ఆ 4 జిల్లాలపై 7న నివేదిక
* ఎంపీ కేకే నేతృత్వంలో హైపవర్ కమిటీ భేటీ
* వివిధ జిల్లాల నేతలతో సుదీర్ఘ చర్చలు
* రేపటి వరకు వినతులు, అభ్యంతరాల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ప్రతిపాదించిన నాలుగు జిల్లాలపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ తొలిసారి భేటీ అయింది. ఎంపీ కేశవరావు నేతృత్వంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఆయన నివాసంలో సుదీర్ఘంగా చర్చలు జరిపింది. కమిటీ సభ్యులు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు జగదీశ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జోగు రామన్న ఇందులో పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచనల మేరకు జనగామ, గద్వాల, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటుపై, వివిధ జిల్లాల నుంచి వచ్చిన నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. వారు ఇచ్చిన వినతులు, నివేదికలను స్వీకరించారు. భేటీ అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 6వ తేదీ వరకు ఈ నాలుగు జిల్లాలపై వినతులు, అభ్యంతరాలు, సలహాలు స్వీకరిస్తామన్నారు. వీటన్నింటిని పరిశీలించి 7వ తేదీన ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చెప్పారు.
డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో ప్రకటించిన 17 జిల్లాలు కాకుండా మరో నాలుగు జిల్లాలకు వచ్చిన డిమాండ్లను పరిశీలించేందుకు సీఎం హైపవర్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ నాలుగు జిల్లాల ఏర్పాటు అంశాన్ని అధ్యయనం చేసి 7వ తేదీ మధ్యాహ్నం వరకు నివేదిక ఇవ్వాలని సూచించారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కొత్త జిల్లాల డిమాండ్ల పరిశీలనపై అత్యవసర సమావేశాలు నిర్వహించుకుని వేగంగా ప్రక్రియను ముగించాలని హైపవర్ కమిటీని సీఎం కోరారు.
హైదరాబాద్‌ను అలాగే ఉంచండి: నాయిని
హైదరాబాద్‌ను ఒకే జిల్లాగా ఉంచాలని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హైపవర్ కమిటీకి విజ్ఞప్తి చేశారు. చారిత్రక ప్రాధాన్యమున్న దృష్ట్యా ఒకే జిల్లాగా కొనసాగించాలని కోరారు. నల్లగొండ జెడ్పీ చైర్మన్ బాలూనాయక్ దేవరకొండను జిల్లాగా చేయాలని కమిటీని కోరగా.. ఇందుకు నాయిని మద్దతు తెలిపారు.
సీఎంకు కృతజ్ఞతలు: డీకే అరుణ
గద్వాల ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చినందుకు మాజీ మంత్రి డీకే అరుణ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. గద్వాల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలతో కలసి హైపవర్ కమిటీతో ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దాదాపు అరగంటపాటు కమిటీ సభ్యులతో చర్చించారు. గద్వాలకు ఉన్న చారిత్రక ప్రాధాన్యంతో పాటు భౌగోళికంగా జిల్లాకు ఉండాల్సిన స్వరూపానికి సంబంధించిన వివరాలను కమిటీ సభ్యులతో పంచుకున్నారు.
అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మహబూబ్‌నగర్ జెడ్పీ చైర్మన్ కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు. గద్వాల జిల్లా ఏర్పాటుపై చర్చించారు. ఏయే మండలాలతో జిల్లా ఏర్పాటుకు మార్గం సుగమమవుతుందో వివరిస్తూ నివేదికను సమర్పించారు.
కల్వకుర్తిని డివిజన్ చేయండి
కల్వకుర్తి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత వంశీచంద్‌రెడ్డి కమిటీ సభ్యులను కలసి కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఒక నివేదికను సమర్పించారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కూడా కమిటీకి ఇదే విన్నవించారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా బారువత్ గ్రామస్తులు ఎంపీ కేకే నివాసం ఎదుట ఆందోళన చేశారు. తమ గ్రామాన్ని మండలంగా మార్చాలని డిమాండ్ చేశారు.