నవమాసాలు మోసి జన్మనిచ్చింది.. పుట్టిన పిల్లలను అల్లారుముద్దుగా పెంచుకుంది.. భర్త అకాల మృతి.. పెరిగిన అప్పులతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది.. ఆదుకునే వారు లేక.. కుటుంబ పోషణ భారంగా మారడంతో చివరికి ఆ తల్లి కన్న బిడ్డలను అమ్మకానికి ఉంచిన ఉదంతమిది. మాతృదేవోభవ చిత్రాన్ని తలపించే రీతిలో ఉన్న ఈ ఘటన చందంపేట మండలంలో వెలుగుచూసింది.
► మాతృమూర్తి వే(రో)దన
► భర్త అకాలమృతి, భారమైన పిల్లల పోషణ
► విక్రయానికి సిద్ధపడిన తల్లి
► ఆదుకునేవారు లేక కఠిన నిర్ణయం
చందంపేట : చందంపేట మండలం గాగిళ్లాపురం గ్రామానికి చెందిన ముచ్చమయ్య, నీలమ్మ దంపతుల పదిహేనేళ్ల క్రితం వివాహం జరిగింది. కూలీ పనులు చేస్తూ జీవ నం సాగిస్తున్నారు. ఈ దంపతులకు ఆలస్యంగా మొదటి సంతానంలో మగ శిశువు జన్మించగా, రెండో కాన్పులో ఇద్దరు కవలలు మగ,ఆడ శిశువులు జన్మించారు.
విధి కన్నెర్రజేయడంతో..
సజావుగా సాగుతున్న ఆ పచ్చని కుటుంబంపై విధి కన్నెర్రజేసింది. కుటుంబ పెద్ద అనారోగ్యం బారిన పడడంతో సంసారం కాకావికలమైంది. ఓ వైపు చంటి పిల్లలను సాకుతూనే భర్తను కాపాడుకునేందుకు ఆ ఇల్లాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. రూ. 2 లక్షల వరకు అప్పుచేసి చికిత్స చేయించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు 14 నెలల క్రితం భర్త ముచ్చమయ్య కన్నుమూయడంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది.
గ్రామాభివృద్ధికి పాటుపడినా..
గతంలో ముచ్చమయ్య తండ్రి మాసారం ఆలయ్య గాగిళ్లాపురానికి సర్పంచ్‌గా ఉండగా, నీలమ్మ కూడా వార్డు సభ్యురాలిగా పని చేసి గ్రామ అభివృద్ధి కృషిచేసింది. కానీ మామ, భర్తల అకాల మరణంతో నీలమ్మ కుటుంబంపై అనుకోని భారం పడింది. గ్రామంలో రూ.4 లక్షలు విలువ చేసిన తన ఇంటిని బేరం రాకపోవడంతో రూ.2 లక్షలకు బేరం పెట్టినా కొనేందుకు ఎవరు ముందుకు రాలేదు. వరుస మరణాలు చోటు చేసుకోవడంతో కొనేందుకు ముందుకు రావడం లేదని ప్రచారం జరగడంతో ఇళ్లు బేరం ఆగిపోయింది. తన కుటుంబాన్ని ఆదుకోవాలని నీలమ్మ కోరినా గ్రామస్తులెవరూ ముందుకు రాలేదు.
అప్పుల వారి ఒత్తిడి.. పిల్లలను సాకలేక..
భర్త అకాల మృతితో నీలమ్మకు పిల్లల పోషణ భారంగా మారింది. దీనికితోడు భర్త వైద్య చికిత్స నిమిత్తం చేసిన అప్పులు తీర్చాలని ఒత్తిడి పెరగడంతో తట్టుకోలేక పోయింది. చివరకు నీలువ నీడను విక్రయించేందుకు బేరం పెట్టినా కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
ఆడపిల్లకు రెండు తులాల బంగారం..
మగపిల్లాడికి రూ. 8 లక్షలు..
తన దీనస్థితి.. ఆకలికి అలమటిస్తున్న పిల్లల దుస్థితి.. మరో వైపు అప్పుల వారి ఒత్తిడిని తట్టుకోలేక ఆ తల్లి ఓ కఠిన నిర్ణయానికి వచ్చింది. కడుపున పుట్టిన పిల్లలైన బాగుండాలనే ఉద్దేశంతో కన్నపేగును అమ్మేందుకు సిద్ధపడింది. తన గోడును మిర్యాలగూడకు చెందిన ఓ వ్యక్తి వద్ద వెళ్లబోసుకోగా రెండో కాన్పులో జన్మించిన ఆడపిల్లకు రెండు తులాల బంగారం ఇచ్చేందుకు ఒప్పుకున్నాడని, మగపిల్లాడు (హరికృష్ణ)కు రూ.8 లక్షలు ఇచ్చేందుకు మరో వ్యక్తి సిద్ధంగా ఉన్నాడని ఆ తల్లి ‘సాక్షి’ ఎదుట కన్నీటి పర్యంతమైంది.
గత్యంతరం లేకనే.. : నీలమ్మ
పిల్లలను అమ్ముకోవడం నాకూ ఇష్టం లేదు..చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయినయ్. ఇల్లు అమ్మి అప్పులు తీరుద్దామంటే కొనేందుకు ముందుకొస్తలేరు. ఒక్కదాన్నే కుటుంబాన్ని పోషించలేకపోతున్నా. కనీసం పిల్లలకు కడుపు నిండా పాలు కూడా తాపలేకపోతున్నా. గత్యంతరం లేకనే అమ్మకానికి సిద్ధమైన. ఎవరైన ముందుకొచ్చి ఆసరా కల్పిస్తే నా నిర్ణయం మార్చుకుంటా.