
‘గీత’ సంక్షేమ విభాగాన్ని ఏర్పాటు చేయండి
గీత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్రమోదీకి టీఆర్‌ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ విజ్ఞప్తి చేశారు.
ప్రధాని మోదీకి టీఆర్‌ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: గీత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్రమోదీకి టీఆర్‌ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారమిక్కడ పార్లమెంట్‌లోని ప్రధానమంత్రి చాంబర్‌లో కలసి వినతిపత్రం ఇచ్చారు. కల్లు ఉత్పత్తులను పారిశ్రామిక ఉత్పత్తిగా గుర్తించడంతోపాటు ఎగుమతులకు అనుమతించాలని కోరారు.
కల్లు గీతలో అత్యాధునిక పద్ధతులపై శిక్షణ ఇప్పించేందుకు ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆరోగ్య బీమా సదుపాయాన్ని గీత కార్మికులతోపాటు వారి కుటుంబ సభ్యులకు వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదవశాత్తు గీతకార్మికుడు మరణిస్తే ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని విన్నవించారు. ‘మేక్ ఇన్ ఇండియా’లో చేతివృత్తులను భాగస్వాములు చేయాలని కోరారు.