ఫ్లోరైడ్ పాపం ఆ.. పార్టీలదే | Munugode zone Fluoride troll | Sakshi
Sakshi News home page

ఫ్లోరైడ్ పాపం ఆ.. పార్టీలదే

Published Wed, Apr 1 2015 3:32 AM | Last Updated on Tue, Oct 2 2018 7:51 PM

Munugode zone Fluoride troll

 నల్లగొండ రూరల్ : ‘మునుగోడు మండలంలోని ఒక్క గ్రామంలో ఉన్న ఫ్లోరైడ్ భూతం జిల్లా అంతటా పాకింది. ఇప్పుడు జిల్లాలోని వెయ్యికి పైగా గ్రామాలకు ఫ్లోరైడ్ పాకిందంటే ఆ పాపం ఇప్పటివరకు తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన వారిదే. ఆ పార్టీలు చేసిన పాపం కారణంగానే జిల్లా ఫ్లోరైడ్ రక్కసి బారిన పడింది.’ అని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా ఆయన నల్లగొండ మండలంలోని అన్నెపర్తి తూర్పు చెరువు, కంచనపల్లి చెరువుల్లో పూడిక తీత  పనులను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో చెరువులను ఎండబెట్టి, పెద్ద పెద్ద ప్రాజెక్టులను ఆంధ్ర ప్రాంతంలో కట్టిన పార్టీల వైఖరి కారణంగానే నల్లగొండ జిల్లా నష్టపోయిందని అన్నారు.
 
  ఒకప్పుడు గొలుసుకట్టు చెరువులతో అలరారిన జిల్లా ఇప్పుడు తాగు, సాగునీరు లేక ఇబ్బందులు పడేందుకు వారి అసమర్థతే కారణమని ఆయన విమర్శించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవి, చెప్పనవి కూడా చేస్తూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టి చిత్తశుద్ధితో ముందుకు వెళుతుండడంతో ఆ పార్టీల నేతలకు మొహం చెల్లడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ‘గత ఎన్నికలలో మీకు కూడా కొందరు తెలిసో తెలియకో ఓట్లు వేశారు. ఓట్లు వేసినందుకు అయినా అభివృద్ధి జరిగే దగ్గరికి రావాలి కదా... కానీ రారు.
 
 అక్కడ కూర్చుని కుట్రలు చేస్తుంటారు. జిల్లా ఇట్లనే ఉండాలె. అభివృద్ధి కావద్దు. ప్రజలిట్లనే ఉండాలె. ఇదీ వాళ్ల ఏడుపు.’ అని ఆయన కాంగ్రెస్ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. వాళ్ల పీఠాలు కదులుతున్నాయని, ఉనికి లేకుండా పోతుందని తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు చేపడుతున్న కారణంగానే ప్రజలు పెద్ద ఎత్తున తమ వెంట వస్తున్నారని, వారికి అనుగుణంగా నాయకులు కూడా కలిసి వస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరెన్ని చేసినా తమ లక్ష్యం నెరవేరడంలో చిత్తశుద్ధితో ముందుకు వెళతామని అన్నారు.
 
 ప్రజలు భాగస్వాములు కావాలి
 కాకతీయుల కాలం నుంచి తెలంగాణ వ్యవసాయానికి తల మానికంగా నిలిచిన చెరువులను అభివృద్ధి చేసుకోవడంలో ప్రజలు భాగస్వాములు కావాలని మంత్రి జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. మన ఊర్లను మనమే బాగుచేసుకోవాలని, మన చెరువులను మనమే అభివృద్ధి చేసుకోవాలని ఆయన కో రారు. ఇందు కోసం ప్రజలు ఇదే చైతన్యం, స్ఫూర్తితో ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమంలో పాలుపంచుకోవాలని ఆయన కోరారు. ‘వర్షం చుక్క వచ్చింది వచ్చినట్టు ఆగాలె. ఆ నీళ్లే గ్రామంలో అన్ని అవసరాలు తీర్చాలె. తాగు, సాగు నీరే కాదు చెరువుల్లో బట్టలు ఉతకడం, పిల్లలు ఈతలు కొ ట్టడం మళ్లీ మనం చూడాలె. మన ఊర్లను మనం బాగు చేసుకోవాలె.’అని ఆయన ఆకాంక్షించారు. మిషన్‌కాకతీయ లో భాగంగా ఈ ఏడాది జిల్లాలో 900 చెరువులను పునరుద్ధరించే పనులు చేపడుతున్నామని, ఇందుకోసం రూ. 500-600 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నామని ఆయన వెల్లడించారు.
 
 పలుగు పట్టి.. మట్టి ఎత్తిపోసి
 అన్నెపర్తి తూర్పు చెరువు పూడికతీత పనులను ప్రారంభించిన సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి రైతు బిడ్డ అవతారమెత్తారు. నెత్తికి తలపాగా చుట్టి నడుం బిగించిన ఆయన పలుగు పట్టి మట్టిని తవ్వారు. పారతో మట్టిని ఎత్తి ట్రాక్టర్‌లో పోశారు. ఆ తర్వాత జేసీబీ ద్వారా తీయించిన మట్టితో ఉన్న ట్రాక్టర్‌ను స్వయంగా ఆయనే నడుపుకుంటూ వెళ్లారు. పార్లమెంటరీ కార్యదర్శి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్, ఎమ్మెల్సీ పూల రవీందర్‌లు కూడా మంత్రితో పాటు పూడిక తీత పనుల్లో తలపాగా చుట్టి మట్టిని ఎత్తి పోశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంచార్జి దుబ్బాక నర్సింహారెడ్డి, సర్పంచ్‌లు ఏదుల పుష్పలత, కాసర్ల విజయ, ఎంపీపీ దైద రజిత, జడ్పీటీసీ తుమ్మల రాధ,  ఎంపీటీసీలు పొగాకు అండాలు, గట్టయ్య, స్థానిక టీఆర్‌ఎస్ నేతలు బకరం వెంకన్న, ఏదుల అరుణాకర్‌రెడ్డి, శ్రీనాథ్‌గౌడ్, బొట్టు లింగయ్య, నారబోయిన భిక్షం, సురేందర్, మేకల వెంకన్న యాదవ్, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బోయపల్లి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు అభిమన్యు శ్రీనివాస్, దండెంపల్లి సత్తయ్య, మారగోని నవీన్‌గౌడ్, గుండ్లపల్లి సర్పంచ్ పనస శంకర్, టీఆర్‌ఎస్ నాయకులు మెరుగు గోపి, అబ్బగోని రమేశ్, విజయ్, రాజేశ్, సింగం రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ, కాంగ్రెస్‌లకు చెందిన పలువురు నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement