
ఏకగ్రీవానికి 'ప్లానింగ్'
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా ప్రణాళిక కమిటీ (డీపీసీ) సభ్యుల ఎన్నిక ప్రక్రియ ఏకగ్రీవం కానుంది. ఈ మేరకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ఓ అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తం 24 మంది సభ్యుల ఎన్నిక కోసం శుక్రవారం నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. అయితే ఒప్పందం కుదిరిందని, దాదాపు ఎన్నిక ఏకగ్రీవమేనని రెండు పార్టీల వర్గాలంటున్నాయి. డీపీసీలో ఉండాల్సిన 20 మంది జెడ్పీటీసీసభ్యుల్లో ఆరుగురు లేదా ఏడుగురిని టీఆర్‌ఎస్ నుంచి తీసుకునేందుకు కాంగ్రెస్ అంగీకరించిందని సమాచారం. ఈ వ్యవహారంలో సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి చక్రం తిప్పగా, జిల్లాకు చెందిన మంత్రి జగదీష్‌రెడ్డిని కలిసి జెడ్పీచైర్మన్ బాలునాయక్, వైస్‌చైర్మన్ కర్నాటి లింగారెడ్డిలు చర్చలు జరిపారు. దీంతో ఎన్నిక ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది.
ముగ్గురికి ఒకటి చొప్పున..
జిల్లాలో మొత్తం 59 మంది జెడ్పీటీసీ సభ్యులుండగా, డీపీసీలో 20 మందికి చోటు దక్కనుంది. అంటే ప్రతి ముగ్గురు జెడ్పీటీసీ సభ్యుల్లో ఒకరికి అవకాశం వస్తుంది. ఇందులోనూ రిజర్వేషన్ల పద్ధతి ఉన్నందున అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం దక్కనుంది. ప్రతి ముగ్గురికి ఒకరు చొప్పున టీఆర్‌ఎస్‌కున్న 13 మంది జెడ్పీటీసీలకుగాను ఐదుగురికి అవకాశం రానుంది. అయితే, కొన్ని సమీకరణల నేపథ్యంలో తమకు మరో రెండుస్థానాలు ఎక్కువ కావాలని టీఆర్‌ఎస్ ప్రతిపాదించడంతో కాంగ్రెస్ నేతలు కూడా ఇందుకు అం గీకరించినట్టు సమాచారం. మంత్రి, జెడ్పీచైర్మన్, వైస్‌చైర్మన్ బుధవారం హైదరాబాద్‌లో భేటీ అయి దీనిపై చర్చించారని తెలుస్తోంది. అయితే, రిజర్వేషన్లతో కొన్ని సమస్యలు వస్తున్నాయని, రిజర్వేషన్ల వారీగా పంపకాలు చేసుకోవాలంటే ఒకే నియోజకవర్గం నుంచి ఇద్దరు. ముగ్గురికి కూడా డీపీసీలో స్థానం ఇవ్వాల్సి వస్తుందనే చర్చ భేటీలో వచ్చినా... పార్టీల వారీ విభజన ఉంటుంది కనుక ఇబ్బంది లేదనే అభిప్రాయానికి నేతలు వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగే నామినేషన్ల ప్రక్రియలో 20 మంది జెడ్పీటీసీ సభ్యులు, నలుగురు మున్సిపల్ కౌన్సిలర్లు మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది. కౌన్సిలర్ల కోటాలో కూడా టీఆర్‌ఎస్‌కు ఒకస్థానం లభించవచ్చని తెలుస్తోంది.
నియోజకవర్గానికి ఒకటి..కాంగ్రెస్ ప్లాన్
జెడ్పీలో బలమున్నా, రాష్ట్రంలో అధికారంలో లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ కూడా డీపీసీ వ్యవహారంలో రాజీ ధోరణితోనే వెళ్లాలని నిర్ణయించింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో ముగ్గురు సీనియర్లు, రాష్ట్రస్థాయి నేతలు, అయినా అధికారపక్షంతో గిల్లికజ్జాలు పెట్టుకోవడం ఎందుకులే అనే ఆలోచనతో డీపీసీ ఎన్నిక ఏకగ్రీవమయ్యేందుకు కాంగ్రెస్ సహకరిస్తోందనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. అయితే, తమకు లభించే సీట్లలో మాత్రం ప్రతి నియోజకవర్గానికి అవకాశం కల్పించాలని, 12 నియోజకవర్గాల నుంచి 12 మందికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు యోచిస్తున్నట్టు సమాచారం. ‘ఈ డీపీసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన పనిలేదు. భవిష్యత్ అభివృద్ధి, నిధుల మంజూరు లాంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని అధికార పార్టీ టీఆర్‌ఎస్‌తో సఖ్యతతో వెళితేనే మంచిది. జెడ్పీలో తగినంత బలమున్నా ప్రయోగాలకు వెళ్లకుండా ఉండడమే మంచిది’. అని ఓ సీనియర్ కాంగ్రెస్‌నేత వ్యాఖ్యానించడం గమనార్హం.