
సాక్షి, హైదరాబాద్ : ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఎంటర్‌పెన్యూర్‌షిప్ సమ్మిట్ (జీఈఎస్) నేపథ్యంలో హైదరాబాద్‌లో హై అలర్ట్‌ను తలపిస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో మంగళవారం ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు, అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ పర్యటనతో పోలీసులు భారీ భద్రతతో పాటు బందోబస్తు కట్టుదిట్టం చేశారు. మియాపూర్, కూకట్‌పల్లి, ఫలక్ నుమా, చంద్రాయణగుట్ట, ఆరాంఘడ్ ప్రాంతాల్లో ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఇప్పటికే ఆయా మార్గాల్లో వెళ్లే బస్సులను వేరే మార్గంలో మళ్లించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు మియాపూర్‌తో పాటు కూకట్‌పల్లిలోని పలు విద్యాసంస్థలు మంగళవారం సెలవు ప్రకటించాయి కూడా.
ఇక ప్రధాని మోదీ మంగళవారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయంలో దిగుతారు. అక్కడ బీజేపీ నేతలకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని మియాపూర్ వెళ్లి మెట్రో రైల్‌ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి హెచ్‌ఐసీసీ, ఆపై తాజ్ ఫలక్‌నుమలకు వెళ్తారు. విందు ముగిసిన తర్వాత ప్రధాని శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ తిరిగి వెళ్ళనున్నారు. ఇవాంక మాత్రం బుధవారం సాయత్రం వరకు ఇక్కడే ఉంటారు. ఈ మూడు రోజుల్లోనూ మొత్తం మూడు విందులు జరుగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజ్ ఫలక్‌నుమలో, రాష్ట్ర ప్రభుత్వం గోల్కొండ కోటలో, అమెరికా ప్రభుత్వం హెచ్‌ఐసీసీ నోవాటెల్ హోటల్‌లో విందులు ఏర్పాటు చేశాయి. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలకు పోలీసు విభాగం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ఇందుకుగాను వివిధ విభాగాల నుంచి 10,400 మంది పోలీసులను కేటాయించారు.
ప్రధానికి సంబంధించి తాజ్ ఫలక్‌నుమ, శంషాబాద్ విమానాశ్రయం తప్ప మిగితా టూర్ మొత్తం హెలీకాఫ్టర్‌లో జరుగుతుంది. అయినా ఆయా చోట్లకు రోడ్డు మార్గంలో వెళ్ళే ప్రముఖులను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్‌కు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేశారు. వెస్టిన్ హోటల్, హెచ్‌ఐసీసీ, తాజ్ ఫలక్‌నుమ చుట్టుపక్కల సైతం ఎలాంటి ప్రత్యేక ఆంక్షలు విధించలేదు. అయితే ఆయా ప్రాంతాలకు వెళ్ళే వారు కచ్చితంగా తమ వెంట గుర్తింపుకార్డు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యంత కీలకమైన, ప్రతిష్టాత్మకమైన ఘట్టాలు కావడంతో అనుకోని ఇబ్బందులు ఎదురైనా ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. ఇప్పటికే వేదికలతో పాటు వాటికి దారి తీసే మార్గాల్లో ఉన్న చిరు వ్యాపారులను తొలగించారు. కాన్వాయ్‌లు, అతిథుల వాహనం ప్రయాణించేప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు.
అలాగే మెట్రో రైలు ప్రారంభోత్సవం అనంతరం హెచ్‌ఐసీసీలో జరగనున్న జీఈఎస్ సదస్సుకు మోదీ హాజరుకానున్న నేపథ్యంలో సోమవారం సైబరాబాద్ పోలీసులు కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించారు. మియాపూర్ నుంచి హెచ్‌ఐసీసీకి ప్రధాని హెలికాప్టర్‌లో చేరుకోనున్నప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా కాన్వాయ్ ట్రయల్‌రన్ నిర్వహించారు. 20కి పైగా వాహనాలు కాన్వాయ్‌లో పాల్గొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment