తీపి కబురనుకున్నా.. కానీ..!
- ప్రధాని ప్రసంగం నిరాశపరిచింది: హరీశ్‌రావు
- వడ్డీ రాయితీల వల్ల పెద్దగా లాభం ఉండదని వ్యాఖ్య
సిద్దిపేట జోన్/గజ్వేల్: ప్రధాని నరేంద్రమోదీ శనివారం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం నిరాశ పరిచిందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఏదో తీపి కబురు వస్తుం దని నిన్నంతా టీవీ వద్దే కూర్చుని ఆశగా ఎదురు చూశానని, కానీ మోదీ తమ ఆశలపై నీళ్లు చల్లారని పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల పరిధిలో పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ముందుగా ఆంక్షలు ఎత్తివేస్తారని కొంత ఆశగా ఎదురు చూశామని, గృహ రుణాలు తదితర అంశాలపై ప్రకటించిన వడ్డీ రాయితీ కూడా పెద్దగా లాభం ఉండదని అభిప్రాయపడ్డారు.
పెద్దనోట్ల రద్దుకు ఏకైక పరిష్కార మార్గం నగదు రహితమేనని పేర్కొన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని మద్యం, రేషన్, విద్యుత్, మునిసిపల్, వాణిజ్యశాఖ, హోటళ్లు, రిజిస్ట్రార్ కార్యాలయాలు, వ్యాపార సంస్థల్లో ఆన్‌లైన్ ద్వారా లావాదేవీలు జరుగుతున్నా యని తెలిపారు. ఇప్పటి వరకు ఏడు విభాగాల్లో 98.484 లావా దేవీలు నిర్వహించి రూ. 87.34 లక్షల విలువైన నగదురహిత లావాదేవీలు చేపట్టామని మంత్రి హరీశ్ వివరించారు.
సూక్ష్మ సేద్యపు పథకానికి రూ.వెయ్యి కోట్లు
ఈసారి సూక్ష్మ నీటి సేద్యపు పథకానికి రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రాణే పరిశ్రమ సమీపంలో కూరగాయలు అమ్మే రైతులు, చిరు వ్యాపారుల కోసం రూ.30 లక్షలతో నిర్మించనున్న మార్కెట్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. డ్రిప్ విధానంలో రైతులకు నీరు, విద్యుత్ ఆదా అయ్యే అవకాశముందన్నారు.
హాస్టల్ విద్యార్ధుల మధ్య హరీశ్ వేడుకలు
‘న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నా జీవితంలో ఒక మధురమైన రోజు.. 13 ఏళ్లుగా ప్రతి ఏటా డిసెంబర్ 31 అర్థరాత్రి సిద్దిపేట ఎస్‌ఎంహెచ్ వసతి గృహంలోనే విద్యార్థుల మధ్య వేడుకలు జరుపుకుంటున్నా.. ఈ ఏడు కూడా ఇక్కడ మీ మధ్య వేడుకలు జరుపుకోవడం నా కుటుంబసభ్యుల మధ్య జరుపుకుం టున్న ట్లుగా ఉంది. మీరంతా నా కుటుంబ సభ్యులేనని’ మంత్రి హరీశ్ స్పష్టం చేశారు. శనివారంరాత్రి విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి న్యూ ఇయర్ వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు.