ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల గుండా పారుతూ లక్షల ఎకరాలకు సాగునీరందిస్తోన్న నాగార్జునసాగర్ ఎడమకాల్వ ప్రమాదాలకు నిలయంగా మారింది. ఎక్కడికక్కడ రెయిలింగ్‌లు విరిగిపోవడం, రక్షణ గోడలు లేక ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. అదే విధంగా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, కొందరి అవగాహనా రాహిత్యంతో కాలువలోకి దిగుతూ నీటి ఉధృతికి గల్లంతవుతున్నారు. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే ఈ నాలుగు నియోజకవర్గాల పరిధిలో పదిమంది జలసమాధి కావడం ఆందోళన కలిగిస్తోంది.
సాక్షి, మిర్యాలగూడ : నాగార్జునసాగర్ ఎడమ కాలువ మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు చోట్ల ప్రమాదకరంగా ఉంది. కాలువపై బ్రిడ్జిలు ఉన్నచోట రెయిలింగ్, రక్షణ గోడలు లేకపోవడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. నియోజకవర్గంలో ఎక్కువ రద్దీగా ఉండే అద్దంకి – నార్కట్‌పల్లి రహదారిపై వేములపల్లి మండల కేంద్రం సమీపంలో కాలువ ప్రమాదకరంగా ఉంది. అదే విధంగా భీమారం– సూర్యాపేట రహదారిపై శెట్టిపాలెం సమీపంలో ఉన్న బ్రిడ్జి మరింత ప్రమాదకరంగా ఉంది. ఎదురుగా ఒక వాహనం వస్తుంటే మరో వాహనం పక్కకు నిలుపుకోవల్సిన పరిస్థితి ఉంది. నిత్యం రద్దీగా ఉండే భీమారం – సూర్యాపేట రోడ్డుపై ఉన్న వంతెన వెడల్పు చేయాలని ఎంతో కాలంగా డిమాండ్ ఉన్నా అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. అంతే కాకుండా కాలువ కట్టపైనుంచి వెళ్లేవారు మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణాలు సాగిస్తుంటారు. వ్యవసాయ పనులకు వెళ్లే వారు కాలువకట్టపై వెళ్లక తప్పడం లేదు. ఎడమ కాలువకు యూటీలు ఉన్న చోట రెయిలింగ్‌లు విరిగిపోవడం వల్ల పశువులు, వాహనాలు పడుతున్నాయి. వేములపల్లి మండల కేంద్రానికి సమీపంలో ఉన్న అన్నపురెడ్డిగూడెం వెళ్లే వైపు కాలువ కట్టపైన, తిమ్మారెడ్డిగూడెం వెళ్లే వైపు కాలువ కట్టపైన యూటీ వల్ల కాలువ నిర్మాణ సమయంలో రెయిలింగ్ ఉండగా అవి ప్రస్తుతం విరిగిపోయాయి. కానీ కొత్తగా రెయిలింగ్‌లు కూడా నిర్మించడం లేదు.
ఆదమరిస్తే అంతే సంగతులు
కోదాడ: నియోజకవర్గ పరిధిలో సాగర్ కాలువ వద్ద మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. కనీస రక్షణ చర్యలు లేకపోవడం, అవగాహనలోపం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు అంటున్నారు. నియోజకవర్గంలోని చిలుకూరు, మునగాల, నడిగూడెం మండలాల పరిధిలో ఉన్న సాగర్ కాలువపై రెండు చోట్ల అత్యంత ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. గడిచిన కొన్ని నెలల్లో మునగాల హెడ్‌రెగ్యులేటరీ వద్ద 15 మంది ప్రాణాలు కోల్పోగా నడిగూడెం మం డలం చాకిరాల వద్ద ఈ నెల 18న ఆరుగురు యువకులు ప్రాణాలను పోగొట్టుకున్నారు.
హెచ్చరిక బోర్డులు కూడా కరువు...
65వ నంబర్ జాతీయరహదారిపై మునగాల సమీపంలో సాగర్ ఎడమకాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ రహదారిపై వెళ్లేవారు ఈత కోసం సరదాగా కాలువలోకి దిగి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. పాలేరు వైపు వెళ్లే కాలువలో సుడిగుండాలు ఉంటాయి. దీనివల్ల ఈత వచ్చినçప్పటికీ కొత్త వారు ఇక్కడ నీటిలోకి దిగితే ప్రమాదం తప్పదు. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు ఇక్కడ ఇప్పటి వరకు 15 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. గత సంవత్సరం కార్తీకమాసంలో కారు కాలువలోకి దూసుకెళ్లి ఇద్దరు మృతిచెందారు. కార్తీకమాసం, అయ్యప్పల దీక్షా సమయంలో ఇక్కడ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక్కడ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని స్థానికులు పలుమార్లు విజ్ఞప్తులు చేసినా ఎన్‌ఎస్‌పీ అధికారులు, పోలీసులు, పంచాయితీ అధికారులు గానీ పట్టించుకున్న దాఖలాలులేవు.
చాకిరాల వద్ద అతి ప్రమాదకరం...
నడిగూడెం మండలం చాకిరాల వద్ద ఉన్న సాగర్‌కాలువ అతిప్రమాదకరంగా ఉంది. ఇక్కడకు కొత్తవారు వస్తే ప్రమాదానికి గురవడం ఖా యం. మండలం మధ్య నుంచి ఈ కాలువ వెళుతోంది. మండల పరిధిలోని ఆరుగ్రామాల వారు ప్రతి రోజు ఈ కాలువ దాటి ప్రయాణిం చాలి. కొత్తవారు మాత్రం ఏమాత్రం అదమరిచి నా ప్రాణాలు పోతున్నాయి. ఇక్కడ రక్షణగొడ కట్టాలని స్థానికులు కోరుతున్నారు.
రక్షణ గోడలు, ప్రమాద సూచిక బోర్డులేవీ..?
చింతలపాలెం (హుజూర్‌నగర్) : సాగర్ ఎడమ కాల్వ గరిడేపల్లి మండలంలోని మర్రికుంట నుంచి వెలిదండ వరకు ప్రవహిస్తోంది. అయితే ఈ కాల్వపై ప్రయాణించే వారికి అవగాహన లేకపోవడం, ప్రమాద సూచికలు లేక నీటిలో గలంతై ప్రాణాలు కొల్పోతున్నారు. పొనుగోడు సమీపంలో మెయిన్ కెనాల్‌కు రిజర్వాయర్ ఉండడంతో చాలా మంది ఈ కాల్వలో ప్రమాదవశాత్తు జారిపడి కొందరు, ఈత కొడుతూ మరికొందరు ప్రాణాలు కొల్పోతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 15న ధరావత్ వీరన్న, పద్మల కుమార్తె శిరీష (8) కాల్వవద్ద స్నేహితులతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కాల్వలో జారిపడి మృతిచెందింది.
రక్షణ చర్యలు శూన్యం..
హాలియా (నాగార్జునసాగర్) : నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని హాలియా, 14వ మైలురాయి, నిడమనూరు మండలంలోని వేంపాడు, ముప్పారం ప్రాం తాల వద్ద ఉన్న సాగర్ ఎడమ కాల్వ ప్ర మాదాలకు నిలయంగా మారింది. హాలి యా పట్టణానికి సమీపంలో సాగర్ ఎడమ కాల్వ ఉంది. దీంతో స్నానం చేసేందుకు, దుస్తులు ఉతికేందుకు, చేపలు పట్టేందుకు వెళ్తున్న వారు ప్రమాదవశాత్తు కాలు జారీ కాల్వలో కొట్టుకుపోతున్నారు. ఎడమ కాల్వకు సమీపంలోనే ఆంజనేయస్వామి, పోతులూరి వీరబ్రహేంద్రస్వామి, శ్రీసీతారామచంద్రస్వామి ఆలయాలు ఉన్నాయి. ఆయా ఆలయాలకు వచ్చే భక్తులతో పాటు వివిధ మాలధారణలు వేసుకున్న స్వాములు కూడా ఎడమ కాల్వలో స్నానాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ప్రమాదశాత్తు కాలు జారీ గల్లంతవుతున్నారు. అయితే ప్రమాదాల నివారణకు అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కాల్వ వెంట రక్షణ గోడలు నిర్మించాలి. కాల్వ వెంట నిత్యం ఎన్‌ఎస్పీ, పోలీస్ సిబ్బంది గస్తీ నిర్వహిస్తే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది.
నెల వ్యవధిలో చోటు చేసుకున్న ప్రమాదాలు
⇔ అక్టోబర్ 6న హాలియా పట్టణంలో పెయింటర్‌గా పనిచేస్తున్న పెద్దవూర మండలం శిరసనగండ్ల గ్రామానికి దోరేపల్లి వినయ్‌కుమార్(25) ఎడమ కాల్వ వద్దకు బహిర్భూమికి వెళ్లాడు. శుభ్రం చేసుకునేందుకు కాల్వలోకి దిగే క్రమంలో కాలు జారి మృత్యువాతపడ్డాడు.
⇔ అక్టోబర్ 12న తూర్పుగోదావరి జిల్లా అమలాపురం గ్రామానికి చెందిన కుచ్చర్లపాటి కుమార వెంకటసాయి వర్మ(21) నిడమనూరు మండలంలోని వేపాండు వద్ద ఎడమ కాల్వ వద్దకు బహిర్భూమికి వెళ్లాడు. కాల్వలోకి దిగే క్రమంలో కాలుజారి గల్లంతై మృతిచెందాడు.
⇔ అక్టోబర్ 20న హాలియా పట్టణానికి చెందిన కామిశెట్టి రాంబాబు(30) నీరు పెట్టేందుకు తండ్రి వెంకటేశ్వర్లు కలిసి పొలం వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో రాంబాబు బహిర్భూమి కోసం ఎడమ కాల్వ వద్ద వెళ్లి అందులోకి దిగే క్రమంలో కాలుజారి ప్రాణాలు కోల్పోయాడు.
⇔ 29న వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన సకినాల అంజయ్య (24) సమీపంలోని కాలువ వద్దకు బహిర్భూమికి వెళ్లాడు. కాలు జారీ ఎడమ కాలువలో పడిపోయాడు. సమీపంలో ఉన్న వారు రక్షించడానికి ప్రయత్నించినా ఫలితం లేక గల్లంతయ్యాడు.
⇔ హైదరాబాద్‌కు చెందిన జమ్మికుంట్ల నాగేశ్వరరావు (36), వంగపల్లి పవన్ కుమార్ (23), బోనికట్ల సంతోష్ (24), అబ్దుల్ అజీద్ (34), జాన్సన్ జార్జి, తిప్పని రాజేష్ (29) ఈ నెల 18న స్కార్పియో వాహనంలో నడిగూడెం మండలం చాకిరాల గ్రామంలో స్నేహితుడి వివాహానికి హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో రాత్రి 7:45 గంటలకు ఆ వాహనం అదుపుతప్పి 125 కిలోమీటరు వద్ద సాగర్ కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారందరూ మృతిచెందారు.
రెయిలింగ్ ఏర్పాటు చేయాలి
సాగర్ ఎడమకాల్వపై యూటీలు ఉన్న చోట బ్రిడ్జిల వద్ద రెయిలింగ్‌లను విరిగి పోవడంతో ప్ర మాదాలు చోటుచేసుకుంటున్నాయి. సమీప గ్రామాల రైతులు ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలపై కాలువ కట్టపై నిత్యం ప్రయాణించాల్సి ఉంటుంది. బ్రిడ్జి సమీపానికి రాగానే రక్షణ గోడ లేకపోవడంతో ఎడమకాల్వలో దూ సుకెళ్తామని భయాందోళన కు గురి కావాల్సి వస్తోంది. ఒక్కోసారి కాల్వలోకి కూడా దూసుకెళ్లిన ఘటనలు ఉన్నాయి.
– ప్రసాద్‌రెడ్డి, తిమ్మారెడ్డిగూడెం, వేములపల్లి
రక్షణ గోడలు నిర్మించాలి
హాలియా సమీపంలో ఉన్న ఎడమ కాల్వలో ప్రమాదవశాత్తు కాలు జారి గల్లంతవుతున్నారు. ఎడమ కాల్వకు సమీపంలో పలు ఆలయాలు ఉండడంతో భక్తులు తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎడమ కాల్వలో స్నానాలు చేసేందుకు కొందరు, దుస్తులు ఉతికేందుకు వెళ్లే వారు తరుచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రమాదాల నివారణకు అధికారులు ఎడమ కాల్వ వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు కాల్వకు ఇరువైపులా రక్షణ గోడల ఏర్పాటు చేయాలి.
–ఆకారపు నరేష్‌కుమార్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు, హాలియా
ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలి
సాగర్ ప్రధాన ఎడ మ కాల్వ వెంట ప్రమాద సూచికలు లేవు. దీంతో చాలామంది కాల్వలో పడిన మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో మర్రికుంట వద్ద చిన్నారి శిరీష అవగాహన లేక కాలు జారీ కొట్టుకుని పోయి చనిపోయింది. ఈతకు వచ్చిన వారు కూడా వరద ప్రవాహాన్ని అంచనా వేయలేక ప్రాణాలు పొగొట్టుకున్నారు. కాల్వ వెంట ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి.
–రామినేని అశోక్, మర్రికుంట
Comments
Please login to add a commentAdd a comment