
జకాత్ నిధులు విద్య కోసం వెచ్చించండి: ఏకేఖాన్
హైదరాబాద్: రంజాన్ మాసంలో వచ్చే సుమారు వెయ్యి కోట్ల రూపాయల జకాత్ ధనాన్ని ముస్లింల విద్య, సంక్షేమం కోసం ఖర్చు చేస్తే నగరంలో పేదరికం అంతమౌతుందని మాజీ డీజీపీ, మైనార్టీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహదారులు అబ్దుల్ ఖయ్యూం ఖాన్ అభిప్రాయపడ్డారు. సోమవారం హైదరాబాద్ జకాత్ అండ్ చారిటెబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో బంజారహిల్స్‌లోని సంస్థ కార్యాలయంలో వార్షిక సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో 25 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా ట్రస్టు కార్యకలపాల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅథితిగా ఏకే ఖాన్ పాల్గొని మాట్లాడారు. జకాత్ నిధుల వల్ల నగరంలోని పేద ముస్లింల పరిస్థితులు బాగుపడతాయన్నారు. హైదరాబాద్ జకాత్ ట్రస్టు ద్వారా గత 25 ఏళ్లలో 11 వేల ముస్లిం కుటుంబాలు లబ్దిపొందాయని తెలిపారు. జకాత్ నిధులను సాముహికంగా జమ చేసి ముస్లిం విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఖర్చు చేయాలని పిలుపు నిచ్చారు. ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తి ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగంలో చేరితే అ కుటుంబం నుంచి పేదరికం దూరం అవుతుందన్నారు. ముస్లింలు ఇతర ఖర్చులను తగ్గించి పిల్లల విద్యపై డబ్బులు ఖర్చు చేయాలని కోరారు. జకాత్ ట్రస్టు విద్య కోసం చేస్తున్న కృషి అభినందనీయమని ఏకే ఖాన్ హర్షం వ్యక్తం చేశారు.