
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీల్లో లేఅవుట్ల రిజిస్ట్రేషన్ల వ్యవహారం తలనొప్పిగా మారుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల దూకుడుతో అడ్డగోలుగా పుట్టుకొస్తున్న ఈ లేఅవుట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ మున్సిపల్ అధికారులు మెలికపెడుతుండటం, రిజిస్ట్రేషన్ చేయడం వరకే తమ పని అని, ఆ లేఅవుట్ అక్రమమో,సక్రమమో తామెలా తేలుస్తామని రిజిస్ట్రేషన్ అధికారులు చెబుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా లేఅవుట్ల రిజిస్ట్రేషన్లలో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇరు శాఖల మధ్య సమన్వయలోపం, కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం లేఅవుట్ల విషయంలో కఠినంగా ఉం డాలని నిబంధనలు చెబుతుండటం, రిజి స్ట్రేషన్ చేయకూడని లేఅవుట్లను మున్సిపల్ శాఖ సరిగా గుర్తించలేకపోవడం, రిజిస్ట్రేషన్లు చేయొద్దంటూ మున్సిపల్ వర్గాల నుంచి లేఖలు వచ్చిన చోట్ల రిజిస్ట్రేషన్ల శాఖ ఆ మున్సిపాలిటీల పరిధిలో లేఅవుట్ల రిజిస్ట్రేషన్లను నిలిపేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి కూడా గండి పడుతోంది. అయితే, ఈ లేఅవుట్ల రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో స్పష్టత ఇవ్వాలని ఇప్పటికే రిజిస్ట్రేషన్ల శాఖ మున్సిపల్ శాఖను కోరినా మొన్నటి వరకు ఎన్నికల బిజీలో ఉన్న పురపాలక శాఖ ఇంకా స్పందిచనట్లు తెలుస్తోంది.
పంచాయతీల నుంచి మున్సిపాలిటీల వరకు
15–20 ఏళ్లుగా లే అవుట్ల వ్యాపారం రియల్ వ్యాపారులకు కాసులు కుమ్మరిస్తోంది. అయితే, వీరు అనుమతులు తీసుకోకపోవడం, నిబంధన లు పాటించకపోవడంతో కొనుగోలుదారులు నష్టపోవాల్సి వస్తోంది. డీటీసీపీ, హెచ్‌ఎండీఏ లాంటి సంస్థల అనుమతుల్లేకుండానే అంతస్తుల మీద అంతస్తులు రాత్రికి రాత్రే వెలుస్తున్నాయి. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. దీంతో కొత్త మున్సిపల్ చట్టంలో లేఅవుట్లపై కఠిన నిబంధనలు విధించారు.
స్పష్టత ఇవ్వండి: ఈ అక్రమ లేఅవుట్ల విషయంలో తామెలా ముందుకెళ్లాలన్న దానిపై చట్టపరంగా ఉన్న సానుకూలతలు తెలుపుతూ స్పష్టత ఇవ్వాలని రిజిస్ట్రేషన్ల శాఖ మున్సిపల్ ఉన్నతాధికారులను కోరినట్లు తెలుస్తోంది. మున్సిపల్ కమి షనర్ల నుంచి లేఖలు రావడం ప్రారంభం కాగానే రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు ఈ లేఖను పురపాలక శాఖకు పంపగా, మొన్నటివరకు ఎన్నికల హడావుడిలోనే ఉన్న మున్సిపల్ అధికారులు దీనిపై ఇంకా స్పష్టతనివ్వలేదు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 250 అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు మున్సిపల్ అధికారులు గుర్తించారు. ఈమేరకు ఆ వివరాలు ఆయా మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల నోటీస్ బోర్డుల్లో డిస్‌ప్లే చేయడంతో పాటు అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు 15 మందితో యాక్షన్ టీం కూడా తయారు చేశారు. ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మున్సిపల్ వర్గాలు కార్యాచరణ చేపట్టాల్సి ఉంది.
కొత్త చట్టం ఏం చెబుతోందంటే!
కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం పట్టణాలు, నగరా ల్లో లేఅవుట్లు ఏర్పాటు చేసి ప్లాట్లు, ఫ్లాట్ల రూపంలో అమ్మాలంటే నిర్దేశిత ఫార్మాట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. తాత్కాలిక లేఅవుట్ ప్లాన్‌కు మున్సిపల్ అధికారులు 21 రోజుల్లోగా అనుమతిస్తారు. డీటీసీపీ, హెచ్‌ఎండీఏ లాంటి ప్రాధికార సంస్థలు అనుమతించిన లేఅవుట్లనే రిజిస్ట్రేషన్ అధికారు లు రిజిస్టర్ చేయాలి. ఈ విషయంలోనే మున్సిపల్ కమిషనర్ల పేరిట రిజిస్ట్రేషన్ల శాఖకు లేఅవుట్ల రిజిస్ట్రేషన్లపై లేఖలు వెళ్తున్నాయి. మున్సిపల్ అధికారుల నుంచి వెళ్తున్న లేఖల విషయంలో గందరగోళం ఉందని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబు తున్నారు. కొన్ని మున్సిపాలిటీల నుంచి వస్తున్న ఇలాంటి లేఖలతో పాటు ఏ సర్వే నంబర్‌లో లేఅవుట్లు రిజిస్ట్రేషన్ చేయొద్దో ఖచ్చితంగా ప్రస్తావిస్తున్నారని, కొన్నిచోట్ల లేఖ లురాసి వదిలేస్తున్నారని చెబుతున్నారు.
లేఖలు వచ్చిన మున్సిపాలిటీల్లో ఏ లేఅవుట్ అక్రమమో, ఏ లేఅవుట్ సక్రమమో తామెలా గుర్తిస్తామని అంటున్నారు. రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం ఏదైనా స్థలం, భూమి లేదా భవనాన్ని రిజిస్టర్ చేయడం వరకే తమ బాధ్యత అని చెబుతున్నారు. ఒకవేళ డెవలపర్లను లేఅవుట్ అనుమతులు చూపెట్టా లని అడిగినా నకిలీ అనుమతులు చూపెడితే వాటిని గుర్తించలేమంటున్నారు. ఏదేమైనా తమ మున్సిపాలిటీ/ కార్పొరేషన్ పరిధిలో అక్రమ లేఅవుట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ లేఖలు వచ్చిన అన్ని మున్సిపాలిటీల్లో 10 రోజుల నుంచే పూర్తిగా కొత్త లేఅవుట్లకు రిజిస్ట్రేషన్లు నిలిపివేశామని వారు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment