
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ చేసేదే ప్రజలకు చెప్తారని, మోదీ, కేసీఆర్ లాగా అబద్ధాలతో ఆయన మోసం చేయరని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి స్పష్టం చేశారు. అలవికాని హామీలిచ్చి ప్రజల్ని మోసం చేయడం కాంగ్రెస్ తత్వం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలంటే ప్రజా సమస్యల్ని చర్చించి వాటికి ప్రత్యా మ్నాయ పరిష్కారాలను చూపే వేదికన్నారు. టీఆర్‌ఎస్‌కు మాత్రం అధికారం దక్కించుకోవడమే లక్ష్యమని, కొడుకును తెలంగాణకు సీఎంని చేసి, తాను ప్రధాని పదవి చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారని ఆయన ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
దేశం లోని అన్ని సమస్యలపై రాహుల్ గాంధీ రాజనీతిజ్ఞత తో మాట్లాడుతుంటే.. గత లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేక మోదీ మౌనంగా కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు. జహీరాబాద్‌లో సోమవారం జరిగే బహిరంగసభలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలను రాహుల్ వెల్లడిస్తార ని తెలిపారు. కనీస ఆదాయ హామీ ప్రకటన ద్వారా తెలంగాణలోని 50 లక్షల మంది లబ్ధిపొందుతారని, వ్యవసాయ రంగంలో మార్పులకు సంబంధించిన అంశాన్ని వెల్లడిస్తారని చెప్పారు.
పార్టీకి నష్టం లేదు..
మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కాంగ్రెస్‌పై చేసిన విమర్శలను నారాయణరెడ్డి ఖండించారు. ఆయన జీవిత కాలంలో ఒక్క ఎన్నికలో గెలవకపోయినా, పొంగులేటికి పార్టీ ఎన్నో అవకాశాలిచ్చిందన్నారు. మార్చి 29 వరకు ఎమ్మెల్సీ పదవిలో ఉన్న ఆయన పదవీకాలం ముగిసిన రెండు రోజులకే పార్టీ కి రాజీనామా చేస్తూ తమ పార్టీ నాయకత్వంపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. కొందరు అవకాశవాదులు పార్టీని వీడి వెళ్లినంత మాత్రాన కాంగ్రెస్‌కు ఎలాంటి నష్టం లేదని పేర్కొన్నారు.