సరికొత్తగా రాష్ట్ర బడ్జెట్!
ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులకు స్వస్తి
సాక్షి, హైదరాబాద్: వచ్చే బడ్జెట్‌ను సరికొత్తగా రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలను వేర్వేరుగా చూపించే పాత బడ్జెట్ సంప్రదాయానికి స్వస్తి పలికింది. ఆనవాయితీకి భిన్నంగా 2017–18 బడ్జెట్ తయారీకి కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. ప్రణాళిక, ప్రణాళికేతర ఖర్చులను వేర్వేరుగా ప్రతిపాదించాల్సిన అవసరం లేదని అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు అవసరమయ్యే నిధులన్నీ ఒకేచోట ప్రతిపాదించాలని సూచించింది. రెండు వారాల్లో అన్ని శాఖలు తమ ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించింది.
ఈసారి అన్ని శాఖలు తమ పరిధిలో జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులు, వడ్డీలు, బకాయిలను వేరుగా పంపించాలని సూచించింది. ప్రతిపాదనలను పక్కాగా రూపొందించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలు, కార్యక్రమాలు సమీక్షించుకుని అంచనాలు పొందుపరచాలని పేర్కొంది. 2017–18లో వచ్చే రాబడులతో పాటు అవసరమయ్యే ఖర్చుల అంచనాలన్నీ నిర్దిష్టంగా పొందుపరిచాలని సూచించింది.