మిర్యాలగూడ నియోజకవర్గంలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ డేంజర్‌జోన్‌గా మారింది. కాల్వకట్టపై నుంచి ప్రమాదమని తెలిసినా ప్రయాణాలు సాగిస్తూనే ఉన్నారు.
మిర్యాలగూడ : మిర్యాలగూడ నియోజకవర్గంలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ డేంజర్‌జోన్‌గా మారింది. కాల్వకట్టపై నుంచి ప్రమాదమని తెలిసినా ప్రయాణాలు సాగిస్తూనే ఉన్నారు. నియోజకవర్గంలోనే సుమారుగా 30 కిలోమీటర్ల మేర సాగర్ ఎడమ కాల్వ ఉంది. సమీపఉంది. సమీప గ్రామాల ప్రజలు కాలువపై నుంచే ప్రయాణాలు చేస్తుంటారు. బ్రిడ్జిలు ఉన్న చోటనుంచి కాకుండా వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లడంతోపాటు దూర ప్రాంతాలకు వెళ్లేవారూ కాలువ కట్టపైనుంచే వెళ్తుంటారు. ఈ క్రమంలో వాహనాలు అదుపుతప్పి కాలువలో పడి మృతిచెందుతున్నారు. ఇలాంటి సంఘటనలు మిర్యాలగూడ నియోజకవర్గంలో సర్వసాధారణంగా జరుగుతున్నాయి. ఆదివా రం వేములపల్లి మండలంలోని రావులపెంటలో జరిగిన ప్రమాదం ప్రతి ఒక్కరినీ కలిచివేసింది.
కాలువకు అతి సమీపంలో గ్రామాలు..
ఎడమ కాలువకు అతి సమీపంలో పలు గ్రామాలు ఉన్నాయి. వేములపల్లి మండలంలోని అన్నపురెడ్డిగూడెం, వేములపల్లి, శెట్టిపాలెం, దొండవారిగూడెం, రావులపెంట, తడకమళ్ల గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల ప్రజలు నిత్యం వ్యవసాయ పనులకు కూడా ఎడమ కాల్వకు సమీపంలోకి వెళ్తుం టారు. కొంతమంది వ్యవసాయ పనుల కోసం వెళ్లి కాలువలో జారిపడడంతోపాటు కాల్వకట్టపై నుంచి ప్రయాణాలు చేస్తూ ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతిచెందుతున్నారు.
రెయిలింగ్ ఉంటే ప్రమాదాల నివారణ..
ఎడమ కాల్వ కట్ట వెంట రెయిలింగ్ ఉంటే ప్రమాదాలు నివారించే అవకాశం ఉంది. వేములపల్లి మండల కేంద్రంతోపాటు శెట్టిపాలెం, అన్నపురెడ్డిగూడెం, ఐలాపురం, రావులపెంట, తడకమళ్ల గ్రామాల వద్ద కాల్వపై వంతెనలు ఉన్నాయి. వంతెనల వద్ద కూడా రెయిలింగ్ సక్రమంగా లేకపోవడం వల్ల ప్ర మాదాలు సంభవిస్తున్నాయి. కాల్వ ఆధునికీకరణలో భాగంగా కట్ట వెడల్పు చేయడం వల్ల ద్విచక్ర, ఇతర వాహనాలు కూడా వెళ్తున్నాయి.
ఇటీవల జరిగిన ఘటనలు..
సెప్టెంబర్ 2వ తేదీన మిర్యాలగూడ పట్టణానికి చెందిన తేలుకుంట్ల నాగేశ్వర్‌రావు (52) అనే వ్యాపారి వేములపల్లి వద్ద ఎడమ కాల్వలో పడి గల్లంతయ్యాడు. ఎల్ - 21 లిఫ్ట్ వద్ద మృతదేహం లభించింది.
నవంబర్ 11వ తేదీన వేములపల్లి మండల కేంద్రం సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బొమ్మపాల సంతోష్ కాల్వలోకి దిగడంతో ప్రమాదవశాత్తు కాలుజారి గల్లంతయ్యాడు.
నవంబర్ 25వ తేదీన హైదరాబాద్‌కు చెందిన లారీడ్రైవర్ స్నానానికి వేములపల్లి వద్ద సాగర్ ఎడమ కాల్వలోకి దిగి కాలుజారి పడి గల్లంతయ్యాడు. 27న జాన్‌పహడ్ మేజర్ వద్ద అతని మృతదేహం లభించింది.
నవంబర్ 2వ తేదీన కాల్వలో గల్లంతైన ముగ్గురు వ్యక్తులను స్థానికులు గమనించి కాపాడారు.
డిసెంబర్ 1వ తేదీన వృద్ధురాలు కాల్వలో పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా స్థానికులు కాపాడారు.
ఆదివారం వేములపల్లి మండలంలోని రావులపెంట వద్ద కాల్వలో ఆటో పల్టీ కొట్టిన సంఘటనలో ముగ్గురు మృతిచెందారు. అదే విధంగా వేములపల్లి మండల కేంద్రం సమీపంలోని కాల్వలో శ్రీకాంత్ అనే విద్యార్థి గల్లంతయ్యాడు.