
మిషన్ గులాబీగా మార్చారు : కిషన్‌రెడ్డి
మిషన్ కాకతీయను మిషన్ గులాబీగా మార్చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు.
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయను మిషన్ గులాబీగా మార్చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మిషన్ కాకతీయ పార్టీ కార్యక్రమమా, ప్రజల సొమ్ముతో నడుస్తున్న ప్రభుత్వ కార్యక్రమమా.. అనేది అర్థం కాకుండా పోయిం దన్నారు. చెరువుల మరమ్మతు పనుల్లో టీఆర్‌ఎస్ అజమాయిషీ ఉందా, ప్రభుత్వ అజమాయిషీ ఉందా తేల్చాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు తప్ప ప్రజల భాగస్వామ్యం లేదన్నారు. ప్రతిపక్షాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని, చెరువుల ఎంపిక, ప్రాధాన్యతల నిర్ణయంలో ప్రతిపక్షపార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులపై వివక్ష చూపిస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. మిషన్ కాకతీయ పనుల అంచనాలు అసమగ్రంగా, లోపభూయిష్టంగా ఉన్నాయన్నారు.