‘పరిషత్‌’ కౌంటింగ్‌ వాయిదా | MPTC ZPTC Elections Counting Postponed | Sakshi
Sakshi News home page

‘పరిషత్‌’ కౌంటింగ్‌ వాయిదా

Published Sat, May 25 2019 1:21 AM | Last Updated on Sat, May 25 2019 6:38 AM

MPTC ZPTC Elections Counting Postponed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాజకీయ పక్షాల విజ్ఞప్తికి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌(ఎస్‌ఈసీ) సాను కూలంగా స్పందించింది. పరిషత్‌ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్‌ ప్రక్రియను వాయిదా వేసింది. ఈ నెల 27న నిర్వహించాల్సిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. మళ్లీ ఏ తేదీన కౌంటింగ్‌ను చేపట్టబోయేది త్వరలోనే ప్రకటించనున్నట్టు శుక్రవారం ఎస్‌ఈసీ తెలియజేసింది. జూలై 3న కౌంటింగ్‌ నిర్వహణ కోసం పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఈసీకి ప్రత్యామ్నాయ షెడ్యూల్‌ను ప్రతిపాదించారు. ఫలితాల వెల్లడికి, జెడ్పీ చైర్‌పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షులను ఎన్నుకోవడానికి మధ్య ఎక్కువ వ్యవధి ఉండరాదని ఎస్‌ఈసీ అభిప్రాయపడుతోంది. అయితే, ఈవిధంగా చేయాలంటే నూతన పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణ చేయాల్సి ఉందని, ఈ విషయంలో తగిన ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నామని ఎస్‌ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్‌ తెలిపారు.

కౌంటింగ్‌ తేదీని త్వరలోనే తెలియజేస్తామన్నారు. పరిషత్‌ ఫలితాల వెల్లడి తర్వాత  జెడ్పీపీ చైర్‌పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షులను ఎన్నుకునేందుకు 40 రోజులకుపైగా సమయముంటే ప్రలోభాలు, అక్రమాలకు అవకాశమున్నందున ఓట్ల లెక్కింపును వాయిదా వేయాలని కాంగ్రెస్, బీజేపీ, అఖిలపక్ష బృందం వేర్వేరుగా ఎస్‌ఈసీకి విజ్ఞప్తి చేశాయి. పరిషత్‌ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక, పరోక్ష పద్ధతుల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు జెడ్పీపీ చైర్‌పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షులను ఎన్నుకునే సమయాన్ని వీలైనంత తక్కువగా పెట్టాలని కోరాయి. అయితే, అధికశాతం బ్యాలెట్‌ బాక్సులను పాఠశాలలు, రెసిడెన్షియల్‌ స్కూళ్లు, జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరిచారు. కౌంటింగ్‌ ఆలస్యమైన కొద్ది ఈ విద్యాసంస్థల విద్యార్థులకు ఇబ్బంది కలగనున్నందున, ఈ అంశంపై తగిన నిర్ణయం తీసుకోవాలని ఎస్‌ఈసీ భావిస్తోంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లభించాక ఆ తేదీని ప్రకటించనుంది. కౌంటింగ్‌ కేంద్రాల్లో భద్రతాపరమైన ఏర్పాట్లు, బ్యాలెట్‌బాక్స్‌ల స్టోరేజీకి సంబంధించి విద్యాశాఖ కార్యదర్శి తగిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీ సూచించింది. కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు స్ట్రాంగ్‌రూమ్‌లకు సెక్యూరిటీని కొనసాగించాల్సిందిగా డీజీపీని కోరింది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్‌ సూచించారు.  

రాజకీయపక్షాల విజ్ఞప్తి... 
ఈ నెల 27న ఓట్ల లెక్కింపునకు ఎస్‌ఈసీ నిర్ణయించిన నేపథ్యంలో దానిని వాయిదా వేయాలని వివిధ రాజకీయపార్టీలు చేసిన విజ్ఞప్తులు, వాటిపై ఎలా స్పందించాలనే అంశం చర్చకు వచ్చాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటల తర్వాత పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు ఎస్‌ఈసీ వద్దకు వచ్చి జులై 3న కౌంటింగ్‌ నిర్వహణకు సంబంధించి ప్రత్యామ్నాయ షెడ్యూల్‌ను లేఖ రూపంలో అందజేశారు. దీంతో సోమవారం (27న) నిర్వహించాల్సిన పరిషత్‌ కౌంటింగ్‌ వాయిదా వేసేందుకు ఎస్‌ఈసీ నిర్ణయించింది. ఈ నెల 6, 10, 14 తేదీల్లో మూడు విడతలుగా 538 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పోలైన ఓట్ల బ్యాలెట్‌ బాక్సులను రాష్ట్రవ్యాప్తంగా 123 ప్రాంతాల్లోని 536 స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరిచారు. మొత్తం 123 కౌంటింగ్‌ సెంటర్లలోని 978 కౌంటింగ్‌ హాళ్లలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం 11,882 మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, 23,647 మంది కౌంటింగ్‌ అసిస్టెంట్లు, ఇతర ఎన్నికల సిబ్బందిని కూడా నియమించారు. వేసవి సెలవుల నేపథ్యంలో స్ట్రాంగ్‌రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాలను ఎక్కువగా స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థల్లో ఏర్పాటు చేశారు. సెలవుల అనంతరం విద్యాసంస్థలు తెరిచేలోగా, వర్షాకాలం మొదలయ్యే లోగా కౌంటింగ్‌ను ముగిస్తే విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఉంటుందని ఎస్‌ఈసీ భావించింది. 

కోర్టులో విచారణకు రాబోతోందని...: టీపీసీసీ 
ఫలితాలు ప్రకటించిన 40 రోజుల తర్వాత పరిషత్‌ అధ్యక్షుల ఎన్నికల నిర్వహణ ప్రలోభాలకు అవకాశం ఇస్తుందంటూ ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన కొందరు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించినట్లు టీపీసీసీ అధికారప్రతినిధి ఇందిర శోభన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో వేసిన ఈ పిటీషన్లు త్వరలోనే హియరింగ్‌ రానుండటంతో ప్రభుత్వం కౌంటింగ్‌ ప్రక్రియను వాయిదా వేయాలని నిర్ణయించిందని ఆమె పేర్కొన్నారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement