స్థిరంగా కదులుతున్న రుతుపవనాలు
మూడు నాలుగు రోజుల్లో రాష్ట్రంలోకి..
సాక్షి, హైదరాబాద్: కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లను ఇప్పటికే తాకిన రుతుపవనాలు తెలంగాణ వైపు స్థిరంగా కదులుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మూడు నాలుగు రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని పేర్కొంది. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడితే రుతుపవనాలు ఊపందుకుంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రం మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
ఇక శనివారం ఉదయం 8.30 గంటల నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల మధ్య కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలో 6 సెంటీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. దోమకొండ, ఇబ్రహీంపట్నం, ధార్‌పల్లిల్లో 5 సెంటీమీటర్ల చొప్పున, శాయంపేట్, ఆత్మకూరుల్లో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. ఆదివారం రామగుండంలో అత్యధికంగా 40.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఆదివారం ఉష్ణోగ్రతలు
ప్రాంతం ఉష్ణోగ్రతలు
రామగుండం: 40.6
ఆదిలాబాద్ : 39.8
భద్రాచలం : 39.6
నిజామాబాద్: 39.6
హన్మకొండ : 38.9
ఖమ్మం: 38.6
నల్లగొండ: 37.5
మెదక్: 34.7
హైదరాబాద్: 34.6