
జలధారకు 47ఏళ్లు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వరప్రధాయని అయిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేసి నేటికి 47ఏళ్లు నిండాయి. బహుళార్థక ప్రాజెక్టు ద్వారా
నాగార్జునసాగర్ :తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వరప్రధాయని అయిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేసి నేటికి 47ఏళ్లు నిండాయి. బహుళార్థక ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేసి అర్ధశతాబ్దానికి చేరువవుతున్నా నేటికీ పూర్తిస్థాయి లక్ష్యం నెరవేరలేదు. కాగా ఈ ఆధునిక దేవాలయానికి 1955 డిసెంబర్ 10న జవహార్‌లాల్‌నెహ్రూ శంకుస్థాపన చేశారు. పన్నెడేళ్ల అనంతరం అంటే 1967 ఆగస్టు 4న అప్పటి ప్రధాని, నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేశారు.
నాటి నుంచి నేటి వరకు నల్లగొండ, ఖమ్మం, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీరు, ప్రజలకు తాగునీటిని అందిస్తూ జీవనాధారమైంది. ఇదిలా ఉండగా కుడికాల్వ(జవహర్ కెనాల్) పరిధిలో 11.18లక్షల ఎకరాలు, ఎడమ కాల్వ(లాల్‌బహుదూర్ కెనాల్) పరిధిలో 10.39 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగినా 18లక్షల ఎకరాలలోపే సాగునీరు అందుతుంది. కాగా నాగార్జునసాగర్ నిర్మాణానికి ఆనాటి అంచనావ్యయం రూ.70కోట్లు కాగా ఆ తర్వాత మరమ్మతుల కోసం వేలాది కోట్లు ఖర్చు చేశారు. అయినా నేటికీ కాల్వల చివరి భూములకు నీరందని పరిస్థితి. ప్రపంచ బ్యాంక్ నిధులు రూ.4,444.44 కోట్లతో చేపట్టిన సాగర్ ఆధునికీకరణ పనులు 2014 వరకే పూర్తి కావాల్సి ఉండగా అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అలసత్వంతో ఆలస్యం అవుతుండడంతో 2016 వరకు పొడిగించారు.