బలం ఉన్నోళ్లకే జలం | The strength of those water | Sakshi
Sakshi News home page

బలం ఉన్నోళ్లకే జలం

Published Sat, Dec 24 2016 12:47 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

బలం ఉన్నోళ్లకే జలం - Sakshi

బలం ఉన్నోళ్లకే జలం

  •  చెరువులకు నీటి సరఫరాలో రాజకీయం
  • ప్రాంతాల మధ్వ విద్వేషాలు రెచ్చగొడుతున్న నేతలు
  • అల్లాడిపోతున్న సామాన్యులు
  •  

    ఈ చిత్రంలో కనిపిస్తున్నది శింగనమల చెరువు. ఈ చెరువు కింద శింగనమల మండలంతో ఏడెనిమిది గ్రామాలు ఆధారపడి ఉన్నాయి. చెరువులోకి ఏటా మిడ్‌పెన్నార్‌ నుంచి నీరొచ్చేది. దీంతో ఆయా గ్రామాల్లో తాగునీటి సమస్య ఉండేది కాదు. మరోవైపు వందల మంది మత్స్యకారులకు చేపల పెంపకం ద్వారా ఉపాధి దొరికేది. కానీ ఈ ఏడాది శింగనమల చెరువుకు చుక్కనీరు విడుదల చేయలేదు. దీంతో ఆయా గ్రామాల వారు తీవ్రఇబ్బందులు పడుతున్నారు.

    •  ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న అధికార పార్టీ నేతలకు పార్టీలో, ప్రభుత్వంలో పెద్దగా ప్రాధాన్యత లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

     

     ఈ చిత్రంలో ఉన్నది అనంతపురం రూరల్‌ మండలం పామురాయి చెరువు.మిడ్‌పెన్నార్‌ సౌత్‌ కెనాల్‌ నుంచి నీళ్లు వచ్చిచేరడంతో తొణికిసలాడుతోంది. ఊట వస్తుండడంతో ఆ నీటితోనే చెరువుకింద భూముల్లో వరిసాగు చేస్తున్నారు. భూగర్భ జలాలు పెరగడంతో పాటు, బోర్లలో నీటిమట్టం పెరిగి తాగునీటి ఇబ్బందులు తీరాయి.

    • ఈ ప్రాంతానికి చెందిన ఓ చోట నాయకుడు అధికారపార్టీ ముఖ్య నేత వద్ద అనుచరుడు ఉండడమే నీటి విఽడుదలకు కారణంగా తెలుస్తోంది. 

     

    అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఆగాడలకు పై రెండు సంఘటనలు అద్దం పడుతున్నాయి.  అయినవారికి ఆకుల్లో..కానివారికి కంచాల్లో పెట్టడం అధికార పార్టీ నాయకులకు మామూలైపోయింది. ఇన్నాళ్లు ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రాతనిథ్యం వహించే ప్రాంతాలకు నిధులు, నీళ్లివ్వకుండా ఇబ్బందులు గురిచేసిన అధికారపార్టీ పెద్దలు..ఇపుడు సొంత పార్టీవారినీ ఇబ్బందులు పెడుతున్నారు. అనుయాయులకు పెద్దపీట వేస్తూ సొంతపార్టీవారినే టార్గెట్‌ చేస్తున్నారు. అంతిమంగా సామాన్యులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు.

    స్వపక్షీయులపైనా పక్షపాతం

    ఈ ఏడాది చెరువులకు నీటి విడుదల చేయడంలో అధికారులు పక్షపాతం వహించారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నీటి విడుదలలో అధికార పార్టీ నేతలు రాజకీయం చేస్తున్నారు. బలం ఉన్నోళ్లకే జలం అన్న చందంగా నీటి పంపిణీ జరుగుతోంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో తుంగభధ్ర నుంచి హెచ్చెల్సీకి నీళ్లు  గణనీయంగా తగ్గాయి. ఈ కారణంతో ఈ ఏడాది ఆయకట్టుకు కాకుండా భూగర్భజలాల అభివృద్ధికి చెరువులను, కుంటలను నింపాలని నిర్ణయించారు. హెచ్చెల్సీకి వచ్చిన నీళ్లు, హంద్రీ-నీవా కలిపి దాదాపు 25 టీఎంసీలకు పైగా నీళ్లొచ్చాయి. వీటిలో సింహభాగం  చెరువులు, కుంటలు నింపేందుకే వెచ్చించినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే ఓ ప్రణాళిక లేకుండా నీటి పంపిణీ జరుగుతోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

    కొన్ని చెరువులకే నీళ్లు!

    హెచ్చెల్సీ సౌత్‌ కెనాల్‌ కింద 18 చెరువులకు 1.88 టీఎంసీలు కేటాయించారు. పీఏబీఆర్‌ కుడికాలువ కింద 49 చెరువులుంటే 38 వాటికి నీరిచ్చారు. ఇప్పటి వరకూ 2.4 టీఎంసీలు విడుదల చేశారు.15 శాతం నుంచి 50 శాతం, రెండు చెరువులు వందశాతం నింపామని అధికారులే చెప్తుండడం గమనార్హం. కొన్ని వాటికి 50 శాతం, వందశాతం, మరికొన్నింటికి కేవలం 15 శాతం మాత్రమే నీళ్లు వదలడం ఏమిటనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.   చెరువులు నింపడంలో ఇంత వ్యత్యాసం ఎందుకనే ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి.

    చుక్కనీటిని నోచుకోని ముక్తాపురం చెరువు

    కనగానపల్లి మండలం ముక్తాపురం చెరువుకు చుక్కనీరు ఇవ్వలేదు. కానీ చివరన ఉన్న ఉన్న తాడిమర్రి మండలం నార్సింపల్లి చెరువును 50 శాతం నీటితో నింపడం విమర్శలకు దారితీస్తోంది. విశ్రాంత డీజీపీ జేవీ రాముడు సొంత గ్రామం నార్సింపల్లి కావడంతో అధికారులు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారనే ఆరోపణలు రెండేళ్ల నుంచీ వినిపిస్తున్నాయి. ఈ ఏడాది కూడా సీఎం స్థాయిలో ఒత్తిళ్లు తెచ్చుకొని నీటిని తీసుకుపోయారు. కానీ ముందున్న చెరువులకు చుక్కనీరు పోవడం లేదు. ఆయకట్టు ఎలాగూ పోయింది. కనీసం భూగర్భజలాలు పెంచుకునేందుకు చెరువులకైనా నీటిని సక్రమంగా పంపిణీ చేశారా ? అంటే అదీ లేదు. వచ్చే వేసవిలో ఆయా గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటి తాగునీటికి సైతం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొందని ఆయా ప్రాంతాల రైతులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

     

    ప్రతిసారి మాకు అన్యాయమే

    కాలువ నీటి విషయంలో ప్రజాప్రతినిధులు, అ«ధికారులు ప్రతి సంవత్సరం అన్యాయం చేస్తున్నారు. ముక్తాపురం చెరువు పక్కనే కాలువ పోతున్నా ఒక్కసారి కూడా చెరువులోకి  నీటిని వదలలేదు. బోరుబావులలో నీరు అడుగంటిపోయి ఖరీప్‌లో సాగుచేసిన పంటలన్నీ ఎండిపోయాయి. ఇప్పుడైనా చెరువుకు నీటిని వదిలితే రబీలోనైనా పంటలు సాగు చేసుకుందామనుకుంటే ఇంతవరకు కాలువ నీరు ఇటువైపు రాలేదు.

    -రైతు, సుబ్బిరెడ్డి, ముక్తాపురం గ్రామం

     

    వరి మడులన్నీ బొందుపోయాయి

    బోరుబావుల్లో నీరు అడుగంటిపోయి ఖరీఫ్‌లో సాగుచేసిన వరి మడులన్నీ బొందుపోయాయి.   పశుగ్రాసం మాత్రమే దక్కింది. కాలువకు నీరు రావటం లేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కాలువ ద్వారా ముక్తాపురం చెరువుకు నీటిని వదలాలి.

    -చెన్నేకేశవులు, ముక్తాపురం గ్రామం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement