►ఒక్కో కాంట్రాక్టర్‌కు దక్కిన మూడు, నాలుగు చెరువులు
►బినామీ పేర్లపైనా పనులు
అల్లాదుర్గం రూరల్ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయ పనులు పక్కదారి పడుతున్నాయి. చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం లక్షలాది రూపాయలు మంజూరు చేసి టెండర్లు పిలిచినా కాంట్రాక్టు పనులు మాత్రం టీఆర్‌ఎస్ నేతలకే దక్కాయి. టెండర్లలో ఎవరికి పనులు దక్కినా పనులు చేస్తున్నది మాత్రం టీఆర్‌ఎస్ నాయకులే. మిషన్ కాకతీయ పనుల్లో అవినీతి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రులు హెచ్చరిస్తున్నా ఫలితం శూన్యం.
ఒక్కో కాంట్రాక్టర్ మూడు, నాలుగు చెరువులు దక్కించుకొని బీనామి పేర్లపై పనులు చేపడుతున్నారు. అల్లాదుర్గం మండలంలో 12 చెరవులకు టెండర్లు పూర్తికాగా, 8 చెరువుల్లో మాత్రమే పనులు కొనసాగుతున్నాయి. అందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ ప్రారంభించిన మిషన్ కాకతీయ పనులు ముందుకు సాగడం లేదు. ఈ నెల 11న కెరూర్ పీర్ల కుంట చెరువు పనులను ఎమ్మెల్యే బాబూమోహన్ ప్రారంభించారు. ఆయినప్పటికీ పనులు జరగడం లేదు. కాంట్రాక్టర్‌కు రెండు మూడు చెరువులు దక్కడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది.
అప్పాజిపల్లి గిద్దమ్మ చెరువుకు రూ.20 లక్షలు మంజూరయ్యాయి. నామమాత్రంగా చెరువులో ముళ్ల పొదలు, చె ట్ల తొలగింపు పనులు చేపట్టి నిలిపి వేశారు. చెరువులోని పూడిక మట్టిని తరలించే పనులు నత్తనడకన సాగుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమయ్యే లోగా పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. శిథిలావస్థకు చేరుకున్న చెరువు ఆలుగు, తూముల పనులు ఇంకా మొదలు పెట్టలేదని రైతులు తెలిపారు.
ఎలాంటి అనుభవం లేని కాంట్రాక్టర్లు పనులు చేపడుతుండటం గమనార్హం. కాయిదంపల్లి చెరువుకు రూ. 30 లక్షలు మంజూరయ్యాయి. టెండర్ పూర్తయి కాంట్రాక్టర్‌కు అగ్రిమెంట్ అయినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. నిధులు దుర్వియోగం చేసేందుకే కాంట్రాక్టర్లు పనులు ఆలస్యంగా చేపడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. పనులపై జిల్లా అధికారులు పర్యవేక్షణ కొరవడింది. ఇప్పటికైనా అధికారులు మేల్కొనాలని రైతులు కోరుతున్నారు.
ఏఈ వివరణ: ఈ విషయమై ఏఈ చక్రవర్తిని వివరణ కోరగా చెరువుల పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. మండలంలో 12 చెరవులకు టెండర్లు, అగ్రిమెంట్లు పూర్తయ్యాయని పనులు కొనసాగుతున్నాయన్నారు.
అధికార పార్టీ నేతలకే మిషన్ కాకతీయ పనులు
Published Wed, May 20 2015 11:19 PM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
Advertisement
Advertisement