ఎంపీ రాజయ్యకు బెయిల్ మంజూరు
బెయిల్ రద్దు చేయించి, అతని కుమారుడ్ని అరెస్టు చేయండి
హైదరాబాద్: వరకట్న వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న వరంగల్ ఎంపీ రాజయ్య దంపతులకు బెయిల్ లభించింది. బెయిల్ షూరిటీ కాపీలను వారు శుక్రవారం బేగంపేట మహిళా పోలీసు ఇన్‌స్పెక్టర్ ధనలక్ష్మికి అందజేశారు. ఇదిలాఉండగా, బెయిల్‌ను రద్దు చేయించి, కేసులో ఉన్న నిందితులందర్నీ అరెస్టు చేయాలని రాజయ్య కోడలు సారిక డిమాండ్ చేసింది.
తనను అత్తమామలు, భర్త అనిల్ వేధిస్తున్నారని రాజయ్య కోడలు సారిక చేసిన పిర్యాదు మేరకు రాజయ్యతో పాటు కుటుం బ సభ్యులపై బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజయ్య కుటుంబం ముందస్తు బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు.
కేసులో రెండవ నిందితుడిగా ఉన్న రాజయ్య, మూడవ నిందితులుగా ఉన్న ఆయన బార్య మాధవిలకు బెయిల్ మంజూరయింది. ప్రధాన నిందితుడిగా ఉన్న రాజయ్య కుమారుడు అనిల్‌కుమార్‌కు మాత్రం కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో శుక్రవారం సాయంత్రం రాజ య్య దంపతులు మహిళా పోలీస్ స్టేషన్‌కు వచ్చి స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ధనలక్ష్మి వద్ద లొంగిపోయారు. అధికారులకు బెయిల్ పత్రాలు సమర్పించి వారు వెళ్లిపోయారు. రాజయ్య కుమారుడు అనిల్‌ను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
పిల్లలను ఆదుకోండి: సారిక
ఇదిలా ఉండగా, తన భర్త అనిల్‌కు రెండో పెళ్లి చేసేందుకు అత్తమామలు సిద్ధమయ్యారని సారిక ఆరోపించారు. అనిల్‌ను అరెస్టు చేసి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తన అత్తమామకు లభించిన బెయిల్‌ను కూడా రద్దు చేయించేందుకు పోలీసు అధికారులు సహకరించాలని ఆమె కోరారు. తన ముగ్గురు పిల్లలను హీనంగా చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు కనీసం తిండి, పాలు కూడా లేవని, వారి పోషణకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆమె ‘న్యూస్‌లైన్’తో వేడుకున్నారు.