విపక్ష సభ్యుల చెంతకు మంత్రులు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో శనివారం పలువురు మంత్రులు విపక్ష సభ్యుల వద్దకు వెళ్లి వారికి వివిధ అంశాలపై స్పష్టతనివ్వడం కనిపించింది. రాష్ట్రాలకు కేంద్రం పన్నుల వాటాను పెంచిందని బీజేపీ నేత లక్ష్మణ్ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై, ఆయన మాట్లాడిన అనంతరం మంత్రి కేటీఆర్ ఆయన వద్దకు వెళ్లి కొద్దిసేపు ముచ్చటించారు. కేంద్రం వాటాలను పెంచి మిగిలిన కీలక పథకాలకు ఎలా కోతలు పెట్టిందో వివరించారు. ఇక పారిశ్రామిక రంగంపై మంత్రి జూపల్లి కృష్ణారావు గత ప్రభుత్వంపై చేసిన విమర్శల కు తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కాం గ్రెస్ ఎమ్మెల్యే జె.గీత కోరినా డిప్యూటీ స్పీకర్ పద్మాదేవెందర్‌రెడ్డి పట్టించుకోలేదు. కొద్దిసేపటి తర్వాత జూపల్లి స్వయంగా గీత వద్దకు వెళ్లి ఆమెతో మాట్లాడారు. ఇక టీ విరామం అనంతరం మరో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రతిపక్షనేత జానారెడ్డి పక్కన కూర్చొని చాలాసేపు ముచ్చటిస్తూ కనిపించారు.