అమ్మా.. నోర్ముసుకో అనడం పద్ధతేనా
హైదరాబాద్ : మంత్రిగా పనిచేసిన వ్యక్తి శాసనసభలో శాసనసభ్యులను నోర్ముసుకో అనడం పద్ధతేనా అని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బంగ్లా రాజకీయాలు శాసనసభలో పడవవని ఆయన అన్నారు. కాగా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. అధికార సభ్యులను నోరు మూసుకో అని మాజీమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకె అరుణ వ్యాఖ్యానించారు.
డీకే అరుణ తీరుపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ కొన్ని సమీకరణాల కారణంగా మహిళా సభ్యులకు మంత్రివర్గంలో చోటు కల్పించలేకపోయామన్నారు. అంతేకానీ కాంగ్రెస్ మాదిరిగా మహిళా మంత్రులను సీబీఐ కేసుల్లో ఇరికించలేదన్నారు. తాము మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్నామన్నారు. మహబూబ్‌నగర్‌లో చేసినట్లు సభలో దాదాగిరి చేస్తే నడవదని, బంగ్లా రాజకీయాలు ఇక్కడ కుదరవని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ప్రశ్నోత్తరాల చర్చ సందర్భంగా డీకే అరుణ తమ నియోజకవర్గంలోని ఓ బ్రిడ్జి నిర్మాణం పూర్తిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. బ్రిడ్జి పనులను సభ్యురాలితో చర్చించి త్వరలోనే నిర్మాణ పనుల పూర్తికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. మంత్రి స్పందనపై డీకే అరుణ అసంతృప్తి వ్యక్తం చేయగా రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందిస్తూ.. మీతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో జరిగిన సంభాషణలో డీకే అరుణ అధికారపార్టీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.