హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లా ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటనతో జిల్లాల పునర్విభజన ప్రక్రియ ఊపందుకుంది. తమ ప్రాంతానికి కొత్త జిల్లా కావాలంటూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రభుత్వానికి విన్నపాలు వచ్చాయి. ప్రజా సంఘాలు, స్వచ్ఛంధ సంస్థలతో పాటు ప్రతిపక్ష పార్టీల నుంచి, అధికార పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఇప్పటివరకు 33 వినతులు సర్కారుకు అందాయి. ఒక్క నిజామాబాద్ జిల్లా నుంచి మాత్రం ఎటువంటి వినతులు రాకపోవడం విశేషం. కొత్త జిల్లాల ఏర్పాటు కోసం అత్యథికంగా వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి 11 చొప్పున, అత్యల్పంగా అదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఒక్కొక్కటి చొప్పున రిప్రజెంటేషన్లు ప్రభుత్వానికి అందాయి.
అదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్‌తో పాటు కొత్తగా నిర్మల్‌ను జిల్లా చేయాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు. అలాగే కరీంనగర్ జిల్లాలో మెట్‌పల్లి లేదా కోరుట్లను జిల్లాగా చేయాలని కోరుతుండగా, ఖమ్మం జిల్లాలో భద్రాచలాన్ని జిల్లాగా చేయాలని మూడు వినతులు సర్కారుకు అందాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్తగా గద్వాల్‌ను జిల్లా చేయాలని 8వినతులు అందగా, వనపర్తి కోసం మూడు వినతులు వచ్చాయి. మెదక్ జిల్లా నుంచి వచ్చిన మూడు వినతుల్లోనూ మెదక్‌ను జిల్లా కేంద్రంగా మార్చాలని సర్కారుకు విజ్ఞప్తి చేయడం గమనార్హం.నల్గొండ జిల్లా నుంచి వచ్చిన రెండు వినతుల్లో ఒకటి యాదగిరి గుట్టను కొత్త జిల్లాగా మార్చాలని కోరగా, రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలను జిల్లాలుగా ప్రకటించాలని మరొక వినతిపత్రం అందింది. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి అందిన వినతిపత్రంలో వికారాబాద్ లేదా మేడ్చల్‌ను కొత్త జిల్లా చేయాలని స్థానికులు ప్రభుత్వానికి విన్నవించారు.
వరంగల్ జిల్లాలో సమ్మక్క-సారలమ్మ పేరిట ఒక జిల్లాను ఏర్పాటు చేయాలని, మహబూబాబాద్, జనగాంలను కొత్త జిల్లాలుగా మార్చాలని ఆయా ప్రాంతాల నుంచి సర్కారుకు ఏకంగా 11 వినతులు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రిప్రెంజెంటేషన్లను తదుపరి చర్యల నిమిత్తం భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ)కు పంపింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చిన వినతులను పరిశీలించి, సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లను సీసీఎల్‌ఏ ఆదేశించారు. జిల్లాల నుంచి నివేదికలు అందిన తర్వాత కొత్త జిల్లాల పేరిట ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీచేసి నిర్ణీత గడువులోగా అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆపై ప్రభుత్వ ఆదేశాల మేరకు తుది నోటిఫికేషన్ జారీచేస్తామని రెవెన్యూ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.