సాక్షిప్రతినిధి, ఖమ్మం: నూతన కలెక్టరేట్‌ను రఘునాథపాలెం మండలం వీ.వెంకటాయపాలెం(వీవీ.పాలెం) సమీపంలో నిర్మించనున్న క్రమంలో భూసేకరణ ప్రక్రియ చకచకా సాగి, చివరి దశకు చేరింది. ఇక్కడ 26 ఎకరాల 16 కుంటల భూమిని 20 మంది రైతుల వద్ద నుంచి సేకరించనున్నారు. ఒక్కో ఎకరానికి రూ.కోటి చొప్పున చెల్లించనుండగా..
రైతులు సహకరించి తమ భూములను కలెక్టర్ కార్యాలయ సముదాయ నిర్మాణానికి ఇస్తామంటూ.. మంగళవారం అధికారుల సమక్షంలో అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు. దీంతో కలెక్టరేట్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణలో ఎదురైన అవాంతరాలు, ఆటంకాలు దాదాపు తొలగిపోయినట్లేనని అధికారులు భావిస్తున్నారు. భూముల నష్టపరిహార చెల్లింపుకు సంబంధించిన ఫైల్‌ను అధికారులు ఆఘమేఘాల మీద సిద్ధం చేశారు. భూములు ఇచ్చిన రైతులకు త్వరితగతిన పరిహారం చెల్లించేందుకు జిల్లా అధికారులు.. ప్రభుత్వానికి ప్రత్యేకంగా లేఖ రాసి నిధులు తెప్పించే పనిలో నిమగ్నమయ్యారు. రెండు, మూడు రోజుల్లో ఈ నిధులు వచ్చేలా.. కసరత్తు చేస్తున్నారు.
ఆఘమేఘాల మీద కసరత్తు..
మూడు రోజుల క్రితం వరకు కలెక్టరేట్‌ను ఎక్కడ నిర్మిస్తారన్న అంశంపై పలు ఊహాగానాలు, విమర్శలు చోటుచేసుకున్న నేపథ్యంలో సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వం తొలుత జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ ప్రకారం రైతులను భూసేకరణకు ఒప్పించడంతో వీవీ.పాలెం వద్దే కలెక్టరేట్ నిర్మాణం ఖాయమైంది. ఎకరానికి రూ.కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వడానికి జిల్లా రెవెన్యూ అధికారులు అంగీకరించడం, వెనువెంటనే సదరు స్థలాన్ని ఆర్‌అండ్‌బీ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్‌తేజ పరిశీలించడం వంటి పనులు ఆఘమేఘాల మీద జరిగిపోయాయి.
26.16 ఎకరాల భూమి సేకరణ..
కొత్త కలెక్టరేట్ కోసం వి.వెంకటాయపాలెం సమీపంలో 26 ఎకరాల 16 కుంటల భూమిని 20 మంది రైతుల నుంచి సేకరించనున్నారు. నష్ట పరిహారం రూపంలో రూ.26.6కోట్లు, భూసేకరణ చేయడానికి జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించి పబ్లిషింగ్ వ్యయంతో కలిపి రూ.27కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి పంపిన లేఖలో కలెక్టర్ పేర్కొన్నట్లు సమాచారం. కలెక్టర్ లేఖకు స్పందించిన ప్రభుత్వం.. సంబంధిత ఉన్నతాధికారులు, రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం ఈ నిధులు మంజూరు చేయగానే.. రైతులకు నష్టపరిహారం చెల్లించి, భూమిని తొలుత రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోనున్నారు. ఆ వెంటనే కార్యాలయ సముదాయ నిర్మాణానికి రహదారులు భవనాల శాఖకు అప్పగించనున్నారు.
సీఎం చేతుల మీదుగా శ్రీకారం..?
ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసే అవకాశం ఉన్న ఈశాన్య ప్రాంతాన్ని రెవెన్యూ అధికారులు ఇప్పటికే పరిశీలించి, సదరు రైతుల నుంచి అంగీకార పత్రాలను తీసుకున్నట్లు సమాచారం. భూ సేకరణ ప్రక్రియ, నష్టపరిహారం చెల్లింపు వ్యవహారం అంతా వారం రోజుల్లో ముగియనుంది. సీఎం ఖమ్మం జిల్లా పర్యటన ఎప్పుడు ఖరారైనా వి.వెంకటాయపాలెంలో కలెక్టరేట్ సముదాయ నిర్మాణానికి భూమి పూజ చేయించడానికి అవకాశం ఏర్పడుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment