
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఏర్పాటు చేయతలపెట్టిన కొత్త జోన్లు, స్థానికత నిర్ధారణపై కొత్త చిక్కులు ముసురుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పలు సవరణలు ఆచరణలో ఇబ్బందికరంగా మారుతాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి మధ్య నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడి స్థానికత వర్తిస్తుందన్న నిర్వచనంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. దానివల్ల తెలంగాణ వారికి నష్టం జరిగే అవకాశం ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
హడావుడితో కొత్త సమస్యలు
కొత్త జోనల్ విధానానికి ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. పాత జోనల్ వ్యవస్థలో మార్పులు చేసిన సర్కారు.. కొత్తగా ఏడు జోన్లు, రెండు మల్టీజోన్లుగా పునర్ వ్యవస్థీకరించింది. ఈ మేరకు 371 (డి) కింద జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని కోరుతూ కేంద్ర హోంశాఖకు ప్రతిపాదనలు పంపింది. అయితే ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలన్న హడావుడిలో ప్రభుత్వం చేసిన కసరత్తు కొత్త సమస్యలకు దారితీస్తోంది.
కొత్త ‘స్థానికత’తో నష్టమే!
జోనల్ వ్యవస్థ మార్పులతో పాటు రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని స్థానికత నిర్వచనం కూడా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్రంలో అమల్లో ఉన్న విధానం ప్రకారం నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు నాలుగేళ్లు ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లా స్థానికతగా పరిగణిస్తారు. తాజాగా ప్రభుత్వం దీనిలో మార్పు చేస్తూ ఒకటి నుండి ఏడో తరగతి వరకు నాలుగేళ్ల పాటు ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లా స్థానికతగా పరిగణించాలని నిర్ణయించింది. అయితే అటు ఆంధ్రప్రదేశ్‌లో పాత విధానమే అమల్లో ఉంది. దీంతో తెలంగాణ అభ్యర్థులకు నష్టం జరుగుతుందనే వాదనలు వస్తున్నాయి. ఉదాహరణకు ఎవరైనా అభ్యర్థి ఒకటి నుంచి 4 లేదా 5వ తరగతి వరకు తెలంగాణలో చదివి, తర్వాత పదో తరగతి వరకు ఏపీలో చదివితే... రెండు చోట్లా స్థానికులుగా అర్హత పొందుతారు. అంటే ఏపీకి చెందినవారు తెలంగాణలోని స్థానిక కోటాలోనూ ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని... అదే జరిగితే తెలంగాణ స్థానికులు నష్టపోతారనే ఆందోళన వ్యక్తమవుతోంది. స్థానికతకు కొత్త నిర్వచనం వివాదాస్పదంగానే ఉందని ఉద్యోగ సంఘాల నేతలు సైతం పేర్కొంటున్నారు.
రాష్ట్ర కేడర్ లేకుంటే ఎలా?
కొత్త జోనల్ వ్యవస్థ ప్రతిపాదనల్లో.. రాష్ట్ర కేడర్ పోస్టులను మల్టీ జోనల్ పోస్టులుగా మార్చడంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశాలున్నాయి. ఇతర రాష్ట్రాల్లో జోనల్ విధానమే లేదు. అన్ని రాష్ట్రాల్లో స్టేట్ కేడర్ నియామకాలు ఉన్నాయి. కానీ రాష్ట్రం రూపొందించిన కొత్త విధానంలో కొత్తగా మల్టీ జోనల్ పోస్టులను తెచ్చారు. ఈ మల్టీజోనల్ పోస్టుల్లో నియామకాలు చేపట్టి పదోన్నతుల ద్వారా స్టేట్ కేడర్‌ను భర్తీ చేయాలని నిర్ణయించారు. అంటే స్టేట్ కేడర్ పోస్టుల్లో నేరుగా నియామకాలు ఉండవు. దీనికితోడు అన్ని కేడర్ పోస్టుల్లో 95 శాతం స్థానికులకే రిజర్వు చేసే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల తెలంగాణలో ఉంటున్న ఇతర ప్రాంతాలవారికి గతంలో ఉన్న పదిహేను శాతం ఉద్యోగాల అవకాశం కూడా కోల్పోతారని అంటున్నారు. అయితే స్థానికులకు, ప్రధానంగా రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల వారికి ఈ నిర్ణయం మేలు చేస్తుందని చెబుతున్నారు.