రికార్డు సమయంలో ‘కాళేశ్వరం’ నీళ్లివ్వాలి
♦ అక్టోబర్‌కల్లా గోదావరి నీళ్లను పొలాలకు పారించాలి
♦ ప్రాజెక్టు పనులపై సమీక్షలో మంత్రి హరీశ్‌రావు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు పనులను వీలైనంత వేగంగా కొనసాగించాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని సవాల్‌గా తీసుకొని వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆసియాలోనే రికార్డు నెలకొల్పాలని సూచించారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి గోదావరి జలాలను పొలాలకు పారించాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని, దాన్ని నెరవేర్చేందుకు అంతా కృషి చేయాలన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో కాళేశ్వరం ప్రాజెక్టు పురోగతిని ఆయన సమీక్షించారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల పనులను ప్యాకేజీలవారీగా అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీలు, పంప్‌హౌస్‌లకు చెందిన డిజైన్లకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వెంటనే సమర్పించాలని సీడీఓ సీఈని ఆదేశించారు. దీనిపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని కోరారు. ఇరిగేషన్, రెవెన్యూ, అటవీ, విద్యుత్, గనులు తదితర ప్రభుత్వ శాఖలు, కాంట్రాక్టు సంస్థలు సమన్వయంతో పనిచేసి గడువులోగా ఫలితాలు సాధించాలన్నారు. భూసేకరణ పనులను మరింత వేగవంతం చేసి ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగేలా చూడాలని హరీశ్‌రావు కోరారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతోపాటు పంప్‌హౌస్‌ల పనులనూ ఏకకాలంలో, సమీకృతంగా చేపట్టాలని సూచించారు.
కన్నెపల్లి పంప్‌హౌస్ పనులను ప్రారంభించామని, భూసేకరణ దాదాపు చివరి దశలో ఉందని అధికారులు ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ పంప్‌హౌస్ నిర్మాణానికి ప్రతిరోజూ 35 వేల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ జరుగుతుండగా దానిని 60 వేల క్యూబిక మీటర్లకు పైగా పెంచాలని మంత్రి సూచించారు. పంప్‌హౌస్ కాంక్రీట్ పనులను ఫిబ్రవరి చివరిలోగా ప్రారంభించాలన్నారు. అన్నారంలో ఫిబ్రవరి తొలివారంలో కాంక్రీటు పనులు చేపట్టాలని ఆదేశించారు. అంతర్గామ్ మండలం సుందిళ్ల పంప్‌హౌస్ కోసం 354 ఎకరాలు సేకరించాల్సి ఉండగా 110 ఎకరాలను సేకరించారని, మిగతా భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి తోడ్పడాలని పెద్దపల్లి జిల్లా కలక్టర్ అలుగు వర్షిణికి మంత్రి సూచించారు. సమావేశంలో ప్రభుత్వ స్పెషల్ సీఎస్ ఎస్‌కే జోషీ, ఈఎన్‌సీ మురళీధర్‌రావు, డిజైన్ల చీఫ్ ఇంజనీర్ నరేందర్‌రెడ్డి, కాళేశ్వరం సీఈలు నల్లా వెంకటేశ్వర్లు, హరిరామ్, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, వివిధ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.