సాక్షి, హైదరాబాద్: హైటెక్ బాటలో దూసుకుపోతున్న మన గ్రేటర్ సిటీ ఇక హరిత భవనాలకూ కేరాఫ్ అడ్రస్‌గా నిలవబోతోంది. ఇప్పుడు వాణిజ్య, గృహ అవసరాలకు సైతం ఆయా వర్గాలు హరిత భవనాలను ఎంపిక చేసుకోవడం నిర్మాణ రంగంలో నయా ట్రెండ్‌గా మారింది. ఇటీవల మహానగరం పరిధిలో సుమారు 30 ప్రముఖ నిర్మాణ సంస్థలు భారీ హరిత భవనాల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం విశేషం. ఆయా బహుళ అంతస్తుల భవంతుల్లో సుమారు 18 లక్షల చదరపు అడుగుల మేర నివాస, వాణిజ్య స్థలం అందుబాటులోకి రానుంది. దక్షిణాదిలో బెంగళూర్ తర్వాత అత్యధిక గ్రీన్ బిల్డింగ్స్ నిర్మాణంతో మన సిటీ ముందుకెళుతోంది.
మెట్రో నగరాల్లో గ్రీన్‌బెల్ట్ ఇలా..
దేశంలో 35 శాతం గ్రీన్‌బెల్ట్‌తో చండీగఢ్ తొలిస్థానంలో ఉంది. 20.20 శాతంతో ఢిల్లీ, 19 శాతంతో బెంగళూర్, 15 శాతంతో కోల్‌కతా, 10 శాతంతో ముంబై,9.5 శాతంతో చెన్నై తరువాతి స్థానాల్లో ఉన్నాయి. హైదరాబాద్‌లో హరితం 8 శాతానికే పరిమితమైనందున, భవిష్యత్‌లో హరిత భవనాల నిర్మాణాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.
హరిత భవనాలకు డిమాండ్...
హరిత భవనాల్లో సహజ సిద్ధమైన సౌరశక్తి వినియోగం, పునర్వినియోగ విధానంలో మురుగునీటిని శుద్ధి చేసి వినియోగించడం, స్వచ్ఛమైన ఆక్సిజన్, కంటికి ఆహ్లాదం కలిగించేలా గ్రీన్‌బెల్ట్‌ను పెంపొందించే అవకాశాలుండటంతో ఇప్పుడు అన్ని వర్గాలవారు హరిత భవనాల వైపు మొగ్గుచూపుతున్నారు. మన నగరంలో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ప్రమాణాల మేరకు హరిత భవనాలను నిర్మించేందుకు పలు నిర్మాణ సంస్థలు ముందుకొస్తున్నాయని కౌన్సిల్ ప్రతినిధులు తెలిపారు. గ్రేటర్ పరిధిలో కొన్ని నిర్మాణ సంస్థలు ఇటీవల 30 భారీ గ్రీన్ బిల్డింగ్స్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాయి. హరిత భవనాల నిర్మాణానికి సాధారణ భవనాల కంటే 20% అధికంగా ఖర్చు అవుతున్నా భవిష్యత్‌లో ఆయా వాణి జ్య, గృహ సముదాయాలున్న భవనాలకు నిర్వహణ వ్యయం తగ్గుముఖం పడుతుందని విశ్లేషిస్తున్నారు.
హరిత భవనాలతో ఉపయోగాలివీ...
సహజ వనరులను పర్యావరణానికి హాని కలగని రీతిలో వినియోగించేందుకు వీలు.
- భవనాల నిర్మాణ ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణ వంటి అంశాల్లోనూ గ్రీన్ టెక్నాలజీ వినియోగంతో కర్బన ఉద్గారాలు, క్లోరోఫ్లోరో కర్బన్ల ఉద్గారాలు తగ్గుతాయి. గాలి, నీరు, నేల కాలుష్యం తగ్గుతుంది.
- ఆహ్లాదకరమైన హరిత వాతావరణంతో యూవీ రేడియేషన్ తీవ్రత తగ్గుతుంది.
- ఆయా భవనాల నుంచి వెలువడే మురుగునీటిని మినీ మురుగుశుద్ధి కేంద్రాల్లో శుద్ధిచేసి గార్డెనింగ్, ఫ్లోర్‌క్లీనింగ్, కార్ వాషింగ్ వంటి అవసరాలకు వినియోగించడం.
- చుట్టూ హరితహారం ఉండటంతో ఆయా భవనాల్లో ఉండేవారికి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతుంది.
- ఘన వ్యర్థాలను సైతం రీ సైకిల్ చేసి పునర్వినియోగం చేసేందుకు అవకాశం.
Comments
Please login to add a commentAdd a comment