సిద్ధమైన ‘మిషన్‌ భగీరథ’ నాలెడ్జి సెంటర్‌ | Mission Bhagiratha Works Completed At Komatibanda | Sakshi
Sakshi News home page

సిద్ధమైన ‘మిషన్‌ భగీరథ’ నాలెడ్జి సెంటర్‌

Published Fri, Aug 16 2019 10:14 AM | Last Updated on Fri, Aug 16 2019 10:14 AM

Mission Bhagiratha Works Completed At Komatibanda - Sakshi

కోమటిబండ గుట్టపై ‘మిషన్‌ భగీరథ’ హెడ్‌ రెగ్యులేటరీ వద్ద పూర్తి కావస్తున్న ‘నాలెడ్జి సెంటర్‌’ 

సాక్షి, గజ్వేల్‌: ‘మిషన్‌ భగీరథ’ పథకానికి కేంద్ర బిందువుగా ఉన్న గజ్వేల్‌ ఇక నాలెడ్జి సెంటర్‌గా మారబోతోంది. 2016 ఆగస్టు 7న ప్రధాని చేతులమీదుగా ప్రారంభోత్సవం జరిగిన గజ్వేల్‌ మండలంలోని కోమటిబండ హెడ్‌రెగ్యులేటరీ వద్ద నాలెడ్జ్‌ సెంటర్‌ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ కేంద్రాన్ని సందర్శిస్తే చాలూ తెలంగాణ వ్యాప్తంగా గోదావరి, కృష్జా నదీ జలాలను శుద్ధి చేసి, గ్రావిటీ విధానంలో 26 సెగ్మెంట్‌ల పరిధిలోని అమలవుతున్న పథకం తీరు కళ్లకు కట్టినట్లు తెలిసే అవకాశమున్నది. ఇందుకు ఇక్కడ ఫోటో గ్యాలరీలు, ప్రొజెక్టర్‌ తదితర పరికరాలను ఏర్పాటు చేయబోతున్నారు.

రూ.50లక్షల నిధులతో ఇప్పటికే నాలెడ్జి సెంటర్‌ భవన నిర్మాణం పనులు పూర్తి కావస్తున్నాయి. ఇప్పటికే నిత్యం సందర్శకుల తాకిడితో సందడిగా మారిన హెడ్‌ రెగ్యులేటరీ ప్రాంతం ఇక మరింత ప్రాచూర్యంలోకి రానుంది. త్వరలోనే ఈ కేంద్రాన్ని సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించడానికి సంబంధిత అధికారులు సన్నహాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ సిద్దిపేట ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో కేసీఆర్‌ మానేరు ద్వారా సిద్దిపేటకు వాటర్‌గ్రిడ్‌ తరహాలో అందించిన నీటిపథకం తీరును పరిశీలించి రాష్ట్ర వ్యాప్తంగా ‘మిషన్‌ భగీరథ’కు శ్రీకారం చుట్టారు. 2016 ఆగస్టు 7న సీఎం కేసీఆర్‌ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించి అతి తక్కువ కాలంలో ఇంతటి ప్రతిష్టాత్మక పథకాన్ని పూర్తి చేశారని దేశంలోనే చర్చనీయాంశంగా మారారు. 

పథకం నేపథ్యం ఇదీ
దశాబ్ధాలుగా తాగునీటి తండ్లాటతో అల్లాడుతున్న గజ్వేల్‌లో కష్టాలు తీరుస్తానని చెప్పిన మాటకు కట్టుబడ్డారు. కొద్ది నెలల్లోనే గజ్వేల్‌ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ నల్లా నీరు అందిస్తానని ప్రకటించి. ఆ మేరకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కానుకగా 2015 జూన్‌ 2న గజ్వేల్‌ ‘మిషన్‌ భగీరథ’ (వాటర్‌ గ్రిడ్‌) పథకానికి (గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాలు) రూ.1055కోట్లు మంజూరు చేశారు. హైదరాబాద్‌కు గోదావరి జలాలను తరలించే పైప్‌లైన్‌ నుంచి నీటిని ట్యాపింగ్‌ చేసి ఈ ప్రాంతానికి అందిస్తున్నారు.

ఇందులో భాగంగానే కొండపాకలోని హెచ్‌ఎండబ్ల్యూఎస్‌(హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్‌)ప్రాంగణం నుంచి, ప్రజ్ఞాపూర్‌ వద్ద పైప్‌లైన్‌ నుంచి నీటిని ట్యాపింగ్‌ చేశారు. ప్రజ్ఞాపూర్‌ నుంచి పైప్‌లైన్‌ను ట్యాపింగ్‌ చేసి ఆ నీటిని ఎత్తైన ప్రదేశంలో ఉన్న గజ్వేల్‌ మండలం కోమటిబండ అటవీ ప్రాంతంలోని సంప్‌హౌస్‌కు తరలించి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా గజ్వేల్‌ నియోజకవర్గంలోని 244 హాబిటేషన్లలో గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలీటీతోపాటు మరో 65 గ్రామాలకు గ్రావిటీ ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లోని 14 మండలాల్లోగల 590 హాబిటేషన్లకు, 2 మున్సిపాలిటీలకు నీటిని అందిస్తున్నారు. ఈ పనులు 2016లో పూర్తి కావడంతో ఇదే తరహాలో రాష్ట్రమంతటా అన్ని నియోజకవర్గాల్లో ఈ పనులను చేపట్టారు. మొత్తానికి పనులకు గజ్వేల్‌ సెగ్మెంట్‌ కేంద్రబిందువు.

అన్ని సెగ్మెంట్ల సమాచారం
కోమటిబండ గుట్టపై ఉన్న ‘మిషన్‌ భగీరథ’ హెడ్‌ రెగ్యులేటరీపై నాలెడ్జి సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. 2018 జనవరిలో హెడ్‌రెగ్యులేటరీని సందర్శించిన ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అప్పటి ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఎస్‌కే జోషీ ఇక్కడ నాలెడ్జి సెంటర్‌ను ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా ‘మిషన్‌ భగీరథ’ సెగ్మెంట్‌ల సమాచారాన్ని అందించే విధంగా తీర్చి దిద్దాలని సీఎం ఆలోచనగా ఉందని చెప్పారు. దీంతో ‘మిషన్‌ భగీరథ’ ఈఎన్‌సీ వెంటనే సెంటర్‌ కోసం భవనం నిర్మాణం చేపట్టాలని రూ.50లక్షలు మంజూరు చేయడంతో పనులు పూర్తి కావస్తున్నాయి.

ఈ కేంద్రంలో రాష్ట్రవ్యాప్తంగా రెండు భాగాలుగా పథకం అమలవుతున్నతీరు, కృష్టా నదీ జలాలతో 11సెగ్మెంట్లు, గోదావరి జలాలతో మరో 15 సెగ్మెంట్లలో అమలవుతున్న తీరు వివరించే దిశలో ఆయిల్‌ పేయింటింగ్‌ ఫొటో గ్యాలరీతో ప్రొజెక్టర్‌ ఇతర పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. సందర్శకులు కూర్చునేందుకు వీలుగా సీట్లు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే సందర్శకుల తాకిడితో పర్యాటక ప్రదేశంగా మారిన కోమటిబండ గుట్ట, నాలెడ్జి సెంటర్‌ అందుబాటులోకి వస్తే.. మరింత ప్రాయూర్యంలోకి రానుంది. త్వరలోనే ఈ కేంద్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించాలని మిషన్‌ భగీరథ అధికారులు ఆలోచనతో ఉన్నారు. 

గొప్ప కేంద్రంగా తీర్చిదిద్దుతాం 
గజ్వేల్‌ మిషన్‌ భగీరథ పథకానికి కేంద్ర బిందువు. ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే పథకంపై పూర్తి అవగాహన కలగాలన్నది సీఎం లక్ష్యం. ముఖ్యమంత్రి ఆలోచనలకనుగుణంగా కోమటిబండ హెడ్‌ రెగ్యులరేటరీ వద్ద నాలెడ్జి సెంటర్‌ను నిర్మించాం. భవిష్యత్‌లో ఇది గొప్ప కేంద్రంగా మారనుంది.  
– రాజయ్య, మిషన్‌ భగీరథ ఈఈ   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement