మండలికి తప్పని ఎన్నిక | MLC polls: No surprises in AP, contest inevitable in Telangana | Sakshi
Sakshi News home page

మండలికి తప్పని ఎన్నిక

Published Tue, May 26 2015 3:18 AM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM

మండలికి తప్పని ఎన్నిక - Sakshi

మండలికి తప్పని ఎన్నిక

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు బరిలో ఏడుగురు అభ్యర్థులు

సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట శాసన మండలికి ఎన్నికలు తప్పడం లేదు. ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉండటంతో పోటీ అనివార్యమైంది. నామినేషన్ల ఉపసంహరణకు సోమవారంతో గడువు ముగిసింది. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులెవరూ ఉపసంహరించుకోలేదు. గడువు ముగిశాక పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను మండలి ఎన్నికల అధికారి, శాసనసభా కార్యదర్శి రాజాసదారాం అధికారికంగా ప్రకటించారు.

కాంగ్రెస్ నుంచి ఆకుల లలిత, టీఆర్‌ఎస్ నుంచి తుమ్మల నాగేశ్వర్‌రావు, కడియం శ్రీహరి, నేతి విద్యాసాగర్, కె.యాదవరెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, టీడీపీ నుంచి వేం నరేందర్‌రెడ్డి పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యేల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే టీఆర్‌ఎస్‌కు నాలుగు, కాంగ్రెస్‌కు ఒకటి, ఇతర పార్టీల మద్దతుతో టీడీపీ ఒక స్థానం గెలుచుకోగలుగుతాయి. ఒకవేళ ఆరుగురు అభ్యర్థులే పోటీ పడి ఉంటే, మండలి ఎన్నిక ఏకగ్రీవమయ్యేది. కానీ, టీఆర్‌ఎస్ ఐదో స్థానంపై కన్నేసి అభ్యర్థిని పోటీకి దింపడంతో ఎన్నిక తప్పడం లేదు.
 
టీడీపీ నేతలకు గాలం!
ఎంతగా అంకెల గారడిని నమ్ముకున్నా, ఇతర పార్టీలకు చెందిన కొందరు ఎమ్మెల్యేల ఓట్లను సంపాదించడం టీఆర్‌ఎస్‌కు తప్పని పరిస్థితి. ఈ కారణంగానే టీడీపీకి చెందిన కొందరికి గాలమేస్తున్నట్లు సమాచారం. టీడీపీ ఎమ్మెల్యేలు మాధవరపు కృష్ణారావు, ప్రకాశ్ గౌడ్‌లు టీఆర్‌ఎస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. కాబట్టి వీరి రెండు ఓట్లు టీఆర్‌ఎస్‌కే పడతాయన్న అంచనాలు మొదలయ్యాయి. మరోవైపు ఈ ఎన్నికకు కొందరు ఎమ్మెల్యేలను గైర్హాజరు చేయిస్తే తమకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్న నాయకులు సీపీఎం, సీపీఐ ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు హాజరుకాకుండా చూసే పనిలో ఉన్నట్లు తెలిసింది. ఇది టీడీపీకి కొంత అనుకూలించే అంశమైనా, తమకు మరింత లాభకరమన్న అంచనాకు వచ్చారు. ఈ మేరకు ఓ మంత్రి ఇప్పటికే ఒకరిద్దరు ఎమ్మెల్యేలను ఓటింగ్‌కు హాజరుకావద్దని కోరినట్లు సమాచారం. ఆరు నూరైనా ఐదో ఎమ్మెల్సీని గెలిపించుకోవాలన్న పట్టుదల టీఆర్‌ఎస్ నేతల్లో కనిపిస్తోంది.
 
‘ఐదు’ కోసం టీఆర్ ఎస్ వ్యూహం
ఒక్కో ఎమ్మెల్సీ పదవిని గెలుచుకోవడానికి  18 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుచుకున్న స్థానాలకుతోడు, ఆంగ్లో ఇండియన్(నామినేటెడ్) సభ్యుడు, వివిధ పార్టీల నుంచి గులాబీ తీర్థం పుచ్చుకున్న వారిని కలిపితే  అధికార పార్టీ బలం 76కు చేరింది. అనధికార మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ఎంఐఎంకు చెందిన మరో ఏడుగురు ఎమ్మెల్యేలను కలిపితే ఆ పార్టీ చేతిలో 83 ఓట్లు ఉన్నాయి.

నలుగురు ఎమ్మెల్సీలను గెలుచుకోవడానికి 72 ఓట్లు పోగా, ఆ పార్టీకి ఇంకా 11 ఓట్లు ఉంటాయి. ఐదో ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలంటే టీఆర్‌ఎస్‌కు మరో ఏడు ఓట్లు అవసరమవుతాయి. దీంతో తొలి ప్రాధాన్య ఓటుతో కాకుండా, ద్వితీయ ప్రాధాన్య ఓటుతో బయట పడాలని టీఆర్‌ఎస్ లెక్కలు వేస్తోంది. ఇక బీజేపీ మద్దతిస్తున్న టీడీపీకి 16 ఎమ్మెల్యే ఓట్లు ఉన్నాయి. ఆ పార్టీ అభ్యర్థికి మరో రెండు ఓట్లు కావాలి. టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు తమ అభ్యర్థికి ఓట్లేస్తారన్నది గులాబీ నేతల ధీమా. ఆత్మప్రబోధం మేరకు నడుచుకోవాలని టీఆర్‌ఎస్ ఇప్పటికే పిలుపునిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement