
ఆశలపల్లకిలో..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : శాసనమండలి సభ్యుడిగా జిల్లానుంచి ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. కొంచెం అటుఇటుగా లేదంటే ఒకేసారి జరుగుతాయని భావిస్తున్న పట్టభద్రులు, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల నుంచి పోటీచేసేందుకు గాను ప్రధాన పార్టీల నుంచి ఆశావహుల సంఖ్య ఎక్కువవుతోంది. స్థానిక సంస్థల కోటాలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురి పేర్లు తెరపైకి రాగా, ఇప్పుడు కొత్తగా వలిగొండ మండలానికి చెందిన కుంభం అనిల్‌రెడ్డి పేరు వచ్చింది. అదే విధంగా టీఆర్‌ఎస్ నుంచి స్థానిక సంస్థల కోటాలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌ను బరిలోకి దింపుతారని భావిస్తుండగా, ఇప్పుడు అనూహ్యంగా మంత్రి జగదీశ్‌రెడ్డి సన్నిహితుడు నంద్యాల దయాకర్‌రెడ్డి పేరు వినిపిస్తోంది.
అదే జరిగితే నేతి విద్యాసాగర్‌ను గవర్నర్‌కోటాలో లేదంటే ఎమ్మెల్యేల కోటాలో మండలికి పంపే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఖమ్మం, వరంగల్, నల్లగొండ గ్రాడ్యుయేట్స్ స్థానం నుంచి టీఆర్‌ఎస్ పక్షాన బండా నరేందర్‌రెడ్డి పేరు వినిపిస్తున్నా, ఇంకా ఖరారు చేయకపోవడం చర్చనీయాంశం అవుతోంది. ఇక్కడ కూడా చాడ కిషన్‌రెడ్డి, యాదవరెడ్డి తదితరులు లైన్లో ఉండడంతో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో టీఆర్‌ఎస్ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటు స్థానిక సంస్థలు, అటు పట్టభద్రుల స్థానం నుంచి అయినా అవకాశం ఇస్తే పోటీ చేస్తానని చాడ కిషన్‌రెడ్డి అధిష్టానాన్ని కోరుతున్నారు.
మాకంటే మాకు...
స్థానిక సంస్థల కోటాలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసే వారి జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. ఈ స్థానంనుంచి మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బరిలో ఉంటారని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే, తమకు కూడా అవకాశం ఇవ్వాలని కొందరు కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే పార్టీ నాయకత్వాన్ని అడుగుతున్నారు. ముఖ్యంగా డీసీసీ మాజీ అధ్యక్షుడు సుంకరిమల్లేశ్‌గౌడ్, ఏఐసీసీ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి, మరో నేత గర్దాసు బాలయ్యలు కూడా తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మల్లేశ్ గౌడ్ అయితే ఏకంగా పార్టీ ప్రజాప్రతినిధులకు ఇప్పటికే బహిరంగ లేఖలు రాస్తున్నారు. తాను పార్టీకి చేసిన సేవల గురించి, తనకు అవకాశం ఇవ్వాల్సిన అనివార్యత గురించి ఆయన బ్రో చర్లు కొట్టించి మరీ తిరుగుతున్నారు.
త్వరలోనే తనకు టికెట్ ఇవ్వాలని కోరుతూ సమావేశం ఏర్పాటు చేసే ఆలోచనలో ఆయన ఉన్నారు. ఇక, గూడూరు, గర్దాసులు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాత్రం అందరికంటే ముందు ఈ సీటు విషయంలో బహిరంగంగా మాట్లాడారు. పార్టీ కోసం పనిచేసిన తనకు అవకాశం ఇస్తే అందరికీ అందుబాటులో ఉంటానని ఆయన చెబుతున్నారు. గెలుపుగుర్రం కోటాలో తనకు సీటు ఇవ్వాలని ఆయన అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ మేరకు ఈ నలుగురు నేతలు శనివారం యాదగిరిగుట్టలో జరిగిన డీసీసీ ముఖ్యనేతల సమావేశంలోనూ పార్టీ నా యకుల ముందు ప్రతిపాదనలుంచారు. ఇదిలాఉంటే, కాంగ్రెస్ నుంచి కొత్తగా కుంభం అనిల్‌రెడ్డి పేరు వచ్చింది. వలిగొండ మండలానికి చెందిన ఈయన వ్యాపార రంగంలో ఉన్నారు. ఈయన బంధువు రమణారెడ్డి గతంలో రామన్నపేట సమితి అధ్యక్షుడిగా పనిచేశారు.
తమ కుటుంబం ఐదు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉందని, తాను గతంలోనే రామన్నపేట, భువనగిరి అసెంబ్లీ స్థానాలు అడిగిగానని, అప్పుడు అవకాశం ఇవ్వలేదు కనుక ఇప్పుడు ఇవ్వాలని ఆయన అడుగుతున్నారు. అనిల్‌రెడ్డికి తెరవెనుక జిల్లా కాంగ్రెస్‌లోని కొందరు ముఖ్య నాయకులు సహకరిస్తున్నట్టు సమాచారం.
కోటా మారినట్టేనా?
ఇక, టీఆర్‌ఎస్ విషయానికి వస్తే ప్రస్తుతం స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న నేతి విద్యాసాగర్‌నే బరిలో ఉంచుతారని భావించారు. కానీ, తాజాగా మంత్రి జగదీష్‌రెడ్డి సన్నిహితుడు నంద్యాల దయాకర్‌రెడ్డి పేరు వినిపిస్తోంది. న్యాయవాద వృత్తిలో ఉన్న ఆయన గతంలో పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీ టికెట్ ఆశించారు. గత ఎన్నికల నాటినుంచి టీఆర్‌ఎస్‌కు, మంత్రి జగదీష్‌రెడ్డికి దగ్గరగా ఉంటున్న ఆయనకు అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్ అధిష్టానం వద్దకు ప్రతిపాదనలు వెళ్లినట్టు సమాచారం. మంత్రి ఆశీస్సులతో ఆయనకు గనుక అవకాశం వస్తే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న నేతి విద్యాసాగర్ కోటా మార్చక తప్పని పరిస్థితి. ఆయనను గవర్నర్ లేదా ఎమ్మెల్యేల కోటాలో మండలికి పంపుతారని టీఆర్‌ఎస్ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.
ఇక, పట్టభద్రుల విషయానికి వస్తే బీజేపీ ఇప్పటికే ఎర్రబెల్లి రామ్మోహన్‌రావును తమ అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ తరఫున నేరుగా అభ్యర్థులను బరిలోకి దింపే ఆలోచన లేకున్నా... పోటీలో ఉన్నవారికి మద్దతిచ్చే అంశాన్ని పార్టీ నేతలు పరిశీలిస్తున్నారు. ఇక, టీఆర్‌ఎస్ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డికి ఖరారయినట్టేనని ప్రచారం జరుగుతున్నా ఆయనకు ఇంకా గ్రీన్‌సిగ్నల్ రాకపోవడం గమనార్హం. మరోవైపు పార్టీ నేతలు చాడ కిషన్‌రెడ్డి, యాదవరెడ్డిలు కూడా గట్టిగానే లైన్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని గులాబీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. అటు కాంగ్రెస్, ఇటు టీఆర్‌ఎస్‌ల నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎవరు ఖరారవుతారనేది రెండు పార్టీల శ్రేణులను ఉత్కంఠకు గురిచేస్తున్నాయి.