ఖమ్మం రూరల్ మండలంలో గుబ్బరోగం ఆశించి ఎదుగుదల ఆగిపోయిన మిర్చిపంట
సాక్షి, ఖమ్మంరూరల్: సీజన్ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితులు.. ప్రస్తుతం తెగుళ్ల బెడద.. వెరశి పత్తి, మిర్చి రైతులకు తీవ్ర నష్టాన్ని కలగజేస్తున్నాయి. ఎన్నో ఆశలతో వేలాది రూపాయలు ఖర్చు పెట్టి పండిస్తున్న పంటలకు చీడపీడలు సోకి కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. చేలన్నీ ఎర్రబారి.. మొక్కలు ఎండిపోయి.. ఎదుగుదల ఆగిపోయి.. కనీసం పెట్టుబడి కూడా చేతికొచ్చేలా కనిపించడంలేదు. ఎన్ని పురుగు మందులు పిచికారీ చేసినా ఫలితం లేకపోవడంతో.. రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
జిల్లాలో లక్ష ఎకరాల్లో మిర్చి, 1.40లక్షల హెక్టార్లలో పత్తి పంటలను ఈ ఏడాది రైతులు సాగు చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో సరైన వర్షాలు లేకపోవడంతో నాటిన పత్తి గింజలు మొలకెత్తలేదు. దీంతో రైతులు రెండు నుంచి మూడుసార్లు విత్తనాలు కొనుగోలు చేసి నాటిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కొద్దోగొప్పో ఆదాయం రాకపోదా అనే ఉద్దేశంతో వర్షాభావ పరిస్థితులను సైతం లెక్క చేయకుండా పత్తిని అత్యధికంగా సాగు చేశారు. పూత దశలో మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పత్తిని పేనుబంక, పచ్చదోమ తెగుళ్లు ఆశించాయి. సరైన మందులను పిచికారీ చేయకుంటే ఈ పురుగులు పంట చివరి దశ వరకు ఉండి తీవ్ర నష్టాన్ని కలగజేస్తాయి. ఈ క్రమంలో వాటి నివారణకు ఏం పిచికారీ చేయాలో తెలియక రైతులు అయోమయానికి గురయ్యారు. ఈ సమయంలోనే ఆ తెగుళ్లు చేయాల్సిన నష్టాన్ని చేశాయి. దీనికి తోడు పైరు పిందె, కాయ దశల్లో తెల్లదోమ, పిండి పురుగు, నల్లి, కాయ తొలిచే పురుగులైన నల్ల మచ్చల పురుగు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, గులాబీ రంగు పురుగులు ఆశించి పంటకు ఎక్కువ నష్టం కలగజేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా మొదటి కాపులో దిగుబడి గణనీయంగా పడిపోయింది. కొన్నిచోట్ల ఇప్పటికే రెండో కాపు వచ్చినా.. తెగుళ్ల ఉధృతి పెరిగి ఈసారి దిగుబడి కూడా ఆశించినంత రాలేదు.
ఇదిలా ఉంటే.. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచిలో ప్రస్తుతం భక్త రామదాసు నీళ్లు చేలల్లో పారుతున్నాయి. దీంతో రైతులు పత్తికి తడులు కట్టారు. అయితే పత్తి చేలు కొద్దిగా పచ్చబడ్డాయి. కానీ.. ఈ ప్రాంతంలో రెండో కాపునకు పేనుబంక, పచ్చదోమ ఉధృతి విపరీతంగా పెరిగింది. దీంతో రెండో కాపులో ఎకరానికి క్వింటా దిగుబడి కూడా వచ్చేలా లేదు. ఆ పంట అమ్మితే వచ్చే డబ్బులు కూలీలకు కూడా సరిపోవని రైతులు వాపోతున్నారు. ఇదే పరిస్థితి జిల్లా మొత్తం ఉంది.
మిర్చి రైతు దిగాలు..
జిల్లాలో మిరప తోటల పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. తెగుళ్ల బారినపడి మొక్కలు ఎండిపోతున్నాయి. ప్రస్తుతం తోటలు పూత, కాపు దశలో ఉండగా.. వేరుకుళ్లు, ముడుత, గుబ్బరోగం, ఎండు తెగులు లాంటివి సోకడంతో మొక్కలు చనిపోతున్నాయి. దీంతో పంటను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. వేలాది రూపాయలు వెచ్చించి క్రిమిసంహారక మందులను పిచికారీ చేస్తున్నారు. ఈ ఏడాది మిరప సాగు చేసిన తమకు కష్టాలు, నష్టాలే మిగులుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు. తెగుళ్లు ఆశించి పంటలు ఎండిపోవడంతో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి..
పదెకరాల్లో పత్తి పంట సాగు చేశా. మొదట వర్షాలు లేక మూడుసార్లు పత్తి విత్తనాలు వేశాం. మొక్కల ఎదుగుదల సమయంలో వర్షాలు లేక పంట మొత్తం ఎండిపోయింది. తిరిగి నీళ్లు పెడితే కొంతమేర పచ్చబడింది. తర్వాత పంటను చీడపీడలు ఆశించాయి. ఇప్పటికే ఎకరాకు రూ.35వేల చొప్పున పెట్టుబడి పెట్టా. ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదు. ప్రభుత్వమే పత్తి క్వింటాకు రూ.8వేలు మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలి.
– యాట శ్రీను, రైతు, కామంచికల్, రూరల్ మండలం
ఎదుగుదల ఆగిపోయింది..
నాటిన కొద్దిరోజుల వరకు మిర్చి పంట బాగానే ఉంది. నెలరోజుల క్రితం గుబ్బరోగం వచ్చింది. దీంతో పంట ఎదుగుదల ఆగిపోయింది. వచ్చిన కొద్ది కాయలు కూడా గిడసబారి సైజు తక్కువగా ఉన్నాయి. ఎన్ని మందులు పిచికారీ చేసినా రోగం తగ్గడం లేదు. ఇప్పటికే ఎకరాకు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు.
– బాణోత్ నరేష్, రైతు, రావిచెట్టుతండా, రూరల్ మండలం
పసుపు రంగు అట్టలతో నివారణ
మిర్చిలో గుబ్బరోగం అనేది తెల్లదోమ ఆశించడం వల్ల వస్తుంది. ఇది వచ్చిన తర్వాత పురుగు మందులు వాడినా ప్రయోజనం ఉండదు. గుబ్బరోగం నివారణకు ఎకరాకు 20 నుంచి 30 వరకు పసుపు రంగు అట్టలు పెట్టుకోవాలి. అట్టలకు జిగురు పూసి పంట చేనులో పెట్టడం వల్ల దోమలు ఆ అట్టలకు అతికి చనిపోతాయి. దీంతో గుబ్బరోగం కొంతవరకు తగ్గుతుంది.
– ఝాన్సీలక్ష్మీకుమారి,జేడీఏ
Comments
Please login to add a commentAdd a comment