
సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ట్రం.. ఆపై కొత్త జిల్లాలు.. ఈ క్రమంలో త్వరితగతిన ఎస్పీలుగా పదోన్నతులు పొందిన కొందరు జూనియర్ ఐపీఎస్ అధికారులు చేసిన కొన్ని పనులు ఇటీవల మొత్తం పోలీస్ శాఖను ఒత్తిడికి గురిచేశాయి. అలాంటి అనాలోచిత చర్యలకు చెక్‌పెట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి పోలీసు శాఖ అనుభవజ్ఞులైన అధికారులను రంగంలోకి దించింది. సిరిసిల్లా జిల్లాలో జరిగిన నేరెళ్ల ఘటన తర్వాత పోలీస్ శాఖ మూడేళ్లలో సాధించిన ఘనత కొంత దెబ్బతిన్నా మళ్లీ పట్టాలు ఎక్కేందుకు కొత్త డీజీపీ మహేందర్‌రెడ్డి కార్యాచరణ రూపొందించే పనిలో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
నేర నియంత్రణ, ఆధునీకరణే ప్రధానం..
జిల్లాల వారీగా, ముఖ్యంగా కొత్త జిల్లాల్లో పోలీస్ శాఖ పనితీరుకు సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని నూతన డీజీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలు ఏర్పడి ఏడాది పూర్తవడంతో ఇప్పటివరకు తీసుకున్న చర్యలేంటి? ఏ తరహా నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి? వాటికి కారణాలు, నియంత్రణకు చేపట్టిన చర్యలు.. తదితర అంశాలపై డీజీపీ పూర్తి స్థాయిలో ఆరా తీయనున్నట్టు తెలుస్తోంది. అదే విధంగా ఆధునీకరణకు సంబంధించి స్టేషన్ల నిర్వహణ, ఎస్‌ఐలు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ల పనితీరు, డీఎస్పీలు చేస్తున్న పర్యవేక్షణ, ప్రజల భాగస్వామ్యం ఎంతవరకు ఉందన్న అంశాలపై డీజీపీ దృష్టి సారించే అవకాశాలున్నాయి.
డీపీఓలు, సిబ్బందిపై దృష్టి
జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్(డీపీఓ)ల నిర్మాణాలు, వాటి డిజైన్ల ఖరారు, నూతన కమిషనరేట్ల నిర్మాణం, సిబ్బంది కొరత, టెక్నాలజీ వినియోగం.. ఇలా అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని కార్యాచరణ ప్రారంభించాలని మహేందర్‌రెడ్డి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లాల్లో పరిస్థితులపై నివేదికలివ్వాలని ఐజీలు నాగిరెడ్డితోపాటు స్టీఫెన్ రవీంద్రను డీజీపీ ఆదేశించినట్టు తెలిసింది. ఈ నివేదికల ఆధారంగా జిల్లాల పోలీసింగ్‌లో తీసుకురావాల్సిన మార్పులపై మహేందర్‌రెడ్డి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.