హాస్టల్ వార్డెన్‌పై ఎమ్మెల్యే ‘పాయం’ ఆగ్రహం
మెనూ పాటించడం లేదని మండిపాటు
ఎస్సీ బాలుర హాస్టల్ ఆకస్మిక తనిఖీ
ఎమ్మెల్యేకు సమస్యలు విన్నవించిన విద్యార్థులు
మణుగూరు : ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారం విద్యార్థులకు పెట్టాలని మెనూ సక్రమంగా పాటించని వార్డెన్‌నుపై పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆగ్రహించారు. ఈ మేరకు గురువారం ఉదయం మణుగూరు ప్రభుత్వ ఎస్సీ బాలుర హాస్టళ్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే వచ్చే సమయానికి హాస్టల్‌లో వార్డెన్ లేకపోవడంతో మీరు లేకుండా విద్యార్థులు ఎలా ఉంటారని వార్డెన్‌ను ప్రశ్నించారు. విద్యార్థులకు వండిన వంటను పరిశీలించారు. చారు నీళ్లలా ఉందని, మెనూ ప్రకారం తమకు భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్యే హాస్టల్ రికార్డులను పరిశీలించారు. స్టోర్ రూమ్‌లో ఉన్న సామాన్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తమకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వకపోవడంతో భోజనాలు పెట్టడం లేదని ఎస్‌ఎంహెచ్ హాస్టల్ విద్యార్థులు ఎమ్మెల్యేకు పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. హాస్టల్‌లో తాగునీటి సమస్య, మరుగుదొడ్ల సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవని విద్యార్థులు ఆయనకు తెలిపారు. సమస్యలను తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తనన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు హాస్టల్ వార్డెన్ కృష్ణ, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి వట్టం రాంబాబు, మండల గౌరవ అధ్యక్షుడు పల్లపు తిరుమలేశ్, కార్యదర్శి గాండ్ల సురేష్, జిల్లా నాయకులు పెద్ది నాగకృష్ణ, మండల యూత్ నాయకుడు రంజిత్, నాయకులు మేడ నాగేశ్వరరావు, జె సురేష్ వార్డు సభ్యులు మిట్టపల్లి కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.