ప్రాజెక్టుల ఎస్కలేషన్‌కు ఓకే..!
సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపులకు మార్గం సుగమం
జీవో 13కు కొద్దిపాటి మార్పులతో ధరలు పెంచేందుకు కమిటీ సానుకూలం
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులకు పెరిగిన ధరలకు అనుగుణంగా ధరలు పెంచనున్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఎస్కలేషన్ అమలు చేస్తున్న దృష్ట్యా తెలంగాణలోనూ దీన్ని అమలు చేయాలని కాంట్రాక్టర్ల నుంచి వస్తున్న వినతుల నేపథ్యంలో ఎస్కలేషన్ కమిటీ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 13కు చిన్నపాటి సవరణలు చేసి అమలు చేయాలని నిర్ణయానికి వచ్చింది. ఎస్కలేషన్ కమిటీ మూడు నాలుగు రోజుల్లో మరోమారు సమావేశమై తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. ప్రభుత్వం ఆమోదించిన మరుక్షణం కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపులు మొదలవుతాయి.
25 ప్రాజెక్టులకు వర్తింపు...
రాష్ట్రంలో జలయజ్ఞం కింద మొత్తంగా 33 సాగునీటి ప్రాజెక్టులు కొనసాగుతుండగా, వాటితో 47.75 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మొత్తం ప్రాజెక్టులకు రూ.1,11,240 కోట్ల పరిపాలనా అనుమతులు లభించగా, కాంట్రాక్టర్లతో రూ.88,168 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయి. ఇందులో 2013-14 ఆర్ధిక ఏడాది ముగిసే నాటికి రూ. 37,935.23 కోట్ల మేర పనులు జరగగా, 2014-15 ఆర్ధిక ఏడాదిలో ఖర్చు చేసిన రూ.4,662.78 కోట్లను కలుపుకొని ఇప్పటివరకు రూ. 42,598.01 కోట్లు ఖర్చయినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో 8 ప్రాజెక్టుల పనులు దాదాపు పూర్తికాగా మిగతా 25 ప్రాజెక్టులకు ఎస్కలేషన్ వర్తించే అవకాశం ఉంది. 2014 ఫిబ్రవరి 2న అప్పటి ప్రభుత్వం జారీచేసిన జీవో 13 ప్రకారం 2013 ఏప్రిల్ నుంచి జరిగిన పనులన్నింటికి కొత్త ధరల ప్రకారం బిల్లుల్ని చెల్లించాల్సి ఉంటుంది.
భారం గరిష్టంగా రూ.6 వేల కోట్లు..
రిటైర్డ్ ఇంజనీర్ అనంతరాములు నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే దీనిపై కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తీసుకోగా, మంగళవారం మరోమారు కమిటీ భేటీయై వారి డిమాండ్లపై చర్చించింది. ప్రస్తుత పరిస్థితులు, పక్క రాష్ట్రంలో జీవో 13 అమలు, ప్రాజెక్టులు వేగంగా పూర్తి కావాలంటే ఎస్కలేషన్ వర్తింపు అవసరం తదితరాలపై క్షుణ్ణంగా చర్చించింది. సమావేశంలో దాదాపు జీవో 13ను అమలు చేయాలని, అదనపు నిర్మాణాలు చేసిన చోట సైతం చెల్లింపులు చేయడం సమంజసమేనని కమిటీ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నెల 15న మరోమారు సమావేశమై తుది నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని నిర్ణయించింది. 25 ప్రాజెక్టుల పరిధిలో ఏప్రిల్ 2013 నుంచి కనుక ఎస్కలేషన్‌ను వర్తింపచేయడం, అదనపు నిర్మాణాలకు చెల్లింపులు చేస్తే ప్రభుత్వంపై కనిష్టంగా రూ.3 వేల కోట్ల నుంచి గరిష్టంగా రూ.6వేల కోట్ల భారం పడుతుందని తేల్చినట్లుగా సమాచారం.