౌన్లను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. ఇన్నాళ్లూ పనుల కోసం పట్నం బాట పట్టిన వారు మోదీ పుణ్యమా అని పల్లెబాట పడుతున్నారన్నారు.
హైదరాబాద్‌లో ఇళ్ల నిర్మాణాలన్నీ నిలిచిపోయాయన్నారు. ఏది ఏమైనా గ్రామాల్లో రైతులకు పనులు కల్పించాల్సిన అవసరం ఉందని, అందుకే వ్యవసాయాన్ని అభివృద్ధి పరిచే చర్యలు సాగుతున్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. కోటి ఎకరాల మాగాణి కావాలని, ప్రభుత్వం వ్యవసాయానికి రూ.2,500 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాల కోసం డీడీలు చెల్లించిన రైతులు ఏఈలను సంప్రదిస్తే వాటిని అందజేస్తారని అన్నారు. ఎవరైనా లంచాలు అడిగితే నేరుగా తనకు ఫిర్యాదు చేయాలని, అలాంటి అధికారిని సస్పెండ్ చేస్తానని మంత్రి హెచ్చరించారు. పక్షం రోజులకోమారు నారాయణఖేడ్ వస్తానని, గెస్ట్‌హౌస్‌లో కుర్చీ వేసుకొని ప్రజల కోసం కూర్చుంటానని తెలిపారు. కాగా, నారాయణ ఖేడ్ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ బిడెకన్నె హన్మంతును సన్మానించారు.