‘చరిత్ర’ను చదును చేసేశారు | Moyinabad archaeological treasures in the suburbs | Sakshi
Sakshi News home page

‘చరిత్ర’ను చదును చేసేశారు

Published Sun, Nov 20 2016 2:47 AM | Last Updated on Mon, Sep 4 2017 8:33 PM

‘చరిత్ర’ను చదును చేసేశారు

‘చరిత్ర’ను చదును చేసేశారు

బృహత్ శిలాయుగం నాటి జనావాస ఆనవాళ్లు ధ్వంసం
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ శివార్లలో పురావస్తు సంపద
ఆ రక్షిత ప్రాంతం సబ్‌స్టేషన్‌కు కేటాయింపు

 
సాక్షి, హైదరాబాద్: ఉత్తర ఆఫ్రికాకు తెలంగాణకు సంబంధం ఏమైనా ఉంటుందా?.. మూడు వేల ఏళ్ల క్రితమే మధ్యధరా సముద్ర ప్రాంతం నుంచి తెలంగాణకు వలసలుండేవన్న విషయం తెలుసా?.. ఇనుముకు కార్బన్‌ను జోడిస్తే అది దృఢంగా మారుతుందన్న విషయాన్ని గుర్తించి దక్కన్ పీఠభూమి ప్రాంతంలో నివసించిన ఆనాటి వారు రెండున్నర వేల ఏళ్ల కిందే ఉక్కును రూపొందించారని తెలుసా?.. నిజమే ఇనుపయుగం నాటి మానవుల సమాధులున్న ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి, పరిశోధనలు చేసినప్పుడు బయటపడ్డ విషయాలివి. హైదరాబాద్ శివార్లలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పక్కనున్న కేతిరెడ్డిపల్లి గ్రామంలో ఈ పురాతన సంపద ఉంది. కానీ మూడు వేల ఏళ్ల నాటి పెద్ద జనావాసమున్న ఈ పురాతన సంపద ఆనవాళ్లు అధికారుల నిర్లక్ష్యం కారణంగా నాశనమైపోయాయి.

నిజాం హయాంలో గుర్తింపు
కేతిరెడ్డిపల్లి గ్రామం వెలుపల వందల సంఖ్యలో బృహత్ శిలాయుగం నాటి సమాధులున్నాయి. నిజాం హయాంలో నాటి పురావస్తు నిపుణులు దీనిని గుర్తించారు. దాంతో ఈ ప్రాంతాన్ని పరిరక్షించాలని భావించిన నిజాం.. సమాధులు విస్తరించి ఉన్న దాదాపు 40 ఎకరాల స్థలాన్ని పురావస్తుశాఖకు అప్పగించారు. స్వాతంత్రం అనంతరం పురావస్తు శాఖ దానిని రక్షిత స్థలంగా ప్రకటిస్తూ బోర్డులు కూడా ఏర్పాటు చేసింది. పురావస్తు రక్షిత ప్రాంతంగా గుర్తిస్తూ 1953లో గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. భవిష్యత్తులో వాటిని తవ్వి సమాధుల్లో లభించే వస్తువుల ఆధారంగా పరిశోధనలు చేయాలని అప్పట్లో నిర్ణయించినా తర్వాత పట్టించుకోలేదు. ఆ స్థలం ప్రభుత్వ ఆధీనంలోనిదే కావడంతో అలాగే ఖాళీగా ఉండిపోయింది.

సబ్‌స్టేషన్ కోసం
ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రానికి విద్యుత్ కారిడార్ నిర్మాణంలో భాగంగా.. హైదరాబాద్ శివార్లలో 400 కేవీ సామర్థ్యం గల సబ్‌స్టేషన్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ట్రాన్‌‌సకో మొయినాబాద్ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని, అక్కడ స్థలం కావాలని రెవెన్యూ శాఖను కోరింది. దీంతో అధికారులు సరిగ్గా పురావస్తు సంపద ఉన్న చోటే 71 ఎకరాల స్థలాన్ని ట్రాన్‌‌సకోకు అప్పగించారు. ట్రాన్‌‌సకో రెండు నెలలుగా ఈ ప్రాంతాన్ని చదును చేసే పని చేపట్టింది. అక్కడ పురావస్తు సంపద ఉన్న విషయాన్ని రెండు శాఖలూ గుర్తించలేదు. ఈ క్రమంలో సమాధులకు గుర్తుగా భారీ రాళ్లతో వృత్తాకారంలో ఏర్పాటు చేసిన నిర్మాణాలను తొలగించేశారు. కొన్ని వందల నిర్మాణాలు ధ్వంసమయ్యాక గ్రామస్తుల సమాచారంతో మేల్కొన్న పురావస్తు శాఖ అధికారులు... హడావుడిగా వెళ్లి పనులను ఆపివేయించారు. దీంతో 18 ఎకరాల ప్రాంతం మాత్రం మిగిలింది. ఇందులో ఉన్న కొన్ని సమాధులను పరిరక్షించాలని పురావస్తు శాఖ అధికారులు నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement