సాక్షి, హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ పనుల్లో రాజకీయ జోక్యాన్ని సహించేది లేదని ప్రభుత్వం ఓ వైపు ఘాటుగా హెచ్చరిస్తున్నా, క్షేత్ర స్థాయిలో మాత్రం దాని ప్రభావం కనిపించడంలేదు. టెండర్లు, ఒప్పందాలు పూర్తయిన చెరువు పనుల ఆరంభానికి రాజకీయ రంగు అంటుకుంటోంది. పనులను తమ చేతుల మీదుగా ప్రారంభించాలంటూనే కొంతమంది ఎమ్మెల్యేలు సమయమివ్వకపోవడంతో కొన్ని చోట్ల, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలున్న చోట అధికారపక్ష నేతల అభ్యంతరాలు, అడ్డంకులతో మరికొన్ని చోట్ల చెరువుల పనులు ఆరంభం కాలేదు.
దీంతో అటు నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేషీకి, ఇటు ప్రభుత్వ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదులు వస్తుండటంతో మంత్రి చొరవ కారణంగా అధికారులు హడావుడిగా మూడు రోజుల్లో 180 చోట్ల పనులను ప్రారంభింపజేశారు.
586 చెరువుల్లో ఆరంభం కాని పనులు..
రాష్ట్రంలో ఈ జూన్ నాటికి మొత్తంగా 9,627 చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా అందులో ఇప్పటికే 8,115 చెరువులకు రూ.2,550 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చారు. ఇందులో 7,207 చెరువులకు టెండర్లు పూర్తి చేసి కాంట్రాక్టర్లతో ఒప్పందాలు చేసుకున్నారు. అయినప్పటికీ ఇప్పటి వరకు కేవలం 6,621 చెరువుల్లో మాత్రమే పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం వర్షాలు మొదలవుతున్నా మరో 586 చెరువుల్లో ఇంకా పనుల ఆరంభమే జరగలేదు.
దీనికి ప్రధానంగా ఆయా చెరువుల పరిధిలోని నియోజకవర్గాల్లో నెలకొన్న రాజకీయాలే కారణమని తెలుస్తోంది. చాలా చోట్ల ఎమ్మెల్యేలు తామే స్వయంగా పనులకు శంకుస్థాపనచేయాలని, తమపేరుతో శిలాఫలకం ఉండాలని పట్టుబట్టడమే కారణంగా తెలుస్తోంది. స్థానిక నేతలు ఎవరైనా పనుల ప్రారంభానికి చొరవ చూపినా అక్కడి ఎమ్మెల్యేలు అధికారులపై ఒత్తిడి తెచ్చి పనులను జరుగనీయకపోవడంతో అవి మొదలవలేదు. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
కరీంగనర్‌లో మరో 70 చెరువుల పనులు చేపట్టాల్సి ఉండగా ఇందులో ఎక్కువగా చొప్పదండి, మానుకొండూరు నియోజకవర్గాల్లోనే ఉన్నాయని సమాచారం. ఇప్పటికే ఈ నియోజకవర్గాల ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు అందుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, ఎల్లారెడ్డి, బోధన్‌లలోనూ ఎమ్మెల్యేలు సమయమివ్వని కారణంగా పనులు ప్రారంభం కావట్లేదు.
ఇక మహబూబ్‌నగర్‌లో గద్వాల, వనపర్తి, కొడంగల్ వంటి నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు, స్థానిక నేతలకు మధ్య ఉన్న రాజకీయ వైరుధ్యం పనులకు అడ్డంకిగా మారింది. దీంతో మహబూబ్‌నగర్ లో 928 చెరువుల పనులకు ఒప్పందాలు కుదిరినా 802 పనులే ఆరంభమయ్యయి. మరో 126 పనులు నిలిచిపోయాయి. వాటిని ఇప్పుడు ప్రారంభించే పరిస్థితి కనిపించడం లేదు. మరికొన్ని నియోజకవర్గాలపైనా మంత్రి పేషీకి, హెల్ప్‌లైన్‌కు ఇలాంటి ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో అధికారులు రాజకీయ జోక్యాన్ని తగ్గించి పనులను చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు.
‘మిషన్’ పనులకు రాజకీయ రంగు
Published Sun, Jun 7 2015 4:50 AM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM
Advertisement