
సరుకుల బస్తా మోసుకువెళ్తున్న సీతక్క
సాక్షి, భద్రాచలం: అడవి బిడ్డల ఆకలి ఆర్తనాదాలు. పూట గడవక పస్తులున్న గిరిపుత్రులు. పట్టెడన్నం కోసం కొండకోనల్లో బిత్తర చూపులు. దయార్ద్ర హృదయం స్పందిస్తారని.. ఎండిన డొక్కలకు తిండి గింజలు పెడతారని దేహీ అంటూ విలపించారు. ఆ మాటలు చెవిన పడిన ఆదివాసీ బిడ్డ.. ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క నేను సైతం అంటూ మూటాముల్లెతో అడవి బాట పట్టారు. కొండకోనలు.. వాగులూ వంకలు దాటి వారి ఆకలి తీర్చారు. అమ్మలా ఆదరించావంటూ అడవి బిడ్డలు తెగ సంబరపడి పోయారు. వివరాలు.. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పెనుగోలు గిరిజన గ్రామం భద్రాచలం నియోజక వర్గం పరిధిలోకి వస్తుంది. చదవండి: 21దాకా లాక్‌డౌన్..?
తమకు నిత్యావసర సరుకులు అందక అవస్థలు పడుతున్నామని, అర్ధాకలితో అలమటిస్తున్నామని ఆ గ్రామానికి చెందిన కొందరు సీతక్క దృíష్టికి తీసుకెళ్లారు. తన నియోజకవర్గం కాకున్నా చలించిన సీతక్క.. ఎర్రటి ఎండలో గుట్టలు, వాగులు, దాటుకుంటూ 15 కి.మీ. సరుకుల మూట మోసుకుంటూ కాలిబాటన వెళ్లారు. కొంత దూరం వెళ్లిన తర్వాత దాహం వేయడంతో వాగులోని నీటిని తాగారు. మార్గ మధ్యలో వంట చేసుకుని భుజించారు. పెనుగోలు గ్రామానికి చేరుకున్న ఆమె కొంత మందికి సరుకులను పంపిణీ చేశారు. మిగతా వారికోసం తీసుకొచ్చిన సరుకులను గుమ్మడిదొడ్డి గ్రామంలో ఉంచామని, అక్కడికి వచ్చి తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ నేపథ్యంలో గుట్టలపై ఉన్న పెనుగోలు గిరిజనుల చెంతకు వెళ్లి ఓదార్చిన మొదటి ప్రజాప్రతినిధి సీతక్క కావడం గమనార్హం. ఆమె వెంట జయశంకర్ భూపాలపల్లి జిల్లా సబ్‌రిజిస్ట్రార్ తస్లీమా ఉన్నారు. చదవండి: ఆసుపత్రులకు లైన్ క్లియర్
Comments
Please login to add a commentAdd a comment