ఆహారభద్రతకు దరఖాస్తుల వెల్లువ
అందినవే 85 లక్షలదాకా...
సమగ్ర సర్వే సంఖ్యకు దగ్గరగా ఉన్నాయి...
20 నాటికి కోటికి చేరవచ్చంటున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆహారభద్రతా కార్డులకు దరఖాస్తులు వెల్లవలా వచ్చిపడుతున్నాయి. రాష్ట్రంలో శనివారం నాటికి 85.56 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు సంబంధిత అధికారులకు సమాచారం అందింది. దరఖాస్తులకు ప్రభుత్వం విధించిన గడువు మరో రెండు రోజుల్లో ముగుస్తుండడంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని, దీంతో సంఖ్య కోటికి చేరవచ్చునని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఎప్పటికప్పుడు జిల్లాలవారీగా దరఖాస్తులను సమగ్ర కుటుంబ సర్వేలో తేలిన కుటుంబాల సంఖ్యతోను, ఈ పీడీఎస్ ప్రకారం ఉన్న బీపీఎల్ కార్డులతోనూ పోల్చిచూస్తున్నారు. అందిన లెక్కలను బట్టి సమగ్ర కుటుంబ సర్వేలో తేలిన కుటుంబాల సంఖ్య, వచ్చే దరఖాస్తుల సంఖ్య దరిదాపుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా నిజామాబాద్ జిల్లాలో సర్వేలో తేలిన కుటుంబాల కన్నా వచ్చిన దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయి. ఇక మెదక్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న కార్డుల కన్నా ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి.