ఖమ్మంజడ్పీ సెంటర్ : జిల్లాలో అర్హులైన రైతులందరికీ వెంటనే రుణమాఫీ వర్తింపజేయాలని, వ్యవసాయానికి నిరంతరాయంగా ఏనిమిది గంటల విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నాచౌక్‌లో మహాధర్నా నిర్వహించారు. తొలుత వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు ప్రదర్శనగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
ధర్నాచౌక్‌లో ఏర్పాటు చేసిన శిబిరంలో బైఠాయించి రుణమాఫీని వెంటనే అమలు చేయాలి, కొత్త రుణాలు అందించాలి, సోనియా రాహుల్ నాయకత్వం వర్దిల్లాలి, కాంగ్రెస్ జిందాబాద్, కిలాడి చంద్రశేఖర్‌రావు ఢాం ఢాం అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పార్టీ జిల్లా కార్యాలయం ఇన్‌చార్జి అయితం సత్యం అధ్యక్షతన జరిగిన ధర్నాలో పలువురు నేతలు ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ పథకాన్ని వెంటనే అమలు చేసి కొత్తరుణాలు ఇవ్వాలని రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి డిమాండ్ చేశారు.
రైతులకు ఎరువులు, విత్తనాలు అందించి రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు. కేసీఆర్ వందరోజుల పాలనలో 175 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రైతులు కష్టకాలంలో ఉన్న ఈ సమయంలో ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అక్రమార్కుల పాలిట హిట్లర్ అని కేసీఆర్ చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు.
సమగ్ర సర్వే పేరుతో ప్రజలందరినీ ఉరుకులు పరుగులు పెట్టించి, ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న వారిని కూడా రప్పించి, చివరకు సంక్షేమ పథకాలు అందకుండా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రెక్కలు ముక్కలు చేసుకొని వ్యవసాయం చేస్తున్న రైతులకు ఆలస్యం చేయకుండా రుణమాఫీ ఇవ్వాలన్నారు. వందరోజుల పాలనలో వెయ్యి అబద్దాలు చెప్పిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
కేసీఆర్ తెలంగాణ ప్రజలకు మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. దేశవ్యాప్తంగా రూ. 75వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందన్నారు. ఆ రుణమాఫీలో కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులు కూడా మాఫీ పొందలేదా? అని ప్రశ్నించారు. 2001లో సోనియాగాంధీ నాయకత్వంలో వై.ఎస్. రాజశేఖరరెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి రైతుల కష్టాలు తెలుసుకొని ఉచిత విద్యుత్ అమలు చేశారన్నారు.
ప్రభుత్వం రుణమాఫీపై బ్యాంకర్లకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదని మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఆరోపించారు. వెంటనే రుణమాఫీ పై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకర్లు మాత్రం పాతరుణాలు చెల్లిస్తేనే మరలా కొత్తరుణాలు చెల్లిస్తామని చెబుతున్నారని తెలిపారు. రాష్ట్రం ఆత్మహత్యల తెలంగాణగా మారుతోందన్నారు. రైతులందరికీ రుణమాఫీని వర్తింపజేసి ఆదుకోవాలని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ కోరారు. బంగారం రుణాలు, పట్టణ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
రైతులను తికమక పెట్టకుండా స్పష్టమైన వైఖరిని తీసుకుని మాఫీని అమలు చేయాలని, వర్షాలు కురిసి వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున రైతులకు అవసరమైన అన్ని ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుకుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కిలాడి కేసీఆర్ రోజుకోమాట చెబుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు.
వందరోజుల పాలనలో ఆయన చేసిన ఘనకార్యం ఏమీ లేదన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు కలెక్టరేట్‌లోకి వెళ్ళేందుకు ప్రయత్నించారు. అప్పటికే గేట్లు మూసి వేయడంతో పలువురు ముఖ్యనాయకులు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ ఇలంబరితికి అందచేశారు. ఈ మహాధర్నాలో నాయకులు ఎడవల్లి కృష్ణ, మానుకొండ రాధాకిషోర్, శీలంశెట్టి వీరభద్రం, నాగండ్ల దీపక్‌చౌదరి, పరుచూరి మురళి, పులిపాటి వెంకయ్య, వి.వి.అప్పారావు, వడ్డెబోయిన శంకర్, కొల్లు పద్మ, దేవబత్తిని కిషోర్, విజయ్‌కుమార్, కూల్‌హోం ప్రసాద్, వెంకట్, మగ్బూల్, నరేంద్రచౌదరి, మనోహర్‌నాయుడు పాల్గొన్నారు.
‘మాఫీ’ చేయకుంటే రణమే..
Published Sat, Sep 13 2014 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 1:16 PM
Advertisement