
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కువ మరణాలు ఎయిడ్స్ కారణంగానే జరుగుతున్నాయి. వ్యాధి నియంత్రణ, రోగులకు ఉపశమనమే లక్ష్యంగా చికిత్సా విధానంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. ప్రస్తుత పరిస్థితులకు తగినట్లుగా ఈ కొత్త వైద్యం అందించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాయి. ఈ మేరకు ఔషధాలు, చికిత్స వనరులను సైతం అందిస్తున్నాయి. అయితే ఎయిడ్స్ నివారణపై రాష్ట్ర యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మన రాష్ట్రంలో మాత్రం కొత్త చికిత్సా విధానం అమలు కావడంలేదు. ఫలితంగా రోగులకు పాట్లు తప్పడం లేదు. çహ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్(హెచ్‌ఐవీ), అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ (ఎయిడ్స్) రోగులకు వైద్యం అందించే విషయంలో సీడీ4 కణాల సంఖ్యే కీలకం.
రోగ నిరోధకతను సూచించే సీడీ4 కణాల సంఖ్య 350 కంటే తక్కువకు పడిపోయినప్పుడే హెచ్‌ఐవీ బాధితులకు యాంటీ రిట్రోవైరల్ థెరపీ(ఏఆర్‌టీ) అందిస్తున్నారు. సీడీ4 కణాల సంఖ్య 350 కంటే తగ్గినప్పుడు రోగ నిరోధక శక్తి ఎక్కువగా కోల్పోతారు. దీంతో ఎయిడ్స్ రోగులు క్షయ, క్యాన్సర్ వ్యాధుల బారిన పడతారు. ఇలాంటి వాటిని నియంత్రించేందుకు... హెచ్‌ఐవీని గుర్తించగానే చికిత్స అందిస్తే మంచి ఫలితాలు ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. దీనిపై కొత్త విధానాన్ని అమలు చేయాలని ఈ ఏడాది జూన్‌లో కేంద్రం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.
కొత్త విధానం అమలైతే ఎయిడ్స్ బాధితులు ఇతర ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (టీ సాక్స్) మాత్రం ఈ ఆదేశాలను పట్టించుకోవడం లేదు. సీడీ4 కణాల సంఖ్యతో నిమిత్తం లేకుండా ఎయిడ్స్ రోగులు అందరికీ మందులు అందించాలంటే కచ్చితమైన సంఖ్యను జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ(న్యాకో)కు ఇవ్వాలి. టీ సాక్స్ ఇంత వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయలేదు. దీంతో రాష్ట్రంలోని మొత్తం రోగులకు అవసరమైన ఉచిత మందుల సరఫరా సైతం జరగడంలేదు.
అంతర్జాతీయంగా, జాతీయంగా ఎయిడ్స్ కేసులు తగ్గుతుంటే తెలంగాణలో పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఏటా కనీసం వెయ్యి మందిని ఎయిడ్స్ మహమ్మారి తీసుకుం టోంది. వ్యాధిపై అవగాహన పెరుగుతున్నా చికిత్స, మందులు మాత్రం అందడంలేదు. దీంతో కొత్తగా ఎయిడ్స్ సోకేవారు రాష్ట్రంలో పెరుగుతున్నారు. మూడేళ్లుగా రాష్ట్రంలో ప్రతి నెల సగటున వెయ్యి కేసులు నమోదవుతున్నాయి.
ప్రస్తుత ఏడాదిలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రాష్ట్రంలో 5,789 మందికి ఎయిడ్స్ సోకినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1,80,937 మంది ఎయిడ్స్ రోగులు ఉన్నారు. వీరిలో 71,651 మంది మాత్రమే ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో చికిత్స పొందుతున్నారు. 37,732 మంది క్రమపద్ధతిలో మందులు తీసుకోవడంలేదు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ(న్యాకో) ప్రతి రోగికి ఉచితంగా మందులు సరఫరా చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ(టీసాక్స్) సంస్థ ఆధ్వర్యంలో ఈ మందుల పంపిణీ జరుగుతుంది. క్రమపద్ధతి(రెగ్యులర్)లో మందులు తీసుకోని వారి విషయంలో టీ సాక్స్ ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు.
రాష్ట్రంలో ఎయిడ్స్ కేసులు...
ఏడాది కొత్త కేసులు
2014–15 13,420
2015–16 11,081
2016–17 11,403
2017–18 5,789
(2017 ఆగస్టు 31 వరకు)
జిల్లాల వారీగా ఎయిడ్స్ పరిస్థితి...
జిల్లా పేరు రోగులు మృతులు
ఆదిలాబాద్ 3,959 947
హైదరాబాద్ 59,586 6,494
కరీంనగర్ 20,832 4,850
ఖమ్మం 18,641 3,817
మహబూబ్‌నగర్ 14,846 1,834
మెదక్ 12,822 2,288
నల్లగొండ 17,268 2,494
నిజామాబాద్ 14,752 4,046
రంగారెడ్డి 3,842 1,085
వరంగల్ 14,369 3,439
(గణాంకాలు 2017 సెప్టెంబర్ వరకు)