మూలవాగుపై ఫోర్‌లేన్ బ్రిడ్జి
బోయినపల్లి :
మండలంలోని కొదురుపాక నుంచి వేములవాడ మండలం ఆరెపల్లి వరకు ఫోర్‌లేన్ బ్రిడ్జి నిర్మాణం కోసం ఇంజినీరింగ్ అధికారులు ఆదివారం కొదురుపాకలో ప్రాథమికంగా సర్వే నిర్వహించారు. మధ్యమానేరు జలాశయంలో కొదురుపాక, శాభాష్‌పల్లి, వరదవెల్లి గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో కరీంనగర్ నుంచి వేములవాడ వరకు ఫోర్‌లైన్ రోడ్డు నిర్మాణానికి అధికారులు నిర్ణరుుంచారు. ఈ క్రమంలో కరీంనగర్-సిరిసిల్ల మధ్యలో ఉన్న మూడు గ్రామాల రోడ్లు మిడ్‌మానేర్ జలాశయంలో ముంపునకు గురవుతున్నాయి. వీటి స్థానంలో ఫోర్‌లేన్ బ్రిడ్జి నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ, మిడ్‌మానేర్ ఇంజినీరింగ్ అధికారులు సర్వే చేశారు. కొదురుపాక నుంచి వేములవాడ మండలం ఆరెపల్లి గ్రామ పరిసరాల వరకు బ్రిడ్జి నిర్మాణం చేయాలని అంచనాకు వచ్చారు. ఇప్పుడున్న పాత రోడ్డు స్థానంలో ఫోర్‌లేన్ బ్రిడ్జి నిర్మిస్తే దాదాపు రూ. 150 కోట్లు వ్యయం కానుంది. అయితే కొదురుపాక ఆర్‌అండ్‌ఆర్ కాలనీ నుంచి మూలమలుపులు లేకుండా స్ట్రేట్‌గా ఆరెపల్లి వరకు బ్రిడ్జి నిర్మిస్తే రూ.75 కోట్లు, వరదవెల్లి వయా సంకెపెల్లి గ్రామాల మీదుగా ఆరెపల్లి వరకు బ్రిడ్జి నిర్మిస్తే రూ. 50 కోట్లు వ్యయం కానుందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మిడ్‌మానేర్ నీటి ఉధృతి తగలకుండా ఫోర్‌లేన్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం పూర్తిగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఆర్‌అండ్‌బీ ఈఈ రాఘవచారి, మిడ్‌మానేర్ ఈఈ గోవిందరావు, డీఈ, ఏఈలు, జెడ్పీటీసీ కొనుకటి లచ్చిరెడ్డి, నాయకులు జక్కని లక్ష్మీనారాయణ, పాపారావు తదితరులు ఉన్నారు.
నేడు మార్కింగ్
ఫోర్‌లేన్ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా క్షేత్రస్థాయిలో రూట్‌మ్యాప్ తయారుచేసి సోమవారం మార్కింగ్ ఇవ్వడానికి ఆర్‌అండ్‌బీ, మిడ్‌మానేర్ ఇంజినీరింగ్ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు కొదురుపాక గ్రామం నుంచి ఫోర్‌లైన్ బ్రిడ్జి నిర్మాణానికి మార్కింగ్ ఇవ్వనున్నారు.