'బలిపీఠం ఎక్కించేలా కేసీఆర్ పాలన'
హైదరాబాద్: తెలంగాణ ఏర్పడితే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుతుందనుకుంటే.. సీఎం కేసీఆర్ పాలన బడుగుల బతుకులను బలిపీఠం ఎక్కించేలా ఉందని కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. బలహీన వర్గాల అభ్యున్నతిలో కేసీఆర్ మాటలు కోటలు దాటినా.. చేతలు మాత్రం గడప దాటడం లేదన్నారు. బడ్జెట్ లో కేటాయించిన నిధులు రూ.6738 కోట్లు అయితే, ఖర్చు చేసింది రూ. 3 - 4 కోట్లు మాత్రమేనన్నారు. మేనిఫెస్టోలో రూ.25 వేల కోట్లు బడుగుల అభ్యున్నతికి ఖర్చు చేస్తామని చెప్పారని.. ఆచరణలో ఆ హామీ ఎటుపోయిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రశ్నించారు.
బీసీల పట్ల కేసీఆర్ చూపుతున్న ప్రేమ మొసలి కన్నీరు లాంటిదే అన్నారు. అసెంబ్లీలో బీసీలకు సబ్ ప్లాన్ అమలు చేస్తానని చెప్పిన కేసీఆర్.. దాన్ని తప్పించుకునేందుకే బీసీలకు తాయిలాలు ప్రకటిస్తున్నారని విమర్శించారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు నిధులు కేటాయించి, ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజ్ రీయింబర్స్ మెంట్ నీరు గార్చడం వల్ల బీసీ విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని, ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకోకుండా చిత్తశుద్ధితో ఆ వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.