వచ్చిపోతమంటే కుదరదు..
అధికారులకు మంత్రి హరీష్‌రావు హెచ్చరిక
కరీంనగర్ సిటీ : ‘హైదరాబాద్‌ల ఉంటం... గతంలో లాగా అక్కడి నుంచి వస్తం పోతం అంటే కుదరదు... ఎక్కడ పనిచేస్తున్న ఇంజనీర్లు అక్కడ ఉండాల్సిందే’ అంటూ మంత్రి హరీష్‌రావు ఇంజనీరింగ్ అధికారులను హెచ్చరించారు. సమావేశంలో కొద్దిసేపు ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్ని చెరువులకు ఎన్నింటి అంచనాలు రూపొందించారంటూ ఆరా తీశారు. డీఈలు చెప్పేదానికి తనకు ఇచ్చే రిపోర్ట్‌కు పొంతన లేకపోవడంతో వాళ్లేమో ఎక్కువ చెబుతున్నరు... నాకిచ్చిన రిపోర్ట్‌ల తక్కువున్నాయేంటి అంటూ ప్రశ్నించారు.
ప్రతి మండల సమావేశానికి నీటిపారుదల శాఖ ఏఈలు కూడా వెళ్లాలన్నారు. చిన్ననీటి పారుదల శాఖకు గతంలో చెడ్డపేరుందని దానిని తుడిచేయాలన్నారు. చెరువుల అంచనాలు రూపొందించడంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. మహబూబ్‌నగర్‌లో ఒక రు చెరువు వరకు బీటీ రోడ్డు, కట్టపై సీసీ రోడ్డు ప్రతిపాదనలు చేశారని, అలా చేయొద్దని సూచించారు. రాష్ట్రస్థాయిలో క్వాలిటీ కంట్రోల్ అధికారులు పనిచేస్తారన్నారు.
డిసెంబర్ చివరివారంలోగా అంచనాలు పూర్తి చేయాలని ఆదేశించారు. మే నెల వరకు మొదటి విడత చెరువులు పునరుద్దరించి వచ్చే సీజన్‌లోనే ప్రజలకు ఫలితాన్ని అందివ్వాలన్నారు. మంథని డీఈ మాట్లాడుతుండగా.. ఎక్కడ నివాసం ఉంటున్నారని మంత్రి ఆరా తీశారు. తాను మంథనిలోనే ఉంటున్నానని డీఈ చెప్పడంతో జెడ్పీటీసీ, ఎంపీపీ ఎవరైనా చెప్పండి... అక్కడే ఉంటున్నారా అని మంత్రి అడిగేలోపే సర్దుకున్న డీఈ ‘నేను పెద్దపల్లిలో ఉంటున్నాను సార్’ అంటూ బదులివ్వడంతో సభ ఘొల్లుమంది. చెరువు శిఖంలో 1996 తరువాత ఇచ్చిన ఏక్‌సాల్ పట్టాలను రద్దు చేశామని కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య తెలిపారు. 1996 కన్నా ముందు వాటి కూడా నోటీసులుజారీ చేసి రద్దు చేస్తామన్నారు.
ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. మట్టిని తీసేందుకు ప్రొక్లయిన్‌ను సమకూర్చినట్లే పొలాలకు తరలించేందుకు ట్రాక్టర్ కిరాయి కూడా ప్రభుత్వమే భరించాలన్నారు. కాకతీయ కాలువ నుంచి కొత్తపల్లి చెరువుకు నీళ్లు వచ్చేలా ఏర్పాట్లు చేయాలి.
- ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్.. ఐదు చె రువులకు కలిపి ఒక అధికారిని పర్యవేక్షణకు నియమించాలన్నారు. రూ.15 వేల పరిమితిని పెంచాలని కోరారు. హద్దులు ముందుగా రెవెన్యూ అధికారులు గుర్తించాలని, లేదంటే పునరుద్దరణ సమయంలో ఇబ్బందులు ఏర్పడుతాయన్నారు.
- కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు.. మిషన్ కాకతీయ విజయవంతం కావాలంటే ముందుగా చెరువులను ఖాళీ చేయాలన్నారు. సీజన్‌వరకు పునరుద్దరణ పూర్తయి నీళ్లు చేరుతాయన్నారు.
- మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.. సాంస్కృతిక సారథి చైర్మన్‌గా చెరువుల పునరుద్దరణపై ప్రచారం చేపట్టే అవకాశం రావడం అదృష్టమన్నారు. తెలంగాణ ఉద్యమ తరహాలోనే మిషన్ కాకతీయ ఫలితాన్ని ప్రజలు చూస్తామంటూ తనదైన శైలిలో పాటపాడారు.
- చెరువుల పునరుద్దరణలో భాగంగా తూముల వద్ద ఎక్కువ లోతు తీయొద్దని, దాని వల్ల దుష్పరిణామాలు ఎదురవుతాయని రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అన్నారు. అటవీశాఖ, వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖల అధికారులు సమన్వయంతో దీనిని విజయవంతం చేయాలని వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు అన్నారు.
- అధికారులు నిర్లక్ష్యం చేయకుండా చూడాలి. డీఈలు చెరువులు తిరిగి రిపోర్ట్ చేయాలి. ఇప్పటికే నా నియోజకవర్గంలోని జెడ్పీటీసీలు, అధికారులతో సమావేశం నిర్వహించానని చొప్పదండి ఎమ్మెల్యే బొడిగే శోభ పేర్కొన్నారు. పెద్దపల్లి పట్టణంలోని ఎల్లమ్మ, గుండమ్మ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చాలని స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కోరారు. ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, టి.భానుప్రసాద్‌రావు సైతం తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.
నియోజకవర్గాల వారీగా..
జిల్లాలో 5939 చెరువులు, కుంటలను పునరుద్దరణకు గుర్తించామమని మంత్రి హరీష్‌రావు తెలిపారు. మొదటి విడతగా ఈ సంవత్సరం 1202 చెరువులను అభివృద్ధి చేస్తామన్నారు. ఇందులో కరీంనగర్ డివిజన్ పరిధిలో 2253 చెరువులకు గాను 455, జగిత్యాల డివిజన్‌లో 978కు గాను 199, పెద్దపల్లి డివిజన్‌లో 759కు గాను 153, మంథని డివిజన్‌లో 1035కు గాను 210, సిరిసిల్ల డివిజన్‌లో 914 చెరువులకు 185 చెరువులను పూర్తి చేస్తామన్నారు.